ఓటుకు ఐదు వేలిచ్చినా.. ఓటేయలేదా!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మీడియాలో బాగా నానిన నియోజకవర్గాల్లో కూడా అతి తక్కువ పోలింగ్ నమోదు కావడం విశేషం. ఆ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు.. అనే అంశం మొదటి నుంచి చర్చనీయాంశంగా నిలిచింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ఆఖరిరోజు పోలింగ్ వరకూ అందరిలోనూ ఆసక్తిని రేపాయి కొన్ని నియోజకవర్గాలు. అలాంటి వాటిల్లో ముందు వరసలో నిలిచాయి శేరిలింగంపల్లి, కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు.

కూటమిలో భాగంగా ఈ సీట్లు టీడీపీకి దక్కడం.. ఈ సీట్లలో టీడీపీదే గెలుపు అనే ప్రచారం గట్టిగా సాగడం.. గత ఎన్నికల పరిణామాలు, కూకట్ పల్లి నుంచి నందమూరి సుహాసిని బరిలో దిగడం, ఓటుకు ఐదువేల రూపాయలు పంచారనే మాట కూడా గట్టిగా వినిపించడం... ఇలా అనే అంశాలు ఈ నియోజకవర్గాలను వార్తల్లో నిలిపాయి.

మరి అంతచేసినా.. కూకట్ పల్లిలో నమోదైన పోలింగ్ శాతం యాభై ఏడు. శేరిలింగంపల్లిలో మరీ దారుణంగా నలభై ఎనిమిది శాతం! కూకట్ పల్లిలో ఓట్లున్న వారిలో నూటికి యాభై ఏడు మంది మాత్రమే తమ హక్కును వినియోగించుకున్నారు.

శేరిలింగంపల్లిలో సగానికి సగంమంది పోలింగ్ బూత్ ల వైపు చూడనేలేదు. పాతబస్తీలో పోలింగ్ పర్సెంటేజీ తక్కువగా ఉంటుందనుకుంటే.. ఆ నియోజకవర్గాలతో పోటీపడ్డాయి ఈ నియోజకవర్గాలు. ఓటుకు ఐదు వేల రూపాయలు పంచిన నియోజకవర్గాల్లో కూడా ఇంత తక్కువ పోలింగ్ శాతం నమోదైంది.

మరి ఓటుకు వీళ్లు ఓట్లే గనుక ఇవ్వకపోయుంటే.. ఈ శాతం మరింత తగ్గిపోయేదేమో! ఈ నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ నమోదు కావడం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే ఇబ్బందికరమైన అంశం అని విశ్లేషకులు అంటున్నారు.

టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లు గట్టిగా అనుకుంటే.. పోలింగ్ శాతం భారీగా పెరిగేదని.. భారీగా సెటిలర్ల ఓట్లు ఉన్న చోట తెరాసను ఓడించాలని వారు కంకణం కట్టుకుని ఉంటే.. డెబ్బైశాతం వరకూ పోలింగ్ నమోదయ్యే అవకాశాలుండేవని విశ్లేషిస్తున్నా.

తక్కువ పోలింగ్ శాతం నేపథ్యంలో.. ఈ నియోజకవర్గాలపై టీడీపీకి పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి ఏమీలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show comments