లగడపాటి సర్వే: చినబాబు పైత్యమేనా.?

మాజీఎంపీ లగడపాటి రాజగోపాల్‌, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో రాజకీయంగా తన ఉనికిని కోల్పోయారు. 'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగదు.. ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోతే రాజకీయ సన్యాసమే..' అని ప్రకటించిన లగడపాటి, తన జోస్యం తప్పేసరికి.. రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వచ్చిందాయనకి. చింత చచ్చినా, పులుపు చావలేదన్నట్టు.. రాజకీయ సన్యాసం తీసుకున్నా, రాజకీయ 'యావ' ఎలా తగ్గుతుంది.? అందుకే, సర్వేల పేరుతో హల్‌చల్‌ చేయాలనుకున్నారు.

నిజానికి, చంద్రబాబుతో గత కొంతకాలంగా లగడపాటి తెరవెనుకాల అంటకాగుతున్నారు. చంద్రబాబుని అధికారికంగా, అనధికారికంగా కలుస్తూ, సలహాలు.. సూచనలూ ఇస్తూ వస్తున్నారు కేసీఆర్‌. ఈ క్రమంలో లగడపాటికి, చంద్రబాబుగారి పుత్రరత్నం నారా లోకేష్‌తో సన్నిహిత సంబంధాలు మరింత మెరుగుపడ్డాయట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి లగడపాటితో సర్వే చేయించిందే నారాలోకేష్‌.. అంటూ తాజాగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

అయితే, అది ఉత్తుత్తి సర్వేనే అని తేలిపోయింది. సర్వే చేయకపోయినా, చేసినట్లు బిల్డప్‌ ఇచ్చిన లగడపాటి వెనుక 'కథ' నడిపించింది ఇంకెవరో కాదు, నారాలోకేష్‌.. అన్న ప్రచారం గట్టిగా సాగుతోందిప్పుడు. 'ఇండిపెండెంట్లు ఎక్కువమంది గెలవబోతున్నారు..' అనే సంకేతాలు లగడపాటి ఇచ్చాక, తెలంగాణలో ఈక్వేషన్స్‌ ఒక్కసారిగా మారిపోయాయి. పైగా, లగడపాటి ఎంట్రీ ఎప్పుడైతే జరిగిందో, ఆ తర్వాత తెలంగాణలో సెంటిమెంట్‌ మరింత బలపడింది. దానికి కేసీఆర్‌ ఇంకాస్త ఆజ్యం పోశారంతే.

ఇంకేముంది.. తెలంగాణలో ఓటింగ్‌ పోటెత్తింది.. పోలింగ్‌కి ముందు కూడా లగడపాటితో నానాయాగీ చేయించడం చూశాం. ఇలాంటి 'తెలివితేటలు' నారా లోకేష్‌కి కాక ఇంకెవరికి వస్తాయ్‌.? అన్నది తెలుగు తమ్ముళ్ళే ఇప్పుడు ఒప్పుకుంటున్న విషయం. తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యక్షంగా నారాలోకేష్‌ కన్పించకపోయినా.. తెరవెనుక, లగడపాటితో 'చెత్త పబ్లిసిటీ స్టంట్లు' చేయించి, పనికిమాలిన సర్వే వివరాలు బయటపెట్టించి.. ప్రజాకూటమిని నిలువునా ముంచేశారన్నమాట నారాలోకేష్‌.

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లోనూ నారా లోకేష్‌గారి పెత్తనమే టీడీపీ కొంప ముంచిన విషయం విదితమే. కొసమెరుపేంటంటే.. నిండా కులగజ్జి నింపుకుని, నీతులు చెప్పే ఓ మీడియా సంస్థ అధిపతి, చంద్రబాబు పుణ్యమా అని మీడియా బారన్‌గా మారిన మరో మీడియా సంస్థ అధిపతి.. ఈ ఇద్దరూ లోకేష్‌తోపాటు - 'లగడపాటి' సర్వే వ్యూహం పన్ని, ఆ సర్వేకి విపరీతమైన పాపులారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు.

వాళ్ళెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! పవన్‌కళ్యాణ్‌పై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల ఎపిసోడ్‌లోనూ చినబాబుకి సహకరించింది ఆ ఇద్దరు మీడియా పెద్దలేనండోయ్‌.!

Show comments