బాబు మానసిక వ్యాధి తగ్గింది.. ఇదిగో సాక్ష్యం

చంద్రబాబుకు అల్జీమర్స్ అనే వ్యాధి ఉందంటారు చాలామంది. నిన్న చెప్పింది ఈరోజు మరిచిపోతుంటారని చెబుతుంటారు. ఇదే నిజమని మనం ఓ నిర్థారణకు వచ్చేయలేం. కానీ కేవీపీ మాత్రం అదే నిజం అంటున్నారు. గతంతో పోలిస్తే ఆయన మానసిక స్థితి చాలా మెరుగైందంటున్న కేవీపీ, అందుకు సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు.

"చంద్రబాబుకు నేను ఓ లేఖ రాశాను. చంద్రబాబు విచిత్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. అది అల్జీమర్స్ కావొచ్చు. లేదంటే మరో మానసికమైన బాధ కావొచ్చు. వెంటనే చికిత్స తీసుకోవాలని చెప్పాను. కొంత ట్రీట్ మెంట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. దానికి సాక్ష్యం ఏంటంటే, గతంలో తనకుతానే మహాత్మాగాంధీ అనుకునేవాడు బాబు. అటువంటిది ఈ ట్రీట్ మెంట్ ప్రభావం వల్ల గాంధీతో పోల్చుకుంటున్నాడు కానీ తనే గాంధీనని చెప్పడం మానేశాడు. ఇది చాలా ఆరోగ్యకరమైన మార్పు."

ఇలా చంద్రబాబు మానసిక స్థితిపై జోకులేశారు కేవీపీ రామచంద్రరావు. గతంలో ప్రత్యేకహోదా అడిగిన వారిని చంద్రబాబు ద్రోహులతో పోల్చారని, ఇప్పుడు మాత్రం వారిని ఉద్యమకారులు అంటున్నారని, దీన్ని బట్టి ఆయన మానసిక స్థితి మెరుగైందని చెప్పవచ్చంటున్నారు కేవీపీ.

"ఇంతకుముందు కేవీపీనా అతడెవరు అనేవాడు. కానీ ఇప్పుడు అతని మానసిక వ్యాధి తగ్గింది. మానసిక పరిస్థితి మెరుగైంది. కేవీపీ ఏ పార్టీలో ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే అడిగే స్థితికి వచ్చారు. చాలా మెరుగైన పరిస్థితి ఇది. గతంలో ఆయన ప్రత్యేకహోదా ఉద్యమకారుల్ని ఆంధ్రా ద్రోహులు అన్నారు. ఈవాళ ప్రత్యేక హోదా ఉద్యమకారులు ఏపీ ప్రయోజనాలను కాపాడుతున్నారని గుర్తించే స్థాయికి వచ్చారు."

చంద్రబాబు ఇలానే మరికొంతకాలం పాటు ట్రీట్ మెంట్ తీసుకొని ఏపీ ప్రయోజనాలు కాపాడాలని కేవీపీ సెటైర్లు వేశారు. బాబు పూర్తిగా కోలుకొని, అందర్నీ గుర్తుపట్టే స్థితికి రావాలని కోరుకున్నారు. తనలాంటి అల్పుడిపై రాజకీయాలు మానుకొని, రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

"అబద్ధాల్ని ఎంతో నిజాయితీగా చెప్పడంలో చంద్రబాబు ప్రసిద్ధి. ఒకరోజు ఆయనకు చారిత్రక అవసరం కింద కనబడుతుంది. ఒకరోజు జాతీయ ఆసక్తి కింద, మరోరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ కింద కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు మహాత్మాగాంధీతో పోల్చుకోండి. మాకేం అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని మాత్రం అల్పులుగా, పార్టీ ద్రోహులుగా చిత్రీకరించడం మాత్రం మానుకోండి. నాకు, పార్టీకి మధ్య అగాథం సృష్టించలేరు. నాలాంటి అల్పజీవులపై మీ తెలివితేటలు వాడొద్దు."

మూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రత్యేక హోదా పోరాటంలో చంద్రబాబు వచ్చి కలిశారని, బాబు కోసం తాము ముందుకురాలేదనే విషయాన్ని గుర్తించాలని కేవీపీ కోరారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుకు ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 

పచ్చ కోటలు బీటలు వారుతున్నాయా..?!

నా నోరు మూయించాలని చూశారు : వీరమాచినేని

Show comments