బిగ్ ట్విస్ట్..వైసీపీలోకి కొణతాల...!!

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైసీపీకి జై  అనేశారు. గత కొంతకాలంగా ఏ పార్టీలో చేరని కొణతాల మళ్ళీ వైసీపీ వైపే చూడడం విశేష పరిణామమే.  ఆయన రేపు లోటస్ పాండ్ లో జగన్ని కలసి పార్టీ కండువా కప్పుకుంటారన్నది లేటెస్ట్ టాక్.

కొణతాల ఇచ్చిన ఈ బిగ్ ట్విస్ట్ అధికార టీడీపీకి మింగుడు పడని వ్యవహారమే. కొణతాల టీడీపీలోకి రేపో మాపో చేరుతారని వూరంతా టాక్. దానికి తగినట్లుగా పసుపు పార్టీ కూడా లీకులు ఇస్తూ వస్తోంది.

విశాఖకు ఈ నెల 17న రానున్న సీఎం చంద్రబాబు సమక్షంలో కొణతాల సైకిలెక్కేస్తారని జోరుగా ప్రచారం సాగింది కూడా. దానికి ఊతమిచ్చేలా కొణతాల కూడా ఈ మధ్యన అమరావతి వెళ్ళి మరీ సీఎం చంద్రబాబుని కలిసి వచ్చారు. ఇంతలో ఏమైందో కానీ కొణతాల టీడీపీకి షాక్ ఇచ్చేలా డెసిషన్ తీసుకున్నారు. 

ఈ రోజు అనకాపల్లిలో జరిగిన అభిమానులు, అనుచరుల సమావేశంలో కొణతాల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ మీటింగ్ జరిగేంతవరకూ కొణతాల టీడీపీలో చేరడానికి డేట్ కోసమేనని అంతా అనుకున్నారు.

మరో వైపు కొణతాల టీడీపీలోకి వస్తే అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని కోరినట్లుగా తెలిసింది. ఐతే ఆ పార్టీలోని ఎమ్మెల్యేలంతా విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు కొడుకు ఆనంద్ పేరు చెప్పి అతనికే సీటు అడిగారు. దాంతో కొణతాల టీడీపీలో చేరిన ఉపయోగం ఉండదని తేలిపోయింది. మరో వైపు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు అడిగినా కుదరదని చెప్పినట్లుగా టాక్.

ఇవన్నీ ఇలా ఉంటే ముప్పయ్యేళ్ళు అదే టీడీపీ నేతలతో రాజకీయ యుధ్ధం చేసిన కొణతాల ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీలోకి వెళ్ళవద్దంటూ మొదటి నుంచి ఆయన అనుచరులు చెబుతూ వచ్చారు.

కొణతాల వైఎస్సార్ ముఖ్య  అనుచరుడు. అందువల్ల ఆయన జగన్ పార్టీలోనే ఉండాలన్నది అభిమానుల డిమాండ్. ఇక టీడీపీలో చేరకుండానే అవమానాలు, తమ్ముళ్ళ తిరస్కారాలు చవి చూసిన కొణతాల ఈ రోజు షాకింగ్ డెసిషనే తీసుకున్నారు. తన అనుచరుల కోరిక మేరకు వైసీపీలో చేరుతున్నారని భోగట్టా. రేపు ఆయన హైదరాబాద్ లో జగన్ని కలుస్తారని అంటున్నారు.

కొణతాల  అనకాపల్లి నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ నుంచి నేతలు వెళ్ళిపోవడమే కాదు చేరాల్సిన వారు కూడా హఠాత్తుగా రూట్ మార్చేయడంతో  టీడీపీకి భారీ రె ఝలక్ తగిలినట్లైందని అంటున్నారు.