కోడెల మృతి: టీడీపీకి అంత తొందరెందుకు.?

ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ బలవన్మరణానికి పాల్పడ్డారన్న వార్త బయటకు రావడంతోనే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు 'యాగీ' షురూచేశారు. తొలుత గుండెపోటుగా ప్రచారం జరిగింది.. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయం బయటకు వచ్చింది. ప్రమాదకరమైన ఇంజెక్షన్‌ని తనంతట తానుగా చేసుకుని, కోడెల శివప్రసాద్‌ ప్రాణాలు కోల్పోయారంటూ ఓ వార్త వెలుగు చూసింది.

చివరికి పోలీసులు, కోడెల శివప్రసాద్‌ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తేల్చారు. ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకున్నారని పోలీసులు స్పష్టంచేశారు. ఉదయం టిఫిన్‌ చేశాక, తన రూమ్‌లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారన్నది ప్రస్తుతానికి పోలీసులు, కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాల ఆధారంగా వెల్లడించిన విషయం. పోస్ట్‌మార్టమ్‌ నివేదిక తర్వాత, అసలేం జరుగుతుందన్నది తేలుతుంది. కానీ, ఈలోగా అధికార పార్టీ వేధింపులు తాళలేక కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నారంటూ టీడీపీ గగ్గోలు పెడుతోంది. ఏమో, అది కూడా ఓ కారణం అయి వుండొచ్చుగాక.!

కానీ, కోడెల తీవ్ర ఒత్తిడికి గురికావడానికి చాలా కారణాలున్నాయి. అందులో, టీడీపీ పాపం కూడా లేకపోలేదు. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నేతల్లో కోడెల శివప్రసాద్‌ ఒకరు. కానీ, ఆయన ఇటీవలి ఎన్నికల్లో పార్టీ నుంచి టిక్కెట్‌ దక్కించుకోవడానికి నానా తంటాలూ పడ్డారు. చివరి నిమషంలో కోడెల శివప్రసాద్‌కి టిక్కెట్‌ దక్కింది. అంతలా కోడెల, టీడీపీ టిక్కెట్‌ కోసం ఎదురుచూడాల్సి వచ్చిందంటే దానిక్కారణం, గుంటూరు జిల్లాలో కోడెల కుటుంబ సభ్యుల పట్ల వున్న వ్యతిరేకతే.

నిజానికి, కోడెల శివప్రసాద్‌పై వ్యక్తిగతంగా వున్న రాజకీయ విమర్శల కంటే, ఆయన కుటుంబ సభ్యులపై వున్న రాజకీయ విమర్శలే ఎక్కువ. ఉత్త విమర్శలు కావు, ఏకంగా 'కె-ట్యాక్స్‌' పేరుతో కోడెల శివప్రసాద్‌ కుటుంబ సభ్యులు సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో అరచకాలు సృష్టించారు. ఆ విషయమై స్థానిక టీడీపీ క్యాడర్‌ పలుమార్లు కోడెల శివప్రసాద్‌కి ఫిర్యాదు చేసింది. పార్టీ అధినేత చంద్రబాబుకీ ఫిర్యాదులు వచ్చాయి.

'టీడీపీ ముద్దు.. కోడెల మాత్రం వద్దే వద్దు..' ఎన్నికల తర్వాత కూడా కార్యకర్తలు నినదించారు. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం కోడెలకు పెద్ద కష్టమేమీకాదు. సొంత పార్టీలో, సొంత కుటుంబంలో సమస్యల్ని చక్కదిద్దుకోవడం మాత్రం కత్తి మీద సాముగా మారింది. అదే, కోడెల బలవన్మరణానికి బలమైన కారణం.. అన్నది సర్వత్రా విన్పిస్తోన్న అభిప్రాయం. దాంతోపాటే, ఇటీవల కోడెల చుట్టూ ఇరుక్కున్న కేసుల ఉచ్చు కూడా కోడెల మరణానికి ఓ కారణమై వుండొచ్చు.

శవ రాజకీయాలు టీడీపీకి కొత్తేమీకాదు. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు తమదైన స్టయిల్లో కోడెల మరణంపై తొందరపడ్డారు.. నానాయాగీ చేశారు, చేస్తున్నారు కూడా.!

తన భయం.. రాష్ట్రంపై రుద్దితే ఎలా?

Show comments