ఇక్కడ ‘రాజ’ మర్యాద...అక్కడ ‘రాయల్’ శిక్ష...!

‘కత్తి గొప్పదా? కలం గొప్పదా?’... అంటూ ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు వ్యాస రచన పోటీలు, వకృ్తత్వ పోటీలు నిర్వహించేవారు. అంతిమంగా కత్తి కంటే కలం గొప్పదని తేల్చేవారు. అలాగే ప్రజాస్వామ్యం గొప్పదా? రాచరికం గొప్పదా? అనే ప్రశ్న తలెత్తితే ప్రజాస్వామ్యమే గొప్పదంటారు. రాచరికాన్ని నిరసిస్తారు. దాన్ని ఫ్యూడల్ వ్యవస్థ అంటారు. క్రూర పాలనగా చెబుతారు. మానవ హక్కులు ఉండవంటారు. వంశపారంపర్య పాలన అంటారు. ప్రజాధనాన్ని దోచుకునే వ్యవస్థ అంటారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజలు తిరుగుబాట్లు చేసి, విప్లవాలు తెచ్చి రాచరిక వ్యవస్థను కూల్చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏర్పరచుకున్నారు. 

ఇతర దేశాల్లో ప్రజాస్వామ్య పాలనను అలా పక్కన పెడితే.. మన దేశంలో మాత్రం సామాన్య ప్రజలు ప్రజాస్వామ్యం కంటే రాచరికమే మంచిదనే అభిప్రాయానికి వస్తున్నారు. మన దేశానికి ప్రజాస్వామ్యం పనికిరాదనే భావనతో ఉన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యం ‘అతి’ అయిందని, శృతి మించిందని మేధావులు సైతం అనుకునే పరిస్థితి ఏర్పడింది. నిజం చెప్పాలంటే రాచరికంలో ఏవైతే అవలక్షణాలు ఉన్నాయని అనుకుంటున్నామో అవన్నీ మన దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాయి.

మనది గొప్ప ప్రజాస్వామ్య దేశమని చెప్పుకోవడానికి కనబడుతున్న ఒకే ఒక కారణం క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతుండటం. పాకిస్తాన్, మరికొన్ని దేశాల్లో ఎప్పుడు సైనిక తిరుగుబాటు జరుగుతుందో, ఎన్నికైన ప్రభుత్వాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. ఆ కోణంలో చూస్తే మనం సేఫ్‌గా ఉన్నామనే చెప్పుకోవాలి. ప్రజాస్వామ్యానికి ఎన్నికలే కొలబద్దనుకుంటే అంతవరకు బాగానే ఉంది. కాని ప్రజాస్వామ్యం ముసుగులో జరుగుతున్న దోపిడీ మాటేమిటి? రాచరికాన్ని దోపిడీ వ్యవస్థగా చెబుతుంటారు. కాని మన ప్రజాస్వామ్యంలో దోపిడీ లేదా? వందల, వేల కోట్లు కాదు లక్షల కోట్లు నాయకులు, పాలకులు, పెట్టుబడిదారులు కలిసి భోంచేస్తున్నారు. 

ఎక్కువ రాజకీయ పార్టీలు వంశపారంపర్యంగానే నడుస్తున్నాయి. భార్యలను, కుమారులను, కూతుళ్లను అప్పటికప్పుడు ముఖ్యమంత్రులను చేసినా అడిగే దిక్కు లేదు. ఏదైనా అంటే ప్రజాస్వామ్యం పేరు చెబుతారు. ‘చెబితే శానా ఉంది... ఇంటే ఎంతో ఉంది’ అన్నట్లుగా మన ‘ఓటి కుండ’ ప్రజాస్వామ్యాన్ని గురించి చెప్పుకోవాలంటే చాలా ‘కత’ ఉంది. ముఖ్యంగా కొన్నేళ్లుగా ప్రజాస్వామ్య విలువలు నశించిపోయాయి. నాయకులు, పాలకులు నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

రాజకీయాల్లో తలలు పండిన నాయకులు సైతం పరిణితితో వ్యవహరించాల్సిందిపోయి రాజ్యాంగ నిబంధనలను, విలువలను తుంగలో తొక్కుతున్నారు. పార్లమెంటు తలుపులు మూసి, టీవీ ఛానెళ్ల ప్రసారాలు, కెమెరాలు బంద్ చేసి పది నిమిషాల్లో ఓ రాష్ట్రాన్ని విభజించినా ఇదేం అన్యాయమని నిలదీసే వ్యవస్థ లేదు. విచ్చలవిడిగా పార్టీలు ఫిరాయిస్తున్నా కడిగేసే సిస్టం లేదు. మన ప్రజాస్వామ్య గొప్పదనానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఎన్నికల్లో ధన ప్రవాహం గురించి చెప్పుకునే పనే లేదు. ‘కురు వంశము ఏనాడో కుల హీనమైనది’... అని ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో దుర్యోధనుడు చెప్పినట్లుగా గత డెబ్బయ్ ఏళ్లలో మన ప్రజాస్వామ్యం మరింత పరిపుష్టి చెందడానికి బదులు మరింతగా భ్రష్టుపట్టింది. 

‘ఎముకలు కుళ్లిన.. వయస్సు మళ్లిన’ వ్యవస్థగా మిగిలింది. ఇతర విషయాలు అలా ఉంచితే.. నేరం చేసినవారికి ఈ దేశంలో శిక్షలు పడవని, నేరగాళ్లు సులభంగా తప్పించుకోవచ్చనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందనేది వాస్తవం. జేబు దొంగలు జైలుకు పోతుంటే కోట్లు తిన్నట్లు రుజువైనవారు దర్జాగా సమాజంలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్నారు. కుంభకోణాలు చేసి బ్యాంకులను లక్షల కోట్లకు ముంచినవారు కళ్లెదురుగానే విదేశాలకు చెక్కేస్తున్నారు. బడా నేరగాళ్లు తెల్లారేసరికి సులభంగా దేశం దాటి పోతున్నారు.

భోపాల్ గ్యాస్ ట్రాజెడీకి కారకుడైన వారెన్ ఆండర్సన్‌ను పాలకులే సగౌరవంగా స్వదేశానికి పంపిన మాదిరి ఘటనలు మన దేశంలో అనేకమున్నాయి. విజయ్ మాల్య, లలిత్ మోడీ విదేశాలకు పారిపోతే ఏం చేశారు? ‘మేం తిరిగిరాం. ఏం పీక్కుంటారో పీక్కోండి’ అని వారు తెగేసి చెబుతుంటే ఏం చేస్తున్నాం? నయీంను పెంచి పోషించింది ఎవరు? మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా నిర్వహించిన బొగ్గు శాఖలో భారీ కుంభకోణం జరిగితే ఏం చేశారు? ఆయేకమీ తెలియదని, అమాయకుడని తేల్చిపారేశారు. దేశంలో ఇప్పటివరకు ఎన్నో కుంభకోణాలు జరిగాయి. ఒక్కదాంట్లోనైనా నేరగాళ్లకు కఠిన శిక్షలు పడ్డాయా? వారు సమాజంలో తిరగలేని పరిస్థితి ఏర్పడిందా? వారి ఆస్తులను జప్తు చేసి రోడ్డు మీద నిలబెట్టారా? మన దేశంలో నేరం రుజువైనా నేరగాళ్లకు కఠిన శిక్షలు పడవనేది మాత్రం వాస్తవం. 

కేసుల విచారణ ఏళ్లూపూళ్లూ పడుతుండటంతో నేరగాళ్లు బెయిల్ మీద బయటకొచ్చి మహారాజుల్లా తిరుగుతున్నారు. పాలకులు కూడా అయిపోతున్నారు. కేసుల విచారణ దీర్ఘకాలం జరగడానికి న్యాయ వ్యవస్థ మీద భారం ఓ కారణం కావొచ్చు. కాని ఈ న్యాయ వ్యవస్థలో సరైన న్యాయం జరగడంలేదనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఉంది. ఒకప్పుడు జైలుకు వెళ్లడం అవమానకరం. ఇప్పుడు రాజకీయంగా ఎదుగుదలకు సోపానం. ఒకప్పుడు జైలుకెళితే చిప్పకూడే అనేవారు. నిజంగానే ఆ భోజనం తిని ఆరోగ్యం పాడైపోయేది. ఇప్పుడు జైలుకెళ్లినోళ్లు మరింత పుష్టిగా తయారై బయటకొస్తున్నారు. 

కుంభకోణాలు జరిగినప్పుడు మన పాలకులు ‘నేరం చేసినవారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదు. కఠినంగా శిక్షిస్తాం’ అని దంబాలు పలుకుతారు. కాని జరిగేది అందుకు విరుద్ధంగా ఉంటుంది. రాజరిక వ్యవస్థ ఉన్న అరబ్ దేశాల్లో ‘సమ న్యాయం’ జరుగుతుందనే అభిప్రాయముంది. అక్కడ ప్రజాస్వామ్యం లేదని, పాలకులు కఠినంగా వ్యవహరిస్తారని, స్వేచ్ఛ లేదని... ఇలాంటివే రకరకాల విమర్శలున్నాయి. ఇవన్నీ ప్రజాస్వామ్య దేశాల నుంచి వస్తున్నవే. ఇస్లాం చట్టాల ప్రకారం నడుచుకునే అరబ్ దేశాల్లో కొన్ని విషయాల్లో ‘క్రూరంగా’ వ్యవహరించే మాట వాస్తవమే. 

కాని నేరగాళ్ల విషయంలో క్రూరంగా, నిర్దయగా వ్యవహరించడం, కఠిన శిక్షలు వేయడం అవసరమనే అభిప్రాయం అక్కడ ఉంది. ‘తమ్ముడు తమ్ముడే...పేకాట పేకాటే’ అన్నట్లుగా నేరగాడు ‘మనోడే’ అయినా చట్టానికి అతీతుడు కాడనే భావనను అక్కడి పాలకులు కలిగిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ... సౌదీ అరేబియాలో రాజ కుటుంబానికి చెందిన యువరాజుకు మరణ శిక్ష అమలు చేయడం. ఇలాంటిది మన దేశంలో ఊహించగలమా? హత్యా నేరానికిగాను ప్రిన్స్ టర్కీ బిన్ సౌద్ బిన్ టర్కీ బిన్ సౌద్ అల్ కబీర్‌కు రియాద్‌లో మరణ శిక్ష అమలు చేశారు. 

నాలుగు దశాబ్దాల తర్వాత రాజ కుటుంబానికి చెందిన ప్రముఖుడికి మరణశిక్ష అమలు చేయడం ఇదే మొదటిసారి. 1975లో ప్రిన్స్ ఫైజల్ బిన్ ముసాయిద్‌కు మరణ శిక్ష అమలు చేశారు. ప్రస్తుతం శిక్షకు గురైన రాకుమారుడు రాయల్ ఫ్యామిలీలో అత్యంత ప్రముఖుడని అదే కుటుంబానికి చెందిన ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ చెప్పారు. శిక్షల విషయంలో రాజులైనా, సామాన్యులైనా ఒక్కటేనని తమ రాజు స్పష్టం చేశారని చెప్పారు. కబీర్ ఆధునిక సౌదీ నిర్మాత కింగ్ అబ్దుల్ అజీజ్ డైరెక్టు వారసుల్లో ఒకడు. ఇతని వయసు, ఇతర వివరాలను ప్రభుత్వం వెల్ల్లడించలేదు. 

సౌదీలో మరణ శిక్ష బహిరంగంగా అమలు చేస్తారనే విషయం తెలిసిందే. మరణ శిక్షంటే తల నరికేయడమే. మన దేశంలోనూ రాజుల కాలంలో ఇదే శిక్ష వేసేవారు. దీన్నే శిరచ్ఛేదం అంటారు. నాగరిక సమాజం ఇలాంటి శిక్షలను అంగీకరించదు. ఇలాంటి శిక్షలు వేసినంత మాత్రాన నేరాలు తగ్గవని అంటారు. ఆ విషయం అలా ఉంచితే శిక్షల విషయంలో పేద, గొప్ప తేడా ఉండదని అక్కడి పాలకులు చాటిచెప్పారు. అయితే రాజరికం అమల్లో ఉన్న అరబ్ దేశాల్లోనూ విద్యాధికులు, ఆధునిక భావాలున్నవారు పెరుగుతుండటంతో వారు ఈ విధమైన క్రూర శిక్షలను వ్యతిరేకిస్తున్నారు. కొందరు దీన్ని సమ న్యాయం అంటున్నారు. పాలకుల నిష్పాక్షకతకు నిదర్శనంగా చెబుతున్నారు. 

యువరాజుకు మరణ దండన విధించడాన్ని సౌదీలోని చాలామంది హర్షిస్తున్నారు. రాజు సల్మాన్‌ను మెచ్చుకుంటున్నారు. సౌదీలో రాజ కుటుంబానికి చెందిన మహిళలకు కూడా మరణ శిక్షలు విధించిన సందర్భాలున్నాయి. ఇవీ బహిరంగ శిక్షలే. నేరగాళ్లకు మరణశిక్ష విధించడం కంటే వారిలో పరివర్తన తేవడం ప్రధానమని కొందరు చెబుతుంటారు. కాని అదంత సులభం కాదు. నేరగాళ్లు మహాత్ములుగా మారినట్లు సినిమాల్లో చూపిస్తారుగాని వాస్తవంలో అలా జరగదు. నేరగాళ్లలో పరివర్తన కోసం బాధితులు జీవితమంతా ఎదురు చూడరు. తగిన శిక్ష పడాలనే కోరుకుంటారు. మన దేశంలో మరణ శిక్ష (ఉగ్రవాదులకు తప్ప) ఎలాగూ పడదు. కనీసం కఠిన శిక్షయినా వేయాలి కదా. కాని మన ప్రజాస్వామ్యంలో అదీ కరువైపోయింది. 

-నాగ్ మేడేపల్లి

Show comments