క్యా కియా లోకేశ్ సాబ్‌

ఒక్కొక్క‌రిది ఒక్కో లోకం. టీడీపీ యువ‌కిశోరం, ఆ పార్టీ ఆశా దీపం నారా లోకేశ్‌కు ట్విట‌ర్ అంటే వ‌ల్ల‌మాలిన ప్రేమ‌. ప్ర‌తిరోజూ ఏదో ఒక అంశం కాదు...జ‌గ‌న్ స‌ర్కార్ చేసే ప్ర‌తి ప‌నిపై ట్విట‌ర్ వేదిక‌గా ఆయ‌న త‌న‌దైన శైలిలో స్పందిస్తుంటాడు. కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు ఆయ‌న అన్ని వేళ‌లా ట్విట‌ర్‌లో అందుబాటులో ఉంటాడు. ఆయ‌న‌కు ఒక‌టికి రెండు భాష‌లు వ‌చ్చున‌ని తెలుగు ప్ర‌జానీకం నిన్న ఆయ‌న ట్వీట్‌ను చ‌దివి అర్థం చేసుకున్నారు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురువారం కియా మోటార్స్‌ను ప్రారంభించాడు. జ‌గ‌న్ మాట్లాడుతూ కియా మోటార్స్ బాట‌లోనే మ‌రికొన్ని కంపెనీలు రాష్ర్టానికి రావాల‌ని ఆకాంక్షించారు. జ‌గ‌న్ మాటలు టీడీపీ యువ‌కిశోరానికి తీవ్ర కోపం తెప్పించాయి. ఆయ‌నకు కోపం వ‌స్తే ఏం చేస్తాడో తెలుసు క‌దా! వెంట‌నే  ట్విట‌ర్ ఎక్కాడు.

"ఏమ‌య్యా జ‌గ‌న్ నీకు తెలుగు అంటే అస‌లు ప‌డ‌దు, నీకు న‌చ్చ‌నిది ఏదైనా నాకు ఇష్ట‌మే. నీకు న‌చ్చేది ఏదైనా నాకు న‌చ్చదు. అందువ‌ల్ల ఇంగ్లీష్ ఊసే ఎత్త‌ను. అవ‌స‌ర‌మైతే హిందీలోనైనా మాట్లాడ‌తా, రాస్తా" అని లోకేశ్ పంతం ప‌ట్టిన‌ట్టున్నాడు.

దీంతో ఆయ‌న తెలుగులో మొద‌లు పెట్టి హిందీని క‌లుపుకుని జ‌గ‌న్‌ను నిల‌దీశాడు. న‌చ్చ‌ని వాళ్ల‌కు ఆయ‌న మొద్ద‌బ్బాయోమో ...న‌చ్చిన వాళ్ల‌కు ఆయ‌న ముద్ద‌బ్బాయి క‌దా. ముసుగులో గుద్దులాట ఎందుకు...ఎల్లోమీడియాకు ఆయ‌న "ముద్దు" అబ్బాయ‌న్న మాట‌. అందుకే ఆయ‌న ట్వీట్‌లో చెప్పిన మాట‌ల్లోని సొగ‌సైన హిందీ వాక్యాల‌ను కావ్యంగా భావించి  "క్యా కియా జగన్‌ సాబ్" అని చ‌క్క‌టి శీర్షిక‌గా  పెట్టుకున్నాయి.

ఇంత‌కూ ఆయ‌న ఏమ‌ని ట్వీట్ ఆడాటంటే...‘చంద్రన్న తెచ్చిన కియాకి మళ్లీ రిబ్బన్‌ కట్‌ చేయడానికి సిగ్గనిపించలేదా?. టీడీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమానికి పేర్లు మార్చడం, రంగులేయడం.. మళ్లీ మళ్లీ ప్రారంభోత్సవాలు చేయడం క్యా కియా జగన్‌ సాబ్‌!. మీ చేతికానితనాన్ని దేశమంతా ఏపీని చూసి నవ్వుతోంది. కమీషన్ల కోసమే చంద్రబాబు కియా తెచ్చారన్నారు కదా?. అదే పరిశ్రమ ప్రారంభోత్సవానికి మీకెంత ముట్టింది?’ అని నారాలోకేష్ ప్రశ్నించాడు.

Show comments