ఇది అందరి పార్టీ.. దువ్వుతున్న కేటీఆర్

2014 అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ ఓట్ల చీలిక స్పష్టంగా కనిపించింది. ఓట్లు టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పడినా ఆ తర్వాత నాయకులు అమ్ముడుపోయారనుకోండి. అది వేరే విషయం. జీహెచ్ఎంసీ ఎన్నికల టైమ్ కి ఓటర్లు కూడా చేసేదేమీ లేక నాయకుల లాగే వన్ సైడ్ అయ్యారు. అయితే ఇప్పుడు పరిస్థితిలో మళ్లీ మార్పు వచ్చింది. ఓటర్లు టీఆర్ఎస్ ని అంటిపెట్టుకుని ఉన్నారా లేదా అని చెప్పడం కష్టమని అర్థమవుతోంది.

నాన్ లోకల్ అంతా మహాకూటమి వైపు మొగ్గుచూపుతున్నారని కొన్నిసర్వేలు చెబుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ బాధ్యతను భుజానికెత్తుకున్న కేటీఆర్ జిల్లాలతో పాటు రాజధానిలో ప్రచారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు. స్థానికేతరుల ప్రేమాభిమానాలు పొందేందుకు శ్రమపడుతున్నారు. జిల్లాల్లో తిరుగుతున్నప్పుడు చంద్రబాబుని తిట్టిపోస్తున్న కేటీఆర్, హైదరాబాద్ కు వచ్చేసరికి మాత్రం చంద్రబాబు తమకు శత్రువు కాదంటూ శాంతి వచనాలు వల్లె వేస్తున్నారు.

సీమాంధ్రుల ఓట్లతో పాటు, తెలంగాణలో ఉంటున్న ఇతర రాష్ట్ర ప్రజల ఓట్లపై కూడా ఈసారి టీఆర్ఎస్ సీరియస్ గా దృష్టిపెట్టింది. గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన చాలామంది హైదరాబాద్ లో స్థిరపడ్డారు. వీరంతా స్థానిక ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపించరు, ఏ పార్టీకి అనుకూలంగా ఉండరు. అయితే ఈసారి వీరందర్నీ పోలింగ్ బూత్ వైపు మళ్లించేందుకు, కారు గుర్తుపై ఓటేసేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కేటీఆర్.

ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులకు మద్దతుగా మాట్లాడిన కేటీఆర్, తాజాగా గుజరాత్ సమాజ్ సభ్యులతో భేటీఅయ్యారు. కొంతమంది గుజరాత్ సమాజ్ సభ్యుల్ని పార్టీలో చేర్చుకున్నారు. గుజరాతీ పారిశ్రామికవేత్తలంతా తమ ఉద్యోగస్తుల ఓట్లు టీఆర్ఎస్ కి పడేలా చూడాలని చెప్పారు. ఈసారి అధికారంలోకి వచ్చాక వారి సమస్యలపై ప్రత్యేక దృష్టిపెడతామని హామీఇచ్చారు.

త్వరలోనే మిగతా రాష్ట్రాల వారితో కూడా విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు కేటీఆర్. స్థానికేతరుల ఓట్లపై ఈసారి బాగా ఫోకస్ పెట్టారు. అయితే నాన్-లోకల్ అంశాన్ని కాంగ్రెస్ చాలా పెద్దఎత్తున తెరపైకి తెస్తోంది.

గతంలో హరీష్ రావు, కేసీఆర్.. సీమాంధ్రులకు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోల్ని మరోసారి వెలికితీస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ చేస్తున్న ఈ ప్రత్యేక భేటీలు ఏమేరకు ఫలితాలనిస్తాయో చూడాలి.

టీడీపీలోకి పంపి.. ఎమ్మెల్సీ సీట్లను కొనిచ్చిన చరిత్ర ఆయనది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments