కొత్త పలుకులో కొత్త పలుకులు

జగన్ ఓటమి కోసం తమ మీడియాను ఫణంగా పెట్టింది ఆంధ్రజ్యోతి అంటే తెలుగునాట ఆ పత్రికను అభిమానించేవారు, వ్యతిరేకించేవారు కూడా కాదనలేరు. పోలింగ్ డేట్ లు వచ్చిన నాటి నుంచి పోలింగ్ తేదీ వరకు జగన్ ఓటమికి పనికి వచ్చే వార్తలే తప్ప మరోటి లేవు అన్నదీ తెలిసిందే. అంతకు ముందు అయిదేళ్లూ జగన్ ను కిలో మీటర్ల దూరంలో వుంచారు. ఆఖరికి జగన్ నే 'తమ సమావేశాలకు మీ విలేకరులను పంపవద్దు' అని చెప్పేసారు. పొరపాటును వచ్చిన వారికి మెల్లగా చెప్పి, కేక్ తిని వెళ్లండి అని కూడా అనేసారు.

అలాంటి మీడియా సంస్థను నిలువునా నిరాశలో ముంచేలా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మరో అయిదేళ్ల వరకు ఆంధ్రలో ఇదే ఫ్రభుత్వం వుండకతప్పదు. దాంతో ముందుకుసాగక తప్పదు. మళ్లీ ఎన్నికలు వచ్చినపుడు ఎలాగూ బాబు గారితో బంధం వుంటుంది. కానీ ఈలోగా జగన్ తో శతృత్వం ఎందుకు? పైగా జనాలు జగన్ ను నెత్తిన పెట్టుకున్నాక, జగన్ సిఎమ్ అయిన తరువాత కూడా అతని కార్యక్రమాలకు కవరేజ్ లేకుంటే నవ్వుతారు. అదీకాక ఇప్పుడు జగన్ కు కాకుండా బాబుగారికి కవరేజ్ ఇవ్వడానికి అవకాశం కూడా లేదు.

అందుకే దాదాపు వారం రోజులుగా జ్యోతి నిండా జగన్ వార్తలే. జగన్ ఫోటోలే. అది తప్పనిసరి పరిస్థితి. దానికి ఎవ్వరూ తప్పు పట్టలేరు కూడా. కానీ జనం అంతా ఆసక్తిగా ఎదురుచూసింది, ఈవారం ఆర్కే తన కొత్త పలుకులో ఏం రాస్తారా? అని. ఎందుకంటే కొత్తపలుకులో గతంలో ఆయన నేరుగా జగన్ ను టార్గెట్ చేస్తూ అనేక వ్యాసాలు రాసారు. మరి ఈసారి ఏ అభిప్రాయం వ్యక్తం చేస్తారో? అని ఆసక్తి నెలకొంది.

''....ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అధికారుల నియామకాలు, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి జగన్మోహన్‌ రెడ్డి వేసిన అడుగులు ఆయనకు మంచి పేరునే తెచ్చిపెట్టాయి తండ్రి రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి వ్యవహరించిన తీరును గమనించిన వారికి ఆయన ముఖ్యమంత్రి అయితే..? అన్న భయాలు ఉండేవి. కానీ, తన గతాన్ని ప్రజలు మర్చిపోయేలా జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనలో అవినీతి నిర్మూలనకు, పారదర్శకతకు పెద్దపీట వేస్తామని పదే పదే చెబుతున్న ఆయన, అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నారనే చెప్పాలి...''

ఈ వాక్యాలు అన్నీ ఆంధ్రజ్యోతి ఆర్కేకు కూడా వర్తిస్తాయేమో? ఆయనకు అదే భయం వుండి వ్యతిరేకించారేమో? ఇప్పుడు మారిపోయారని గమనించి దగ్గరయ్యే ప్రయత్నమో, లేదా జగన్ ను కీర్తించే ప్రయత్నమో చేస్తారేమో? వైఎస్ ముఖ్యమంత్రిగా వున్నపుడు జగన్ ఎవర్నీ భయపెట్టలేదు. అసలు సెక్రటేరియట్ లో అడుగుపెట్టలేదు. దొడ్డిదారిన మంత్రికాలేదు? మరి ఎందుకు భయం అన్నది ఆర్కేకె తెలియాలి.

''....చంద్రబాబు పేషీలో పని చేసిన ఒక ముఖ్య అధికారి కారణంగా ఐవైఆర్‌. కృష్ణారావు, అజయ్‌ కల్లం వంటి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు చంద్రబాబుకు వ్యతిరేకంగా మారారు. సదరు అధికారి అధికారుల నియామకాల్లో అడుగడుగునా చంద్రబాబు కళ్లకు గంతలుకట్టారు. అంతేకాకుండా, ప్రస్తుత ప్రభుత్వ ముఖ్య సలహాదారుడైన అజయ్‌ కల్లంకు, పీవీ రమేశ్‌కు మధ్య విభేదాలు సృష్టించారు. ఇవేమీ తెలియని చంద్రబాబు పీవీ రమేశ్‌ను వదులుకోవాల్సి వచ్చింది...''

అంతా అయిపోయిన తరువాత సంత అన్నట్లుగా, సవాలక్ష కారణాలతో చంద్రబాబు దారుణ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కానీ బాబుగారికి పాపం ఏమీ తెలియదట. ఓ అధికారి కారణంగా ఇలాంటివి జరిగాయంట. బాబు కళ్లకు గంతలు కట్టేసారంట. మరి నలభై ఏళ్ల ఇండస్ట్రీ అంతా ఏమైపోయిందో? ఎవరో గంతలు కడుతుంటే బాబుగారు కట్టించుకున్నారా? మొత్తానికి అధికారి కారణంగానైతేనేం, బాబు గారి కళ్లకు గంతలు కట్టేసిన కారణంగానయితేనేం, అయిదేళ్లలో అనేకమంది అమాయకులు ఇబ్బందిపడ్డారని ఆర్కే అంగీకరిస్తున్నట్లేనా? దానికి బాబుగారు మూల్యం చెల్లించినట్లేనా?

అంతేకాదు అజేయ్ కల్లం అంటే బాబుకి బోలెడు గౌరవం అంట. కానీ ఆయనకు పదవి ఇవ్వకుండా ఆ అధికారి ఎవరో అడ్డంపడ్డారట. అంటే నలభై ఏళ్ల బాబు అనుభవం మొత్తం ఆ అధికారి ముందు ఓడిపోయింది అన్నమాట. అంటే బాబుగారి పాలన ఇంతడొల్లనా? ఆర్కేకు తెరవెనుక వ్యవహారాలు అన్నీతెలుసు, బాబుగారికి మాత్రం తెలియవు. పాపం, ఆర్కే చెప్పివుంటే బాగుండేది కదా?

''రాని హోదా కోసం ఆరాటపడే బదులు ఇస్తామన్న ప్యాకేజీని తెచ్చుకోవడం మేలు అని అప్పట్లో నేను స్పష్టంచేశాను. అంతేకాదు, కేంద్రంతో కలిసి ఉంటే కలదు సుఖం అని కూడా సూచించాను.'' ప్యాకేజీకి ఆర్కే మొదటి నుంచి మద్దతు పలికినమాట వాస్తవమే. కానీ తెలుగుదేశం పార్టీ మాట మార్చి హోదా పోరు తలెకెత్తుకున్న తరువాత ఆర్కే మీడియా కూడా అందుకు అనుగుణంగా తన స్వరం మార్చిన సంగతి మరిచిపోతే ఎలా? బాబుగారు వేసిన రంకెలు, కేకలు అన్నీ అక్షరాలుగా మారి జ్యోతి మొదటి పేజీని అలంకరించాయి కదా?

పైగా ఆర్కే కొత్త పలుకు పలుకుతున్నారు. కేంద్రంతో కలిసివుంటే కలదు సుఖం అని ఆయన సూచించారట. కానీ తెలుగుదేశం అభిమానులు, పార్టీ వర్గాల్లో వేరే అభిప్రాయం వుంది. భాజపాకు తెలుగుదేశం పార్టీ దూరం కావడానికి ఆంధ్రజ్యోతి వైఖరి కూడా ఓ కారణం అని టాక్ వుంది.

వెంకయ్యను ఉపరాష్ట్రపతి చేసిన తరువాత జ్యోతిలో వండివార్చిన వార్తలు అనేకం ఈ విధమైన టాక్ కు, గుసగుసలకు ఓ కారణం. అప్పుడు ప్రారంభమైన కార్యక్రమం, పూర్తిగా తెగతెంపులు చేసేవరకు సాగింది. అందువల్ల ఇప్పుడు ఆర్కె చెప్పింది ఓ విధంగా కొత్త పలుకే అనుకోవాలి.

''...ఇలా జరుగుతుందని కూడా అప్పుడే చెప్పాను. రెచ్చగొట్టిన వాళ్ల మాటలకు రెచ్చిపోయిన చంద్రబాబు, రాష్ట్రంలో అధికారం కోల్పోవడమే కాకుండా బీజేపీతో శత్రుత్వం కొని తెచ్చుకున్నారు..'' జ్యోతిని రెగ్యులర్ గా నిశితంగా ఫాలో అయ్యేవారు. ఆర్కే కాలమ్ ఫాలో అయ్యేవారు ఈ మాటలు అస్సలు నమ్మరు. భాజపాతో బాబు శతృత్వం వెనుక ఆర్కే రాతలు, వాతలు కూడా వున్నాయనే చాలా మంది రాజకీయ పరిశీలకుల నమ్మకం. అదే నమ్మకం తెలుగుదేశం పార్టీలోకి జనాల్లో కూడా చాలా వరకు వుంది.

మొత్తంమీద ఇప్పుడు కొత్త పలుకులో, కొత్తపలుకులు కనిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి, కొత్తపలుకు పాత పలుకుల్లా వుంటే అయిదేళ్లపాటు ఇబ్బందులు పడాల్సి వస్తుందనేమో? ఈ కొత్త పలుకు. అన్నట్లు కొద్దిరోజుల క్రితమే అనుకుంటా.. కేసులు మాకు కొత్తకాదు, పోరాడుతూనే వుంటాం అని అన్నారు. కానీ మళ్లీ ఇంతలోనే..?
-ఆర్వీ

పవన్‌ తత్త్వమేమిటో బోధపడలేదు