కోడెలపై తెలుగు తమ్ముళ్ళ 'కసి' ఇంకా తీరలేదా.?

రాజకీయాలన్నాక విమర్శలు మామూలే. రాజకీయాల్లో మరణాలు వివాదాస్పదమవడమూ మామూలే. కోడెల శివప్రసాద్‌ విషయంలోనూ అదే జరుగుతోంది. అయితే, ఇంకాస్త జుగుప్సాకరంగా ఈ ట్రెండ్‌ నడుస్తోంది. కోడెల శివప్రసాద్‌ ఇప్పుడు జీవించిలేరు. ఆయనెందుకు ఆత్మహత్య చేసుకున్నారనేది పోలీసులు విచారణలో తేల్చాల్సివుంది. ఇప్పుడు రాజకీయాలు అనవసరం. విమర్శలకు అసలే ఆస్కారం వుండకూడదు. కానీ, ఇంకా ఆ రాజకీయ రచ్చ కొనసాగుతోంది.

ఇదిలావుంటే, కోడెల శివప్రసాద్‌ అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం తరఫున అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కోడెల కుటుంబ సభ్యులతో చర్చలు కూడా జరుపుతున్నారు అధికారులు. కానీ, అంతిమ సంస్కారాల్లో ప్రభుత్వ లాంఛనాలపై కోడెల కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అభ్యంతరాలు కోడెల కుటుంబ సభ్యుల నుంచా.? తెలుగుదేశం పార్టీ నుంచా.? అన్నదానిపై మళ్ళీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కోడెల అభిమానులేమో, సుదీర్ఘ రాజకీయ అనుభవం కోడెల శివప్రసాద్‌ సొంతమనీ, ఆయన పార్థివ దేహానికి అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు దక్కాల్సిందేనని అంటున్నారు. 'ఇది మనం ఆయనకు చివరిగా ఇచ్చే గౌరవం. ఆ గౌరవానికి ఆయన అన్ని విధాలా అర్హుడు..' అని వారు వాపోతున్నారు. కానీ, తెలుగుదేశం పార్టీ నేతల వాదన ఇంకోలా వుంది. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్నది తెలుగు తమ్ముళ్ళ ఆరోపణ.

మొత్తమ్మీద, తెలుగుదేశం పార్టీ అత్యుత్సాహం చూస్తోంటే, కోడెల శివప్రసాద్‌ పార్థివ దేహానికి అంతిమ సంస్కారాల్ని దక్కనివ్వకుండా చేసేస్తారేమో అన్న భావన కలగడం సహజమే. అయితే, ప్రభుత్వం తరఫున కోడెల కుటుంబ సభ్యుల్ని ఒప్పించేందుకు అధికార యంత్రాంగం తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది. అంత్యక్రియలు పూర్తయ్యాక కావాలంటే తెలుగుదేశం పార్టీ తమదైన స్టయిల్లో శవ రాజకీయాలు చేసుకోవచ్చుగాక. కానీ, కోడెలకు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చెయ్యనివ్వకపోతే మాత్రం, తెలుగుదేశం పార్టీ మరో చారిత్రక తప్పిదానికి పాల్పడినట్లవుతుంది.  

మారని చంద్రబాబు నాయుడు తీరు

Show comments