ఆస్తులుః కేసీఆర్ పాలనలో అన్ని పార్టీల నేతలూ హ్యాపీస్!

ప్రత్యేకత తెలంగాణ ఏర్పడ్డాకా వచ్చిన తొలి ప్రభుత్వం కేసీఆర్ ది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ప్రజల తీర్పును కోరుతోంది. ఐదేళ్లు ముగియకనే.. ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారో చూడాలని అనుకుంటోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. మరి కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ వస్తుందా రాదా.. అనేది ప్రస్తుతానికి మిస్టరీనే. అసలు కథ ఏమిటో డిసెంబర్ పదకొండు వరకూ తెలీదు.

అంతలోపు నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనపై వాదోపవాదాలు సాగుతున్నాయి. తమపాలన అద్భుతమని తెరాస వాళ్లు అంటుంటే.. అలాంటిదేమీ లేదని వ్యతిరేక పక్షాలు అంటున్నాయి. నాలుగున్నరేళ్ల ప్రగతి గురించి పరస్పరం భిన్న వాదనలు, అభిప్రాయాలతో ఇరుపక్షాలూ అమీతుమీ తేల్చుకుంటూ ఉన్నాయి.

మరి నిజంగానే కేసీఆర్ పాలనలో ప్రజలు బాగుపడ్డారా, లేక అసంతృప్తితో ఉన్నారా అనే విషయానికి ఎన్నికల ఫలితాలే అద్దం పడతాయని అనుకోవాలి. ఆ సంగతలా ఉంటే.. ఈ నాలుగున్నరేళ్లలో నేతల ఆస్తులు, ఆదాయాలు మాత్రం భారీగా పెరిగాయి. ఒక్కోరి ఆదాయాలు, ఆస్తులు వందల రెట్లలో పెరగడం విశేషం.

ఈ విషయంలో అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడాలులేవు సుమా! ఒక్కోరి ఆస్తులూ భారీ భారీ స్థాయిల్లో పెరిగిపోయాయంతే! సీఎం కేసీఆర్ ఆస్తి పదిహేను కోట్లరూపాయల నుంచి ఇరవై మూడుకోట్ల రూపాయల రేంజ్ కు పెరిగింది.

ఆయన తనయుడు కేటీఆర్ ఆస్తి ఏడుకోట్ల రూపాయల స్థాయి నుంచి నలభై ఒక్కకోట్ల రూపాయలకు చేరుకుంది. హరీష్ రావు ఆస్తి మూడుకోట్ల రూపాయల నుంచి పన్నెండు కోట్ల రూపాయల రేంజ్ కు పెరిగింది.

ఈటల రాజేందర్ ఆస్తి అయితే పదిహేను కోట్ల రూపాయల స్థాయి నుంచి నలభై ఒక్క కోటి రూపాయలకు చేరింది. ఇతర తెరాస ముఖ్యనేతల ఆస్తులు కూడా ఇదే స్థాయిలో పెరిగాయి. అంతవరకూ కోటీ రెండుకోట్ల రూపాయల స్థాయిలో ఉన్న వారు పదుల కోట్ల రూపాయల రేంజ్ కు చేరారు.

ఇలా పెరిగింది కేవలం అధికార పక్షంలోని నేతల ఆస్తులు, ఆదాయాలే కాదు. ప్రతిపక్షానికీ ఇదే స్థాయిలో న్యాయం జరిగింది. పొన్నాల లక్ష్మయ్య ఆస్తులు ఇరవై కోట్ల రూపాయల రేంజ్ నుంచి అరవై ఎనిమిదికోట్లకు చేరాయి.

గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ ఆస్తులు ఇరవై కోట్ల రూపాయ ల రేంజ్ నుంచి నలభై కోట్ల రూపాయల రేంజ్ కు వెళ్లాయి. రేవంత్ రెడ్డి ఆస్తులు కూడా దాదాపు రెట్టింపు అయ్యాయి! బీజేపీ నేతల ఆస్తులు కూడా రెట్టింపు అయ్యాయి.

ఈ వివరాలు అన్నీ సదరు నేతల ఎన్నికల అఫిడవిట్ ల ద్వారా తెలుస్తున్నవే. మరి వీటిని బట్టి చూస్తే.. కేసీఆర్ పాలనలో ప్రజల సంగతేమో కానీ.. నేతల ఆస్తులు, ఆదాయాలు మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి.

రెడ్డి గారికి తత్వం బోధపడిందా..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్

Show comments