కూటమి కొత్త భయం: గవర్నర్‌ ఏం చేస్తారో.!

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ, 'మ్యాజిక్‌ మార్క్‌' సాధించలేకపోయినా, అత్యధిక సీట్లు గెల్చుకుంది. కానీ, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. కర్నాటకలో బీజేపీ అత్యధిక సీట్లు దక్కించుకుని, మ్యాజిక్‌ మార్క్‌ చేరలేక అధికారాన్ని చేపట్టలేకపోయింది. అయితే, గోవాలోనూ - కర్నాటకలోనూ బీజేపీ, 'గవర్నర్‌ గిరీ'ని అడ్డంపెట్టుకుని రాజకీయ లబ్దిపొందేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కొంత సఫలమయి, కొంత విఫలమయ్యింది.

గోవాలో ఆ పార్టీ వ్యూహం వర్కవుట్‌ అయి, కర్నాటకలో బెడిసికొట్టింది. తెలంగాణలో ఏం జరగబోతోంది.? కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ కలిసి ప్రజాకూటమిగా ఏర్పడిన దరిమిలా.. కూటమికి మ్యాజిక్‌ మార్క్‌ దక్కినా, మొత్తంగా అత్యధిక స్థానాలు గనుక టీఆర్‌ఎస్‌కి వస్తే అంతే సంగతులు. ఈ విషయమై కూటమి ముందే మేల్కొన్నట్లు కన్పిస్తోంది.

మెజార్టీ స్థానాలు తమకే వస్తాయని కాంగ్రెస్‌ పైకి చెబుతున్నా, అంతిమ ఫలితంపై కాంగ్రెస్‌ నేతల్లో అనుమానాలు చాలానే వున్నాయి. ఈ నేపథ్యంలోనే 'కూటమిని' ఒక్క జట్టుగా పరిగణించాలనీ, ఆ కూటమికి వచ్చే సీట్ల ఆధారంగానే ప్రభుత్వాన్ని పిలవాలనీ, 'సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీ' అంటూ కర్నాటకలో మెలిక పెట్టవద్దని గవర్నర్‌ని కోరేందుకు కాంగ్రెస్‌ సహా, కూటమి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.

గోవాలో సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీని పక్కనపెట్టిన గవర్నర్‌, కర్నాటకలో మాత్రం సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీ వైపు మొగ్గుచూపారు. ఎలాగైనా బీజేపీని గట్టెక్కించేందుకు ఆయా రాష్ట్రాల్లో గవర్నర్‌ అత్యుత్సాహం చూపడమే అందుక్కారణం. తెలంగాణలోనూ అదే పరిస్థితి వుంటుందనీ, ఈ నేపథ్యంలో అవసరమైతే టీఆర్‌ఎస్‌కి మద్దతివ్వాలని బీజేపీ ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేసింది.

బీజేపీ వ్యూహాల నేపథ్యంలో కూటమి అలర్ట్‌ అయినా, గవర్నర్‌ నిర్ణయం బీజేపీకి అనుకూలంగానే వుండే అవకాశముంది. ఇంతకీ, ఓటరు తీర్పు ఎలా వుండబోతోంది.? కలగాపులగం రాజకీయాల వైపే తెలంగాణ ఓటరు మొగ్గుచూపాడా.? ఏ పార్టీకి అయినా స్పష్టమైన మెజార్టీ దక్కుతుందా.? ఫలితాల వెల్లడి తర్వాత గవర్నర్‌ రాజకీయం ఎంత కీలకమవుతుంది.? వేచి చూడాల్సిందే.

టిఆర్ఎస్ గెలిస్తే ఎం జరుగుతుంది?..కూటమి గెలిస్తే ఏమవుతుంది?

Show comments