కులం వర్సెస్‌ సినిమా.. ఇదొక సీరియల్‌!

సినిమా ఇండస్ట్రీలో ఎదుగుదలకూ కులానికీ చాలా సంబంధమే ఉందని ఆ పరిశ్రమలో పనిచేసిన వారే అంటారు. కొంతమందికి కొన్ని ప్రోత్సాహకాలు ఇండస్ట్రీలో కులం మూలంగానే లభిస్తాయనే అభిప్రాయం ప్రజల్లో కూడా బలంగా ఉంది. ఇండస్ట్రీలో ఒక్కోదశలో ఒక్కో కులాధిపత్యం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో రెండేకులాలు పూర్తిగా పీటముడి వేసుకున్నాయనే వైనం కూడా స్పష్టం అవుతుంది. ఒక కులం వాళ్లకు అయితే ఇండస్ట్రీ స్వర్గధామం అనే అభిప్రాయాలున్నాయి. వారికి అక్కడంతా కమ్మగా ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. ఆ కులం వాళ్లు ఇండస్ట్రీలో కాస్త కష్టపడితే చాలు బోలెడన్ని అవకాశాలు వస్తాయనే అభిప్రాయాలున్నాయి. వివిధ ఆధారాలను చూసిన తర్వాతే ఆ అభిప్రాయాలు ఏర్పడి ఉండవచ్చు. సినిమా అనే ప్యాషన్‌ ఉన్న ఆ కులస్తులకు ఇండస్ట్రీలో త్వరగా యాక్సెస్‌ దొరకడం విశేషం ఏమీకాదు. తమ కులస్తుడే అంటూ కోసుకునే వాళ్లు లేకపోయినా, తమ వాడు కాబట్టి పక్కనే పెట్టుకుందామనే వాళ్లు చాలామందే ఉంటారు. సినీ ఇండస్ట్రీలో ఈ ఫీలింగ్స్‌ మరింత ఎక్కువగా ఉండవచ్చు.

సినిమాల్లో నటన విషయాన్ని పక్కనపెడితే.. ఇతర అన్ని టెక్నికల్‌ వ్యవహారాల్లోనూ ఒక కులం వారికి త్వరగా అవకాశాలు వస్తాయని అంటారు. ఈ రోజుల్లో నటన అనేది చాలావరకూ వారసులకే పరిమితం అవుతోంది. నిర్మాతల, దర్శకుల, హీరోల వారసులే ఇండస్ట్రీని నటులుగా ఏలుతూ ఉన్నారు. ఆఖరికి అన్న కొడుకు, తమ్ముడు కొడుకుల కన్నా.. తమ కొడుకులను నిలబెట్టుకోవడమే హీరోలకు ముఖ్యం అవుతోంది. కాబట్టి ఇప్పుడు తమ కులస్తులు ఎవరైనా హీరోలుగా వస్తామంటే అవకాశాలు ఇచ్చే సీన్‌ లేదు. తమ పేరును వాడుకునే తమ రక్త సంబంధీకులకే ఇప్పుడు హీరోలు అంతగా ఎంకరేజ్‌ మెంట్‌ ఇవ్వడంలేదు. అలాంటిది కులం ట్యాగ్‌ తో వచ్చే వాళ్లకు ఇస్తారా? హీరో పాత్రలు, నటన విషయంలో మాత్రం అలా కులానికి ప్రాధాన్యతను ఇవ్వడం తగ్గిపోతోంది.

ఇండస్ట్రీలో స్టాండ్‌ అయిన నిర్మాతలు కూడా.. ముక్కూమొహం సరిగా లేకపోయినా, నటన రాకపోయినా తమ సంతానాన్నే హీరోలుగా రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి.. ఇప్పుడు ఇండస్ట్రీలో కులపిచ్చ కన్నా, సొంత వాళ్లను నిలబెట్టే పిచ్చే ఎక్కువ ఉందని చెప్పవచ్చు. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి కులాభిమానం మాత్రం కారిపోతూనే ఉంటుంది. తమ కులం వాడు తీసిన సినిమాలను అదే కులం చేతిలో ఉన్న మీడియా వర్గాలు ఏ రేంజ్లో మోశారో అందరూ చూశారు. ఒక భారీ సినిమా విషయంలో కుల మీడియా కీలకపాత్ర పోషించి, దాన్ని హైప్‌ పైకి లేవడానికి తెగతాపత్రయ పడిన వైనాన్ని కొన్నేళ్ల కిందట అంతా గమనించారు. ఆ సినిమాకు కుల మీడియా ఇచ్చిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇలా ఇండస్ట్రీలో కులాభిమానం వర్ధిల్లుతూ ఉంది. అది ప్రమాదం లేని కులాభిమానం అనుకోవాలి.

ఇక ఇండస్ట్రీలో కులకలం మరోరకంగా కూడా రేగుతూ ఉంది. అదే సినిమా టైటిళ్లు, పాత్రల పేర్ల విషయంలో. 'వాల్మీకి' టైటిల్‌పై రేగిన దుమారం అందరికీ తెలిసిందే. ఆ సినిమా టైటిల్‌ పట్ల బోయలు అభ్యంతరం చెప్పారు. తమ కులాదైవం అయిన వాల్మీకి పేరుతో సినిమా తీయడాన్ని వారు ఆక్షేపించారు. అందులోనూ తమిళంలో ఆ సినిమా ఆల్రెడీ వచ్చింది. క్రైమ్‌ సినిమాకు, హీరో చేతిలో గన్నుపట్టుకునే సినిమాకు వాల్మీకి టైటిల్‌ సరికాదంటూ వారు నిరసన తెలిపారు. వారు ఈ సినిమా టైటిల్‌ రిజిస్టర్‌ అయినప్పుడే అభ్యంతరాలు చెప్పారు. అయితే ఈ సినిమా యూనిట్‌ వెనక్కు తగ్గలేదు. ఈ సినిమాకు అదే యాప్టబుల్‌ టైటిల్‌ అంటూ వారు హడావుడి చేశారు. ఎంతకూ వెనక్కు తగ్గలేదు.

అయితే శాంతిభద్రత కారణాల దృష్ట్యా, బోయల జనాభా ఎక్కువగా ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ సినిమాను నిషేధిస్తున్నట్టుగా ఆ జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. అప్పటికి గానీ ఈ సినిమా నిర్మాతలు, రూపకర్తలు వెనక్కు తగ్గలేదు. సినిమా టైటిల్‌ మారుస్తున్నట్టుగా ప్రకటించారు. గద్దలకొండ గణేష్‌ అంటూ ఈ సినిమాకు టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. అప్పటికప్పుడు  హీరో పాత్రనే హడావుడిగా టైటిల్‌గా మార్చినట్టుగా ఉన్నారు. అలాకాకుండా.. కాస్త ముందుగానే అలర్ట్‌ అయి ఉంటే.. ఈ సినిమాకు మరో మంచి టైటిల్‌ ఏదైనా పెట్టుకోవడానికి అవకాశం ఉండేది.

ఈ సినిమాకు తమిళ టైటిల్‌ 'జిగర్తాండా'. అదో రకమైన కూల్‌డ్రింక్‌ లాంటిది. మధురైలో బాగా ఫేమస్‌. తమిళులు విస్తరించిన చోట.. ఇతర ప్రాంతాల్లోనూ దాన్ని అమ్ముతూ ఉంటారు. బెంగళూరులో కూడా తమిళనాడు వాళ్లు 'జిగర్తాండా'ను అమ్ముతుంటారు. శరీరాన్ని చల్లబరుస్తుందని తమిళులు దాన్ని సేవిస్తూ ఉంటారు. ఈ సినిమాపై కసరత్తు చేసిన వారికి అలాంటి తెలుగు టైటిల్‌ పెట్టుకునేది కష్టం ఏమీకాదు. అయితే ఆఖరివరకూ వాల్మీకికి ఫిక్స్‌ అయ్యి, తాపీగా ఉండటంతో ఆఖరి నిమిషంలో మరే టైటిల్‌ దొరికినట్టుగా లేదు.

టాలీవుడ్‌లో ఇదివరకూ బోలెడన్ని సినిమాల పట్ల వివిధ కులాల వారు అభ్యంతరాలు చెబుతూ వచ్చారు. గత కొంత కాలంలో అలాంటి రచ్చ భారీగా రేపిన సినిమా 'దేనికైనా రెడీ' ఆ సినిమా పట్ల బ్రహ్మణులు ఘాటుగా స్పందించారు. ఒక మలయాళీ సినిమాకు రీమేక్‌ అయినా సినిమాకు పనిచేసిన రచయితల్లో ఇద్దరు బ్రహ్మణులే! అయితే ఆ సినిమా పట్ల బ్రహ్మణ కులం నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వచ్చాయి. ఆ సినిమా నిర్మాణ వర్గంపై వారు విరుచుకుపడ్డారు. అప్పట్లో అదో పెద్ద రచ్చ అయ్యింది.

ఇక సినిమా డైలాగుల్లో కులాలను తక్కువ చేసే సామెతలు కూడా వివాదాలు రేపాయి. ఇక సినిమాల్లో పాత్రలు వాటి తత్వాలు.. వాటికి కుల ఆపాదనలు కూడా వివాదం అయ్యాయి. కొన్ని కొన్ని పాత సినిమాలను చూస్తే.. అలాంటి కులాపాదనలు ఎక్కువగా ఉంటాయి. కానీ అప్పట్లో వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు జనాలు బాగా సెన్సిటివ్‌ అయ్యారు. ఏదైనా పాత్ర పేరుకు కులం తోక అతికించారంటే..అంతే సంగతులు అన్నట్టుగా మారింది పరిస్థితి. అన్ని కులాలూ ఈ విషయంలో గట్టిగా రియాక్ట్‌ అవుతూ ఉన్నాయి. అయినా సినిమా వాళ్లు మాత్రం  పెద్దగా మారుతున్నట్టుగా లేరు.

తాము కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది ఏదైనా కులాన్ని కించపరచడానికి కాదంటూ.. హరీష్‌ శంకర్‌ తన సినిమా విషయంలో సమర్థించుకున్నాడు. వాల్మీకి గొప్పదనం చెప్పేందుకే తాము తమ సినిమాకు ఆ టైటిల్‌ వాడుకున్నట్టుగా చెప్పాడు. అయినా వాల్మీకి గొప్పదనం ఏమిటో అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు ఏదో వేరే సినిమా తీసి ఆయన గొప్పదనం చెప్పాల్సిన అవసరం ఏమిటో ఆ దర్శకుడికే తెలియాలి. లిబరల్‌గా ఉన్నంత కాలం జనాలు చాలా లిబరల్‌గా ఉన్నారు. రాయలసీమ రెడ్లండే ఫ్యాక్షనిస్టులు అన్నట్టుగా ఇతర కులాల వాళ్లు సినిమాలు చేశారు. ఆఖరికి సొంత పిల్లలను కూడా చంపుకుంటారన్నట్టుగా చూపించారు.

రాజులంటే వారు వ్యసనపరులు అని, మర్యాదలు చేయడంలో వాళ్లు మరీ పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తారని చూపించారు అనేక సినిమాల్లో. దాన్నంతా కామెడీగా మార్చి చూపించారు. అలా ఇండస్ట్రీ 'గౌడ్‌ గాడి చెల్లెలంటే గౌడిగేదెలా ఉంటుందనుకున్నా..' అంటూ డైలాగులు పెట్టేంత వరకూ వచ్చింది. అప్పటికీ జనాల నుంచి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తంకాలేదు. కొన్ని కులాలను అలా లక్ష్యంగా చేసుకోవడం సమర్థనీయం కాదు. ఇప్పుడు రోజులు మారాయి. సినిమా వాళ్లు కూడా మారాలి తప్పదు!

వ్యాపారం కోసం ప్రమాణాలకు తిలోదకాలు

Show comments