లక్ష్మీపార్వతి ఫిర్యాదు: 'కోటి' వెనుక వున్నదెవరేంటి.?

స్వర్గీయ నందమూరి తారకరామారావు సతీమణి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత లక్ష్మీపార్వతి తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. కోటి అనే వ్యక్తి తనపై దుష్ప్రచారం చేస్తున్నారనీ, ఆ వ్యక్తిపైనా, ఆ దుష్ప్రచారానికి కారణమైన ఇతర వ్యక్తులపైనా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు లక్ష్మీ పార్వతి, తెలంగాణ డీజీపీని కలిసిన అనంతరం వెల్లడించారు.

సరిగ్గా ఎన్నికల పోలింగ్‌కి కొద్ది రోజులు ముందు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిధిలో కోటి అనే ఓ వ్యక్తి, లక్ష్మీ పార్వతికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. తాను లక్ష్మీపార్వతిని తల్లిలా భావించాననీ, అలాంటి ఆమె తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తోందనీ, తనకు మానసిక క్షోభ కల్గిస్తోందని ఆరోపించాడు కోటి. ఈ మేరకు కొన్ని వాట్సాప్‌ మెసేజ్‌ల్ని కూడా పోలీసుల ముందుంచాడు. మరోపక్క, ఇదే అదనుగా టీడీపీ అనుకూల మీడియాలో ఈ వ్యవహారంపై పెద్దయెత్తున రచ్చ జరిగింది.

'బ్లాక్‌మెయిలర్‌' అనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఓ 'పచ్చ' మీడియా ప్రతినిథి ఈ విషయంలో చూపిన అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. ఓ సాదా సీదా వ్యక్తి, ఓ రాజకీయ ప్రముఖురాలిపై అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తే, కనీసపాటి విజ్ఞత కూడా చూపించకుండా, వాటిని జనం ముందుంచేసి.. 'నైతిక విలువల్ని' తుంగలోకి తొక్కేశారు. ఈ మొత్తం 'కుట్ర' వెనుక టీడీపీ వుందన్నది లక్ష్మీపార్వతి ఆరోపణ.

కోటి అనే వ్యక్తిని తాను కొడుకులా భావించాననీ, ఇలా తన మీద దుష్ప్రచారం చేస్తాడని తాను ఊహించలేదనీ, సభ్య సమాజంలో తన ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేయడానికే ఈ కుట్ర జరిగిందనీ లక్ష్మీపార్వతి చెబుతున్నారు. ఈ తరహా ప్రచారాల విషయంలో తెలుగుదేశం పార్టీపై గతంలో చాలా ఆరోపణలే వెల్లువెత్తాయి. వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిలపై టీడీపీ సానుభూతిపరులు చేసిన దుష్ప్రచారానికి సంబంధించి కేసు నమోదవడం, తెలంగాణ పోలీసులు ఆ కేసుని విచారించి కొందర్ని అదుపులోకి తీసుకోవడం తెల్సిన విషయాలే.

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!

Show comments