కేటీఆర్ కు ఇంత అభద్రతాభావం ఎందుకో!

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ, ఇతర సందర్భాల్లో రాజకీయ నేతలు ఆఫ్ ద రికార్డుగా చెప్పే కబుర్లు, అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చేసే వ్యాఖ్యానాలు అత్యంత ఆసక్తిదాయకంగా ఉంటాయి. మీడియాకు ఇవి పసందుగా ఉంటాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ అయితే లాబీ కబుర్లే బాగా హైలెట్ అవుతూ ఉంటాయి. సభలో జరిగే వాదోపవాదాలకు ధీటుగా లాబీల్లో వినిపించే గుసగుసలు జనాల్లో కూడా ఆసక్తిని రేపుతూ ఉంటాయి.

ఇదేమీ కొత్తది కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అధికార పార్టీల్లోని అసంతృప్త నేతలు, ప్రతిపక్షాల్లోని మాటకారి నేతలు లాబీలను స్పైసీగా మారుస్తూ ఉంటారు. అయితే ఏ పార్టీ కూడా ఆ విషయాల్లో తమ పార్టీ నేతలను కంట్రోల్ చేయాలని అనుకోదు! 

అయితే తొలి సారి తెలంగాణ రాష్ట్ర సమితి ఆ విషయంలో తమ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆఫ్ ద రికార్డు మాటలకు, మీడియాతో లాబీల్లో ముచ్చట్లకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలని తమ పార్టీ వారిని ఆదేశించారు. 

ఇటీవలి మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో నాయిని నర్సింహారెడ్డి మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. వాటి డ్యామేజ్ చేసేలా ఉండటంతో కేటీఆర్ ఆయనతో వివరణ కోరారట. తనేదో క్యాజువల్ గా అంటే మీడియా హైలెట్ చేసిందంటూ నాయిని వివరణ ఇచ్చుకున్నారట. ఈ నేపథ్యంలో క్యాజువల్ టాక్స్ ఏవీ చేయడానికి వీల్లేదంటూ కేటీఆర్ గట్టిగా హెచ్చరిస్తున్నారట నేతలకు. అయినా ఇంత అభద్రతాభావం ఎందుకు?