ఏం సెప్తిరి ఏం సెప్తిరి.!

ఆయనో అసెంబ్లీ స్పీకర్‌. పార్టీ ఫిరాయింపులపై ఉక్కు పాదం మోపాల్సిన వ్యక్తి. కానీ, రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి, పార్టీ ఫిరాయింపులపై ఉక్కుపాదం మోపడమా.? అదేంటీ.! అని అమాయకంగా ప్రశ్నించేస్తారు. గట్టిగా అడిగితే, 'సరైన సమయంలో సరైన నిర్ణయం' అంటారు. ఏం చేస్తాం, అసెంబ్లీ స్పీకర్‌కి విశేషాధికారాలు వున్నాయి. ఏ విషయమ్మీద అయినా నిర్ణయం తీసుకోవడానికి, ఆయన ఎంతైనా సమయం తీసుకుంటారు. అంత సమయం తీసుకుని, అసలు నిర్ణయం తీసుకోవాలా.? వద్దా.? అనేది తేల్చుతారు. ఆ తర్వాత చర్యల సంగతి ఆలోచిస్తారు. అదీ అసెంబ్లీ స్పీకర్‌ కథ. 

దురదృష్టవశాత్తూ తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు స్పీకర్లూ ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ముందుగా తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్సార్సీపీ.. తెలంగాణలో బాధిత పార్టీలు. 'పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి..' అంటూ ఆ పార్టీలు నెత్తీనోరూ బాదుకున్నాయి. స్పీకర్‌కి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. అనర్హత వేటు పిటిషన్లపై నిర్ణయం తీసుకోలేదుగానీ, విలీన పిటిషన్లను మాత్రం వెంటనే పరిష్కరించేశారు తెలంగాణ స్పీకర్‌ మధుసూధనాచారి. 

ఇప్పుడిదే వివాదాస్పదమయ్యింది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. అక్కడేం జరుగుతుంది.? అన్నది వేరే విషయం. ఎలాంటి చర్యలు తీసుకుంటారు.? సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌ విధించింది కదా.. అని మధుసూధనాచారి వద్ద ప్రస్తావిస్తే, 'గతంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో పరిశీలిస్తాం..' అని సెలవిచ్చారాయన. అంటే, ఇంకా ఈ విషయమై ఆయన తనంతట తానుగా ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేరన్నమాట. 

రేపో మాపో ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ని అడిగినా, ఆయనా ఇదే సమాధానం చెప్పొచ్చుగాక. కానీ, స్పీకర్‌ అనే పదవికి ఓ గొప్పతనం వుందనీ, ఆ గొప్పతనాన్ని తమ హయాంలో నీరుగార్చేస్తున్నామనీ తెలుసుకోకపోతే ఎలా.? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. పదవి శాశ్వతం కాదు. విలువలు శాశ్వతం. ఆ విలువలకు వలువలూడ్చేస్తే.. ప్రజాస్వామ్యం క్షమించదుగాక క్షమించదు.

Show comments