టీఆర్‌ఎస్‌లో చిచ్చుకు సురేఖ ప్రయత్నం..!

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆపద్ధర్మ మంత్రి మేనల్లుడు అయిన హరీష్‌ రావు మధ్య చిచ్చు పెట్టడానికి ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గజ్వేల్‌ ఎన్నికల ప్రచార బాధ్యతను కేసీఆర్‌ మేనల్లుడికి అప్పగించారని, హరీష్‌ ఫామ్‌ హౌజ్‌కు వెళ్లి వివరణ ఇచ్చుకున్నారని వార్తలు రాగా, ప్రతిపక్షాలు ఊరుకోవడంలేదు. టీఆర్‌ఎస్‌ అధినేత టిక్కెట్లు ఇవ్వకపోవడంతో ఆయనపై బురద జల్లుతున్న కొండాసురేఖ హరీష్‌ పేరును లాక్కొచ్చారు.

'నేను హరీషన్న వర్గం' అని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌లో హరీష్‌కు ప్రత్యేకంగా గ్రూపు ఉందని సురేఖ కేసీఆర్‌కు చెప్పారన్న మాట. ఆయనకు మద్దతుగా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. రాజకీయాల నుంచి విరమించుకోవాలని ఉందంటూ హరీష్‌ నోరు జారడం ప్రతిపక్షాలకు అస్త్రంలా దొరికింది. నిజంగా విభేదాలుంటే ఎన్నికల తరువాత బయటపడతాయోమో. కేసీఆర్‌, కేటీఆర్‌పై సురేఖ అవినీతి ఆరోపణలు చేశారు. లైసెన్సులు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారని, పర్సంటేజీలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సురేఖకు ఆశ ఎక్కువగా ఉంది. తనకు, భర్త మురళికి, కుమార్తెకు టిక్కెట్లు కావాలని అడిగారని అందుకే పక్కన పెట్టారని వార్తలు వచ్చాయి.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి టిక్కెట్లు ఇస్తే పార్టీలో గొడవలవుతాయని కేసీఆర్‌ భావించి ఉండొచ్చు. సరే... మూడు టిక్కెట్లు ఇస్తానని మొదట్లో చెప్పారని కొందరు నేతలు చెప్పగా, అది అవాస్తవమని కొందరన్నారు. కొండా దంపతులు పది నియోజకవర్గాలను ప్రభావితం చేస్తారని ఇంటలిజెన్స్‌ వర్గాలు కేసీఆర్‌కు చెప్పాయట. ఇదివరకే కాంగ్రెసులో చేరతామని చెప్పిన ఈ దంపతులు ఇప్పటివరకు చేరలేదు. వినాయక చవితి తరువాత కాంగ్రెసులో చేరతామని ఇదివరకు చెప్పినా కార్యరూపం దాల్చలేదు.

 కేసీఆర్‌ తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలేదని సురేఖ ఆవేదన చెందారు. తాను బీసీ మహిళను కాబట్టే ఇలా చేస్తున్నారని అన్నారు. టిక్కెట్లు ఇస్తే ప్రశంసించడం, రాకపోతే నిప్పులు చెరగడం ప్రతి పార్టీలో ఉండే వ్యవహారమే. టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశం ఉందని మీడియా కోళ్లు కూస్తున్నాయి కాబట్టి మంచి అవకాశం పోతోందని సురేఖ ఆవేదన కావొచ్చు.