కొల్లు సొల్లు: మంత్రిపై దాడి చేసింది వాళ్లేనంట!

మంత్రి పేర్నినానిపై జరిగిన దాడి ఆదివారం హాట్ టాపిక్ గా మారింది. అయితే దాడి చేసింది ఎవరో గంటల వ్యవధిలోనే అక్కడున్నవారు పసిగట్టగలిగారు. నిందితుడు బడుగు నాగేశ్వరరావు టీడీపీ కార్యకర్త, మచిలీపట్నం నగర టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు బడుగు ఉమాదేవికి స్వయానా సోదరుడు. ఇటీవల హత్య కేసు విచారణలో భాగంగా జైలుకెళ్లి బెయిలుపై విడుదలైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ప్రధాన అనుచరుడు.

ఈమాత్రం సాక్ష్యాలు చాలవా.. ఈ దాడిలో రాజకీయ కోణం ఉంది అని చెప్పడానికి. అయితే టీడీపీ చేస్తున్న వితండ వాదన మాత్రం మరీ వింతగా, విడ్డూరంగా ఉంది. కనీసం టీడీపీ కార్యకర్తలు కూడా నమ్మే స్థాయిలో లేకపోవడం విచిత్రం.

ఇసుక రేట్లు పెరిగాయని దాడి..

ప్రజలకేవైనా సమస్యలొస్తే.. నాయకుల దగ్గరకు అర్జీలు తీసుకెళ్తారు, లేకపోతే వారి ఇంటిముందు నిరసన చేపడతారు. మరింత పెద్దగా చేయాలనుకుంటే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం.. ఇలా చాలా రకాల పద్ధతులున్నాయి. మరిక్కడ మంత్రిపై దాడి చేయడాన్ని ఎలా చూడాలి?

ఇసుక రేట్లు పెరిగి, భవన నిర్మాణ పనులు మందగించడం వల్ల, తాపీ పనివారికి కడుపు మండిందట. ఆ కారణంగా మంత్రి పేర్నినానిపై తాపీ పనివాడైన బడుగు నాగేశ్వరరావు, తాపీతోనే దాడి చేశారట. ఇదీ కొల్లు రవీంద్ర చెప్పిన సొల్లు. నిందితుడితో తనకున్న బంధం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో ఆ నెపాన్ని తాపీ పనివారిపైకి నెట్టేశారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.

గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్, మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు భాస్కర్ రావు స్థానికంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో టీడీపీ నాయకుల హస్తం ఉందనేది బహిరంగ వాస్తవం. ఇదే ఆరోపణలతో కొల్లుని ప్రధాన సూత్రధారిగా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. బెయిలుపై విడుదలైన కొల్లు రవీంద్ర అనుచరుడు ఇప్పుడు ఏకంగా మంత్రిపైనే దాడికి తెగబడ్డారు.

దీంతో మరోసారి మచిలీపట్నంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఉనికి కోసం టీడీపీ నేతలు దౌర్జన్యాలకి, హత్యాకాండలకు దిగుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇసుక రేటు పెరిగిందని తాపీ పనిచేసే వ్యక్తి మంత్రిపై దాడి చేశారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. పోలీస్ విచారణలో పూర్తి వాస్తవాలు బైటపడాల్సి ఉంది. 

పవన్ కు ఒక నీతి.. ప్రకాష్ రాజ్ కు మరో నీతి

Show comments