శతాధిక చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ మరి లేరు

శతాధిక చిత్రాల దర్శకులు కోడి రామకృష్ణ మరి లేరు. తన సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ప్రస్థానాన్ని కలిగిన ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు రామకృష్ణ. ఇటీవలే ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

తొలి సినిమా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తోనే కోడి రామకృష్ణ తనకంటూ ఒక ట్రెండ్ ను సెట్ చేసుకున్నారు. ఆ తర్వాత విభిన్న జోనర్లలో సినిమాలు రూపొందించారాయన. వారి స్వస్థలం పాలకొల్లు. తరంగిణి, ఆలయశిఖరం, ముక్కుపుడక.. వంటి వైవిధ్యభరిత సినిమాలతో కోడి రామకృష్ణ సినీ ప్రస్థానం మొదట్లో సాగింది. ఆ తర్వాత ‘మంగమ్మగారి మనవడు’ వంటి కల్ట్ హిట్ సొంతం చేసుకున్నారు.

తలంబ్రాలు, మువ్వగోపాలుడు వంటి సినిమాల రూపకర్త ఆయన. ఇక అంకుశం, శత్రువు, భారత్ బంద్, ఆహుతి.. వంటి సినిమాలతో కూడా కోడి రామకృష్ణ గుర్తుండిపోతారు. ‘అమ్మోరు’ కోడి రామకృష్ణ రేపిన మరో సంచలనం. అమ్మోరు సూపర్ హిట్ కావడంతో.. ఆ జోనర్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. అలా మరో ట్రెండ్ సెట్ చేశారు కోడి.

ఇక అరుంధతి సృష్టించిన సంచలనాల గురించి వేరే వివరించనక్కర్లేదు. ఆయన  సహచర దర్శకులు దాదాపుగా ఆగిపోయిన సమయంలో.. అరుంధతి ని రూపొందించి సంచలనం రేపారు కోడి రామకృష్ణ. తెలుగుతో పాటు అడపాదడపా కన్నడలో కూడా సినిమాలు రూపొంచారాయన. అందులో భాగంగా కొన్నాళ్ల కిందట వచ్చిన ‘నాగరహావు’ కోడి రామకృష్ణ చివరి సినిమా అయ్యింది.

తెలుగులో భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ కు కోడి రామకృష్ణ ఆస్థాన దర్శకుడిగా వ్యవహరించారు. గోపాల్ రెడ్డి నిర్మాణంలో పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే మల్లెమాల ప్రొడక్షన్స్ తో కూడా కోడి రామకృష్ణకు సూపర్ హిట్ సినిమాలతో అనుబంధం ఉంది.