ఎమ్బీయస్‌: నాయకులు మారాలి

ఎన్టీయార్‌ బయోపిక్‌ వచ్చింది, వెళ్లింది. అది నికార్సయిన ఫ్లాప్‌ అని అందరూ ఒప్పుకున్నారు. ఎందుకు విఫలమైందో సమీక్షించటం లేదిక్కడ. నిజానికి నటీనటులందరి అభినయం చాలా బాగుందని విమర్శకులు చెప్పారు. ప్రేక్షకులు థియేటరుకి వెళ్లి సినిమాకు వంకలు పెడితే అదో పద్ధతి. అసలు అటువైపు తొంగి చూడలేదు. ఎన్టీయార్‌ వంశమే వేరు, బ్రీడ్‌ వేరు, ఆయన దైవాంశ సంభూతుడు కాబట్టి, మొదటి భార్యతో ఆయన వైవాహిక జీవితం తెలుసుకోవాలని అందరికీ కుతూహలం ఉండి తీరుతుంది కాబట్టి జనాలు విరగబడి వస్తారని నిర్మాతలు ఆశ పెట్టుకుని, టిక్కెట్టు ధరలు పెంచి, స్పెషల్‌ షోలు వేసి, సినిమా ప్రచారంలో మంత్రులు పాలు పంచుకుని, వాళ్లు మూకుమ్మడిగా సినిమాకి వెళ్లిన సంగతి పేపర్లలో రాయించుకుని.. యింత అడావుడి చేసినా జనం చూడడానికి రాలేదు.

సినిమా జీవితంలో ఒడిదుడుకులు ఏమీ చూపించలేదు కాబట్టి, డ్రామా లేక మొదటి భాగం  పండలేదు, రాజకీయ నాయకుడిగా సంచలనాలు సృష్టించాడు కాబట్టి రెండో భాగం తప్పక చూస్తారనుకుంటే దానికి బొత్తిగా జనాలు రాలేదు. ఎన్టీయార్‌కు బదులు మహానాయకుడిగా బాబును చూపించారు కాబట్టి యీ సినిమా ఆడకపోతే బాబుకు చెడ్డపేరు వస్తుందన్న భయంతో కొందరు టిడిపి నాయకులు ఉచితంగా షోలు వేసినా జనాలు రాలేదు. ఏమిటి దాని అర్థం? జనాలకు ఎన్టీయార్‌ సినీజీవితంపై, రాజకీయ జీవితంపై ఆసక్తి లేదు అని కాదా? మరి సావిత్రి సినిమా చూశారే! అనేకమంది క్రీడాకారులది చూశారే! అని అడగవచ్చు. వాళ్లు ఆ సినిమాల్లో ఉన్న డ్రామా గురించి చూశారు తప్ప ఆ యా వ్యక్తులపై అభిమానంతో కాదని అనుకోవాలి మరి. యాత్ర సినిమా కాస్తో కూస్తో ఆడుతోందంటే దానిలో ఉన్న ఎమోషన్స్‌ కోసమే అనుకోవాలి. పైగా మమ్ముట్టి అభినయం ప్లస్సయింది. తక్కువ బజెట్‌లో, తక్కువ హంగామాతో రిలీజైంది కాబట్టి అలాఅలా ఆడేస్తోందనుకోవాలి. అదే వైసిపి వాళ్లు దాన్ని తమ భుజాన వేసుకుని హంగామా చేసి ఉంటే మహానాయకుడిలాగానే తయారయ్యేదేమో!

ఈనాటి జనాభాలో ఎన్టీయార్‌ అభిమానులు లేకపోలేదు కానీ వాళ్ల సంఖ్య తక్కువై పోయింది. కాలంతో బాటు అభిరుచులు మారుతూ వస్తున్నాయి. ఆనాటి ఎన్టీయార్‌ సినిమా ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. వాళ్లు టీవీల్లో పాత సినిమాలు చూస్తున్నారంటే తమ జ్ఞాపకాల కోసం, అంటే అది మొదటిసారి చూసినపుడు తాము ఎలా ఉండేవారో గుర్తు చేసుకోవడానికి చూస్తున్నారనుకోవాలి. కొత్త తరం వారికి కొన్ని పౌరాణికాల్లో తప్పిస్తే ఆయన నటన ఘనంగా ఏమీ అనిపించటం లేదు. కల్పిత కథ, కథనం, డ్రామా, ఎమోషన్స్‌, పాటలూ, స్టంట్లూ అన్నీ వుంటే సినిమా చూస్తారు కానీ ఆ సినిమాలోని తారల జీవితాల గురించి, సాంకేతికగణం గురించి సినిమా చూపిస్తే చూడరని తేలింది. ''బాహుబలి'' రెండోసారీ, మూడోసారీ చూస్తాం. కానీ ''మేకింగ్‌ ఆఫ్‌ బాహుబలి'' అని రెండున్నర గంటలు సినిమా తీస్తే బాబోయ్‌ అంటాం. అరగంటకు మించకుండా తీస్తే ఓసారి చూసి ఊరుకుంటాం. అలాగ తెరవేలుపుల నిజజీవితం గురించిన వివరాలు మాకు అనవసరం అని జనాలు చెప్పేశారు. సావిత్రి విషయంలో విషాదం ఉంది కాబట్టి జనాల్ని కదిలించింది. అదే జమున గురించో, భానుమతి గురించో తీస్తే ఆడేది కాదన్నమాట.

ఇది మొదటి భాగం వైఫల్యానికి కారణమనుకుంటే, మరి రెండో భాగమైన రాజకీయ జీవితం గురించి ఎందుకు చూడలేదు? అది కూడా బోరు గానే జనాలు ఫీలయ్యారన్నమాట. 'ఎప్పుడో 35 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు, అవి జరిగేటప్పటికి మనం పుట్టనే లేదు, పుట్టినా గ్రాహ్యత రాలేదు' అని 50 ఏళ్ల లోపు వాళ్లు అనుకున్నారు. ఆనాటి రాజకీయాల గురించి పొలిటికల్‌ హిస్టరీపై అభిరుచి వున్నవారికే తప్ప యిప్పటివారికి  పట్టదు. ఒక కాలమిస్టుగా నాకూ ఆ విషయం తెలుసు. కొందరు పాఠకులు నా మొహం మీదే చెప్పేస్తున్నారు - పాతకాలం సొద ఎందుకు? ఇప్పటి సంగతులు రాయి అని. అభినివేశం ఉన్న కొద్దిమంది కోసమే నేను రాస్తూ ఉంటాను. గతం తెలుసుకుంటే తప్ప వర్తమానాన్ని బేరీజు వేసి, భవిష్యత్తును నిర్మించుకోలేమని నా నమ్మకం. సాధారణ పాఠకుడు లేదా సాధారణ ఓటరు ప్రస్తుతం నాకు లభిస్తున్న సౌకర్యాలు ఏమున్నాయా అనే చూస్తాడు తప్ప, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం మొదటగా ఎవరు ప్రవేశపెట్టారు అని పట్టించుకోడు.

మనం ఎన్నో వసతులు అనుభవిస్తూ ఉంటాం. అవి సమకూర్చినవారెవరు అని ఆలోచించం. నాగార్జున సాగర్‌ నీళ్లు వాడుకుంటున్నవారిని అడగండి - దాన్ని ఎవరు కట్టారు? ఏ ముఖ్యమంత్రి హయాంలో చురుగ్గా పనులు సాగాయి? అని. ఏమో అంటాడు. అలాగే బకింగ్‌హామ్‌ కెనాల్‌, కెసి కెనాల్‌, వైజాగ్‌ పోర్టు... యివి సమకూర్చినవారెవరు? ఏమో. నువ్వు చదువుకున్న స్కూలు బిల్డింగుకి విరాళమిచ్చిన దెవరు? ఏమో! ఓకే, రోజూ నువ్వు ఆఫీసుకి వెళ్లేదారిలో కనబడే విగ్రహం ఎవరిది? ఆయన చేసిన గొప్ప పనేమిటి? ఏమో! మీకు ఎంతో మేలు కలిగిస్తున్న ఫలానా చట్టం రూపకల్పన చేసినదెవరు? దాన్ని అమలు చేసినదెవరు? ఏమో!  వీరి గురించి ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు ప్రస్తావిస్తూనే ఉంటారు, వ్యాసాలు రాస్తూనే ఉంటారు. కానీ మనం పట్టించుకోము. ఇప్పుడున్నవి ఎలాగూ ఉన్నాయి. ఇకపై మనకు దక్కేదేముంది? అనేదే ఆలోచిస్తాం.

ఇలాటి పరిస్థితుల్లో పాత నాయకుల గురించి ప్రస్తావించడం, ఒక స్థాయికి మించి వారిని కీర్తించడం ఏ మేరకు అవసరం అనే ప్రశ్న ఉదయిస్తోంది. తమిళనాడులో అణ్నాదురైను ఆకాశానికి ఎత్తేస్తారు. కనబడిన ప్రతీదానికీ అణ్నా పేరు పెట్టేస్తారు. ఆయన పాలన సాగింది, రెండేళ్ల పాటు మాత్రమే! ఆ రెండేళ్లలో ఎన్ని అద్భుతాలు చేసి ఉంటాడని మనం అనుకోవాలి? ఆయన చనిపోయి అర్ధశతాబ్ది అయింది. అంటే 65 ఏళ్లు పై బడినవాళ్లకి మాత్రమే ఆయన పాలన గురించి కాస్తయినా ఐడియా ఉంటుంది. ఆయన గురించి డిఎంకె, అణ్నా డిఎంకె యిద్దరూ కీర్తించినా, ఆయన పేర ఓట్లడిగినా ప్రతిసారీ ఎవరో ఒకరిని మాత్రమే తమిళ ప్రజలు గెలిపిస్తున్నారు. అంటే అలా గెలిపించడానికి వేరే కారణాలున్నాయి తప్ప అణ్నా పేరు జపించడం వలన కాదన్నమాట.

తమిళనాడులో కామరాజ్‌ తొమ్మిదేళ్లు పాలించారు. మంచి పేరు తెచ్చుకున్నారు. అందువలన కాంగ్రెసు పార్టీ వాళ్లు ప్రతి ఎన్నికలోనూ 'కామరాజ్‌ పాలన మళ్లీ తెస్తాం' అంటూంటారు. అయినా 52 ఏళ్లగా అధికారంలోకి రాలేక పోతోంది. ఎందుకంటే ఆయన పాలన తమిళనాడులో ముగిసి 56 ఏళ్లు అయింది. ఆయన పోయి 44 ఏళ్లయింది. ఆయన ఏం పాలించాడో, ఎలా పాలించాడో తెలిసున్నవాళ్లు 70 ఏళ్లు దాటినవాళ్లే అయి వుండాలి.

ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ ఎన్టీయార్‌ పేరు జపిస్తూ వస్తోంది. బతికుండగానే చేతిలోంచి అధికారం లాగేసుకున్నవాళ్లే ఆయన విధానాలే మాకు ఆదర్శం అంటూ వల్లిస్తూ వచ్చారు. మొదట్లో కొంతకాలం ఆయన బొమ్మ తీసేశారు కానీ, తర్వాత ఆయన పేరు చెప్పకపోతే ఓట్లు రాలవన్న భయం పట్టుకుని మళ్లీ తెచ్చి పెట్టుకున్నారు. అయినా 2004లో, 2009లో ఓడారు. అంటే గెలుపుకి, ఓటమికి టిడిపి విధానాలో, ఎన్నికల వ్యూహమో కారణం తప్ప ఎన్టీయార్‌ పేరు జపం కాదన్నమాట. ఇది గుర్తించకుండా ప్రస్తుతం ఆంధ్రలో అనేక పథకాలకు 'అన్న' పేరు పెట్టేశారు (ఇందులో చంద్రన్న వేరే..). బయోపిక్‌ వైఫల్యం తర్వాతైనా యివన్నీ అనవసరమని వారు  గ్రహించాలి.

టిడిపియే కాదు, వైసిపి కూడా యీ సత్యం గుర్తించాలి. యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది? వైయస్‌ పాప్యులారిటీ 2009 స్థాయిలో యింకా ఉండి వుంటే, జనాలు దాన్ని విరగబడి చూడాలిగా! అంటే వైయస్‌ కూడా ప్రజల స్మృతిపథంలో పాతుకుపోయి లేరు. ఆత్మీయులు మరణించిన సందర్భాల్లో కూడా ఏడాది తిరిగేసరికి జ్ఞాపకాలు మసకబారుతాయి. ఒకప్పుడు వాళ్ల సినిమా కోసం థియేటర్ల దగ్గర చొక్కాలు చింపుకున్నా నాలుగు సినిమాలు ఫెయిలయి తెరమరుగయ్యే సరికి హీరోలను కూడా మర్చిపోతాం. ఇక నాయకులను ఎంతకాలం గుర్తు పెట్టుకుంటాం?

కానీ జగన్‌ యీ విషయం గుర్తించటం లేదు. తన తండ్రి మహా నేత కాబట్టి ఆయన పాలన తిరిగి తెస్తానని, ఆయన విధానాలు అమలు చేస్తాననీ హామీ యిస్తూ ముందుకు వెళుతున్నారు. ఆయన పరిపాలనా కాలమంతా స్వర్ణయుగమే అని జగన్‌ నమ్మితే నమ్మవచ్చు కానీ అది మంచి చెడుల మిశ్రమ కాలమని సాధారణ ప్రజల అభిప్రాయం. అందుకే 2009 ఎన్నికలలో మన్‌మోహన్‌కు మంచి మార్కులు వేసి, వైయస్‌కు పాస్‌ మార్కులు మాత్రమే (ఆయన మాటల్లోనే) వేశారు. వైయస్‌ పాలన తిరిగి తెస్తానంటే కొంతమందికి ఆ కాలంలోని మంచి గుర్తుకు వచ్చి వాఁవాఁ కారాలు చేయవచ్చు, మరి కొంతమందికి జలయజ్ఞం పేరుతో సాగిన ధనయజ్ఞం లాటివి గుర్తుకు వచ్చి హాహాకారాలు చేయవచ్చు.

అయినా వైయస్‌ పాలించినది వైసిపి పార్టీ అధినేతగా కాదు, కాంగ్రెసు పార్టీలోని అనేకానేక నాయకుల్లో ఒక నాయకుడిగా, దిల్లీ సింహాసనానికి సామంతుడిగా! ఆయన పాలనలోని మంచిచెడులలో దిల్లీ అధిష్టానానికి వాటా ఉంది - ఏ మేరకు అనేది మనం స్పష్టంగా చెప్పలేక పోయినా! మళ్లీ అలాటి పాలనే కావాలనుకుంటే జనాలు కాంగ్రెసుకు ఓటేయాలి తప్ప జగన్‌కి కాదు. ఎందుకంటే జగన్‌ కాంగ్రెసుకు చెందినవాడు కాదు, ఒక పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు. సర్వస్వతంత్రుడు. సొంత నిర్ణయాలు తీసుకోగలడు. అందువలన పార్టీ తప్పొప్పులకు ఆయనే బాధ్యుడు.

పైగా తండ్రి వేరు, కొడుకు వేరు. దేవెగౌడ పాలనలా కుమారస్వామి పాలన లేదు, రేపు రేవణ్ణ ముఖ్యమంత్రి అయితే అది యింకోలా ఉంటుంది. నెహ్రూ భావాలు వేరు, ఇందిర భావాలు వేరు, రాజీవ్‌ భావాలు వేరు. పాలనలో ఎవరి మార్కు వారికి ఉంది. సినిమాల్లో చూడండి ఫలానా హీరో కొడుకు అనగానే ఎంట్రీ సులభం. ఫస్ట్‌ సినిమా ఓపెనింగ్స్‌ బాగుంటాయి. అంతే! అచ్చు నాన్నలాగే నటించేస్తా అంటే చాల్లే, ఆయన్ని చూశాంగా అంటారు. ఈ యువహీరో అప్పుడప్పుడు తండ్రిని కాస్త గుర్తు చేసినా, తన కంటూ ఒక ముద్ర ఏర్పరచుకోవాలి. అప్పుడే ప్రజలు అభిమానిస్తారు.

ఇది తెలిసి చంద్రబాబు తెలుగుల ఆత్మగౌరవం, దిల్లీపై పోరాటం వంటి విషయాల్లో ఎన్టీయార్‌ పేరు తీసుకుని వచ్చినా, ఎక్కువగా తన ప్రతాపం గురించే చెప్తూ ఉంటారు. ఇవతల జగన్‌కు అలా చెప్పుకునేందుకు ముఖ్యమంత్రిగా అనుభవం ఏమీ లేదు. కనీసం మంత్రిగా కూడా లేదు. ఎంపీగా ఉండగా తన నియోజకవర్గానికి ఏదైనా చేసి ఉంటే దాని గురించి చెప్పుకోవచ్చు. అది చెప్పుకుంటున్నట్లు తోచదు. అందువలన బాబుకి పోటీగా తన తండ్రి వైయస్‌ పేరే జపిస్తూ ఉన్నారు.

పోయిన మనిషి బతికున్నాయనకు ప్రత్యామ్నాయం కాదు. ఎన్టీయార్‌ పోగానే ఆయన పేరు చెప్పుకుని లక్ష్మీపార్వతి పోటీకి దిగినా బాబు చిత్తుగా ఓడించారు. తర్వాత హరికృష్ణ 'అన్న తెలుగుదేశం' అంటూ తండ్రి ఎన్టీయార్‌ పేరు స్మరిస్తూ రంగంలోకి దిగినా ఆయనదీ అదే గతి. ఇప్పుడు జగన్‌ ఒకవేళ గెలిస్తే అది జగన్‌ పట్ల అనుకూలత, బాబు పట్ల వ్యతిరేకత అనుకోవాలి తప్ప పదేళ్ల కింద ఐదేళ్లు మాత్రం సాగిన వైయస్‌ పాలనను ఓటర్లు గుర్తు చేసుకుని జగన్‌ను నెగ్గించారని అనుకోలేము.

జగన్‌ అలా అనుకోవడం లేదు. సాక్షి పేపరు మొదటి పేజీ మీదే వైయస్‌ ఫోటో, సాక్షి టీవీ ఛానెల్‌ లోగోగా వైయస్‌ ఫోటో. ఎన్నాళ్లిలా? వైయస్‌ ఓటు బ్యాంకు అలాగే పదిలంగా ఉండిపోయి వుంటుందను కుంటున్నారా? వైయస్‌ ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయన ఓటు బ్యాంకు మాత్రమే కారణమా? కాంగ్రెసు ఓటు బ్యాంకు, టిడిపి పాలనపై వ్యతిరేక ఓటు అన్నీ కలవలేదా? వైయస్‌ పోయేనాటికి ఆయన ఓటు బ్యాంకు 'ఎక్స్‌' వుందనుకుందాం. అది స్థిరసంఖ్య అని ఎలా చెప్పగలం?

వైయస్‌ అనుయాయులు, సహచరులు అందరూ వైసిపిలోకి రాలేదు. అనేక పార్టీల్లో సర్దుకున్నారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో వైయస్‌ అభిమానులతో బాటు శత్రువులనూ సంపాదించుకున్నారు. వారు వైయస్‌కు వ్యతిరేకంగా నిలిచారు. జగన్‌కు ఆ బ్యాగేజీ లేదు. ఫలానా వారి అబ్బాయి అనే కానీ, అచ్చు అలాటివాడే అని చెప్పలేం కదా. వైయస్‌ తన తండ్రి రాజా రెడ్డి కంటె భిన్నమైనవాడిగా చూపించుకోవడం చేతనే రాష్ట్రస్థాయికి ఎదగగలిగారు. జగన్‌ కూడా వైయస్‌లా ఉండవలసిన అవసరం లేదు. ఇద్దరి మధ్య ఒక తరం అంతరం ఉంది.

ఇది బాగా గుర్తించినవాడు నవీన్‌ పట్నాయక్‌. ఆయన తండ్రి ఒడిశా రాజకీయాల్లో మహారథి. వాటిని తీవ్రంగా ప్రభావితం చేశాడు. అనేకసార్లు గెలిచాడు, ఓడాడు, గెలిచాడు. కానీ ముఖ్యమంత్రిగా చేసినది ఏడేళ్లు మాత్రమే. మరి నవీన్‌? 2000 సం. నుండి 19 ఏళ్లగా ఏకధాటీగా ఏలేస్తున్నాడు. ఎలా అంటే తండ్రి పేరు నిరంతరం జపిస్తూ కాదు. తన పార్టీ పేరులో తండ్రి పేరు కలిపాడు అంతే. ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు నెలకొల్పలేదు. ఆయన పాలన మళ్లీ తెస్తానని హామీలు గుప్పించలేదు. అనుక్షణం ఆయన పేరును గుర్తు చేయటం లేదు. తండ్రి పోయాకనే 1997లో రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయంగా వ్యూహాలు రచించి, బిజెపితో పొత్తు పెట్టుకుని మూడేళ్లలో ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాతి రోజుల్లో సొంతబలం మీద నెగ్గుతూ వచ్చాడు. బిజూ పాలన ముగిసిపోయిన ఐదేళ్ల తర్వాత నవీన్‌ అధికారంలోకి వచ్చాడు. 5ఏళ్ల క్రితం మా నాన్న పాలన.. అంటూ నవీన్‌ గొప్పలు పోలేదు. మరి వైయస్‌ పోయి పదేళ్లయింది. ఇంకా ఆయన పాలనను ప్రజలు గుర్తు పెట్టేసుకుని మర్చిపోలేకుండా ఉన్నారని అనుకోవడం భ్రమ అనే నా ఉద్దేశం.

అలా అని తండ్రి పేరు అస్సలు చెప్పుకోకూడదని నేననటం లేదు. స్పృశించి వదిలేయాలంతే, చమత్కారం ఉంటే యింకా అంతకంటె బాగా చేస్తానని చెప్పుకోగలగాలి. ఇక్కడ నాకు ఓ విషయం గుర్తుకు వస్తోంది. 1977-80 మధ్య జనతా పార్టీ అధికారంలో ఉండి అంతఃకలహాల్లో మునిగిపోయి 'యీ ప్రభుత్వం పని చేయటం లేదు' అని జనాలు అనుకునేట్లా చేసింది. 1980 ఎన్నికలలో ఇందిరా గాంధీ నినాదం ఒక్కటే - 'గవర్నమెంట్‌ దట్‌ వర్క్స్‌' (మాది పని చేసే ప్రభుత్వం)! జనాలకు ఆ పాయింటు హత్తుకుపోయింది. ఆమెను ఘనంగా నెగ్గించారు.

1984లో ఆమె హత్య జరిగి, రాజీవ్‌ గాంధీ ప్రధాని అయ్యారు. విలేకరుల సమావేశంలో ఆయన్ని అడిగారు - 'మీ అమ్మగారు తనది పని చేసే ప్రభుత్వం అని చెప్పుకున్నారు. మీది ఎలా ఉండబోతోంది?' అని. రాజీవ్‌ చిరునవ్వుతో 'మైన్‌ యీజ్‌ గవర్నమెంట్‌ దట్‌ వర్క్స్‌ - ఫాస్టర్‌' (మాది చురుగ్గా పనిచేసే ప్రభుత్వం) అని చెప్పుకున్నాడు. తల్లి కంటె భిన్నమైన వాడినే కానీ, మెరుగైన వాణ్ని అని చెప్పుకున్నాడు. నిజానికి ఇందిర ఆర్థికవిధానాలన్నిటినీ రాజీవ్‌ తిరస్కరించాడు. సరళీకృత విధానాలను తెచ్చిపెట్టాడు. లైసెన్సులు రద్దు చేశాడు. త్వరత్వరగా నిర్ణయాలు తీసుకున్నాడు.

'అలాగే జగన్‌ కూడా అధికారానికి వస్తే వైయస్‌ పాలనలోని లోపాలు సరిదిద్దుకుని, అంతకంటె మెరుగ్గా పనిచేయవచ్చేమో!' అనే సందేహాన్ని జగన్‌ కలిగించగలగాలి. కలిగించాలంటే వైయస్‌ నామజపం వదిలిపెట్టాలి. పదేళ్ల క్రితం పరిస్థితులు వేరు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. కామధేనువు హైదరాబాదు ఉంది. వాటితో బాటు పదవిలో కొనసాగాలంటే అధిష్టానానికి ముడుపులు చెల్లించవలసిన పరిస్థితీ వుంది, రాష్ట్ర శాఖలో అసమ్మతి సెగ దిల్లీ దాకా తాకకుండా నుండి తస్మదీయులకు తాయిలాలిచ్చి  కుర్చీ కాపాడుకోవాల్సిన అగత్యమూ ఉంది, నయానాభయానా తెరాసను దువ్వవలసిన అవసరమూ ఉండింది.

మరి యిప్పుడు అలాటి యిబ్బందులు లేవు కానీ ప్రభుత్వ ఖజానాకు ఆదాయమార్గాలూ లేవు. కొత్త రాష్ట్రం ఐదేళ్లగా నిలదొక్కుకోలేదు. సంక్షేమ పథకాలు, నిధుల కొరత రాష్ట్రాన్ని దెబ్బ తీస్తున్నాయి. ప్రజల్లో 2014 నాటి ఆశావహదృక్పథం యీ ఐదేళ్లలో హరించుకుపోయింది. ఇలాటి పరిస్థితుల్లో కొత్తగా ఆలోచించాలి. తాము యిస్తానంటున్న సంక్షేమ పథకాలకు నిధులు తేవడానికి ఫలానా ఫలానా కొత్త పథకాలు పెడతామని చెప్పగలగాలి, ప్రజలను నమ్మించగలగాలి. అది పక్కన పెట్టి, గతించిన కాలం గురించి, పాతకాలపు వ్యక్తుల గురించి కీర్తనలు పాడుతూ ఉంటే ప్రయోజనం లేదు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2019)
mbsprasad@gmail.com

Show comments