కూటమి 'ఫట్‌'.. టీఆర్‌ఎస్‌ సూపర్‌ హిట్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి తిరుగులేదు. ముందస్తు ఎన్నికల కోసం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేసిన కేసీఆర్‌, విపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ముందే అధికారాన్ని వదులుకుని 'నైతికంగా' ఘోర తప్పిదానికి పాల్పడిన కేసీఆర్‌, పొలిటికల్‌ గేమ్‌లో మాత్రం పెర్‌ఫెక్ట్‌ స్టెప్‌ వేశారన్నది రాజకీయ పండితుల అభిప్రాయం. 'మళ్ళీ ఎలాగూ అధికారం దక్కుతుంది గనుక.. ఇప్పుడే అధికారం వదులుకోవడం ఉత్తమం' అన్న నిర్ణయానికి కేసీఆర్‌ రావడంతోనే ఇదంతా జరిగింది.

ఇంతకీ, తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏంటి.? అంటే, కాలనీలకు కాలనీలు.. గ్రామాలకు గ్రామాలు.. తెలంగాణ రాష్ట్ర సమితికే తమ ఓటు.. అంటూ తీర్మానించేస్తున్నాయి. 'మా వీధికి మీరు రావొద్దు..' అంటూ విపక్షాల్ని ఉద్దేశించి జనం బోర్డులు కూడా పెట్టేస్తున్నారు. ఇంతకన్నా ఏ రాజకీయ పార్టీకి అయినా అవమానం ఇంకేముంటుంది.? టీఆర్‌ఎస్‌ తరఫున 105 మంది అభ్యర్థులు జనంలో వుంటే, విపక్షాల తరఫున ఒక్కరంటే ఒక్క అభ్యర్థి కూడా ఒప్పటిదాకా ఖరారు కాలేదు.

మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జనసమితి.. మరికొన్ని చిన్నా చితకా పార్టీలు ఒక్కటైనా, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ని ఎదుర్కొనే పరిస్థితి లేదు. నిజానికి, మహా కూటమి అనేది ప్రస్తుతానికి మిధ్య మాత్రమే. సీట్ల పంపకాలు ఎటూ తేలలేదు. ఈలోగా, కూటమికి నాయకత్వం వహించనున్న కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరిపోయాయి. దాంతో, ఆటోమేటిక్‌గా కూటమిలో ఇతర రాజకీయ పార్టీలు తమ గళాన్ని మరింత గట్టిగా విన్పించనుండడం.. ఆ తర్వాత కూటమి కుదేలవడం జరిగిపోతాయనుకోండి.. అది వేరే విషయం.

టీఆర్‌ఎస్‌ ఎలాగూ పూర్తి ధీమాతో వుంది. ఆ తర్వాత అంతటి ధీమా మజ్లిస్‌ పార్టీకే వుంది. టీఆర్‌ఎస్‌ - మజ్లిస్‌ పరస్పర అవగాహనతో కూడిన స్నేహం నడుపుతున్న పార్టీలే. వీటి తర్వాతి ప్లేస్‌ ఖచ్చితంగా బీజేపీకి దక్కేలా వుంది 'ధీమా' విషయంలో. మహా కూటమి కుమ్ములాటల్ని పరిగణనలోకి తీసుకుంటే, టీఆర్‌ఎస్‌కి కాస్తో కూస్తో పోటీ ఇచ్చేది బీజేపీయేనేమో.!

మొత్తమ్మీద, కేసీఆర్‌ అంచనాలు ఏమాత్రం తప్పడంలేదు. ఆయన అంచనా వేసినట్లే అక్టోబర్‌లో గనుక ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చేస్తే.. ఇక, విపక్షాల సంగతి అంతే. అదే జరిగితే, కూటమి కుంపట్లు, టీఆర్‌ఎస్‌కి అదనపు బలాన్నివ్వబోతున్నాయన్నమాట.

Show comments