కేటీఆర్ కు ఆలస్యంగా జ్ఞానోదయం

తెలుగు రాష్ట్రాల్లోని ఏ రీడర్ ను అడిగినా చెబుతాడు, కొన్ని దినపత్రికలు ఏ పార్టీలకు, సామాజిక బంధాలకు అనుగుణగా పనిచేస్తాయో? ట్వీట్టర్ ఫాలోవర్లను అడిగితే చెబుతాయి, ఏ డిజిటల్ ఏ సామాజిక, రాజకీయ బంధాలకు కట్టుబడి పనిచేస్తుందో? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అను'కుల'మీడియా తమ అవసరం కోసం ఎలా కిందకు వంగుతుందో?

ఎన్నికలు వచ్చాక, ఎలా బుసలు కొడుతుందే దశాబ్దాలుగా చూస్తూనే వున్నాం. అయినా కేసిఆర్ అండ్ కేటీఆర్ ఆ మీడియాను నమ్మారు. ప్రకటనలు కోట్ల కొద్దీ కట్టబెట్టారు. మీడియా కూడా ఇక్కడ కేసిఆర్ ను అక్కడ చంద్రబాబుకు భజన చేసుకుంటూ, నొప్పించకుండా వార్తలు రాసుకుంటూ నాలుగేళ్లు కాలక్షేపం చేసేసింది.

కేసిఆర్-చంద్రబాబు కలిసిపోయి వుంటే ఈ మీడియా పని చాలా సులువు అయ్యేది. కానీ అలా జరగలేదు. ఇక తప్పలేదు. ఎందుకంటే కేసిఆర్ కన్నా, చంద్రబాబు కన్నా, సామాజిక బంధాలు బలమైనవి కదా? అందుకే ఇప్పటి వరకు లోపల దాచిన ఒరిజినల్ ను బయటకు తీసాయి.

ఇప్పుడు అంతా అయిపోయాక, చేతులు కాలిపోయాక, కేటీఆర్ నిన్నటికి నిన్న అన్నారు.. ఏమని..'ఆ రెండు పత్రికల యజమానులు కలిసి ఇదంతా చేసారు.. కూటమి ఫార్మ్ చేయించింది, ఈ వ్యవహారం అంతా వాళ్లదే' అని. వాళ్ల సంగతి 11 తరువాత చెపుతాం అని.

ఏంటీ చెప్పేది.. ఏమీ చేసేదిలేదు. కేసిఆర్ అధికారంలోకి వస్తే, మళ్లీ తమ చిట్కాలు అన్నీ వాడి దగ్గరయిపోతారు. లేదూ అంటే కేసిఆర్ అనే వాడిని మళ్లీ లేవకుండా చేస్తారు. వైఎస్ 'ఆ రెండు పత్రికలు' అంటూ గోలగోల పెట్టారు. ఏం జరిగింది? ఏం ఒరిగింది. అయితే కేసిఆర్ కొంచెం బెటర్. చాలావరకు స్వంత మీడియాను విస్తరింపచేస్తున్నారు. అది మరింత విస్తరిస్తేనే కాస్త ఫలితం వుంటుందేమో?

లేదూ అంటే, మరి కొన్ని దశాబ్దాల పాటు ఈ అబద్దాల సామాజిక వంటకాల కార్యక్రమం ఇలా సాగుతూనే వుంటుంది. జనం అదే అమృతం అని సేవిస్తూనే వుంటారు.

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments