కొత్త కథ: కాబోయే ఎమ్మెల్యేల రేటు కోటి.!

'ఎమ్మెల్యేలను కొంటాం..' అంటూ అధికారంలో వున్న పార్టీలు సిగ్గొదిలేశాయి ఎప్పుడో. బరితెగింపు.. అన్నమాట రాజకీయాల్లో చాలా సర్వసాధారణమైపోయింది మరి. 'రాజకీయ వ్యభిచారం' అన్నాలేదు, 'సంతలో పశువు' అన్నా లేదు.. ఎవడేమన్నా అనుకోనీ.. ఎన్నికల కోసం ఖర్చు చేశా, అమ్ముడు పోవాల్సిందేనని పార్టీ ఫిరాయిస్తున్నవారు భావిస్తోంటే, ప్రజాస్వామ్యం లేదు.. రాజ్యాంగం లేదు.. అన్నట్లు అధికారంలో వున్న పార్టీలు వ్యవహరిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల గురించి ఇంకా చర్చ జరుగుతూనే వుంది. ఇంతలోనే, 'కాబోయే ఎమ్మెల్యేలను కొనేందుకు' ముందస్తు ప్రయత్నాలు షురూ అయ్యాయి. రేటు ఆల్రెడీ ఫిక్సయిపోయింది.. గెలిచినా, గెలవకున్నా.. కోటి రూపాయలు, ఆ పైన తక్షణ చెల్లింపుకి వివిధ రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయట. 'ఓటుకు కోట్లు' లాంటి వ్యవహారమే ఇది.

తెలంగాణలో ఎవరికీ సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశం లేదంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో, ప్రధాన పార్టీలు అలర్ట్‌ అయ్యాయి. కూటమి తరఫున, టీఆర్‌ఎస్‌కి చెందిన ఓ అభ్యర్థిని కొనుగోలు చేసేందుకు ఓ ఎంపీ రంగంలోకి దిగారట.

సదరు ఎంపీ కూడా ఇటీవలే పార్టీ ఫిరాయించారట. ఆయనెవరో కాదు, కొండా విశ్వేశ్వరెడ్డి అని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. అయితే, ఇదంతా ఉత్తదేనని కాంగ్రెస్‌ అంటోంది. కాంగ్రెస్‌ తరఫునే ఈ ప్రయత్నం జరిగిందన్నది టీఆర్‌ఎస్‌ ఆరోపణ.

ఇదిలావుంటే, ముందస్తు కొనుగోళ్ళకు ప్రామాణికం మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వేయేనన్నది గులాబీ నేతలు చేస్తున్న ఇంకో అతి ముఖ్యమైన ఆరోపణ కావడం గమనార్హం. లగడపాటి సర్వే ఆధారంగా చేసుకుని, 'ఫలానా అభ్యర్థి గెలవబోతున్నారు..' అంటూ ఆయా నేతల్ని బుజ్జగిస్తున్నారట ప్రజాకూటమి నేతలు.

మరోపక్క, టీఆర్‌ఎస్‌ నుంచీ ప్రలోభాల పర్వంగా గట్టిగానే వుందన్నది ప్రజాకూటమి నుంచి విప్పిస్తోన్న వాదన. ఈ నేపథ్యంలోనే ప్రజాకూటమి అభ్యర్థులందరికీ 'క్యాంప్‌' ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. కొసమెరుపేంటంటే, ఇండిపెండెంట్లకు విపరీతమైన డిమాండ్‌ వుండడం.

'కోటి' చాలా చిన్నమాట అనీ, 5 నుంచి 10 కోట్ల దాకా బేరాలు జరుగుతున్నాయనీ.. అడ్వాన్స్‌ల పేరుతో అప్పుడే కోట్లు చేతులు మారిపోవడం ప్రారంభమయ్యిందనీ తెలుస్తోంది. డబ్బు మరీ చీప్‌ అయిపోయిందనుకోవాలా.? రాజకీయాలు చాలా ఖరీదైపోయాయని ఆందోళన చెందాలా.!

టిఆర్ఎస్ గెలిస్తే ఎం జరుగుతుంది?..కూటమి గెలిస్తే ఏమవుతుంది?

Show comments