కొత్త సినిమాకు నాగ్ రెడీ

మన్మధుడు 2 ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని, మళ్లీ సెట్ మీదకు వెళ్లేందుకు హీరో నాగార్జున రెడీ అవుతున్నారు. వాస్తవానికి స్వంత సినిమా బంగార్రాజు చేయాల్సి వుంది. కానీ అనేక కారణాలతో ఆ సినిమాను ఆరు నెలలు వెనక్కు పెట్టారు. ప్రస్తుతం మల్టీస్టారర్ చేయడానికి నాగ్ చైతన్య అంతగా ఇష్టపడక పోవడం, చైతన్య చేతిలో బోలెడు సినిమాలు వరుసగా వుండడం కీలక కారణాలు.

అదీ కాక నాగ్ స్వంత సినిమా చేయడానికి ముందు ఒకటి రెండు బయట సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ తరువాత తన రామరాజు సినిమా అలాగే అఖిల్ (అభిమన్యుడు డైరక్టర్) సినిమా తన బ్యానర్ లో నిర్మించాలని అనుకుంటున్నారు.

వీటన్నింటికి తోడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వ్యక్తిగత కారణాలతో సినిమాలకు ఆరు నెలలు దూరంగా వుండాలని డిసైడ్ అయ్యారు. ఇవన్నీ కలిసి మొత్తం మీద నాగ్ బంగార్రాజు సినిమాను వెనక్కు పెట్టి, వేరే సినిమాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించబోతున్నారని బోగట్టా.

మాట్నీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై కొత్త దర్శకుడు సొలమన్ తో సినిమాను చేయబోతున్నారు. మహర్షి సినిమా స్క్రిప్ట్ లో ఈయన కూడా పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. ఆయన తీసుకువచ్చిన సబ్జెక్ట్ తోనే నాగ్ సినిమా చేయబోతున్నారు. అతి కొద్ది రోజుల్లో ఈ సినిమా సెట్ మీదకు వెళ్లనుంది.

Show comments