కోడెల ప్రస్థానం - గుణపాఠాలు

కోడెల ప్రస్థానం, బలవర్మరణం ఈ సమాజానికి చాలా గుణపాఠాలు చెబుతాయి - ఆకలింపు చేసుకునే ఆసక్తి ఉంటే! బీద రైతు కుటుంబంలో జన్మించి తన తోబుట్టువులు చిన్నప్పుడే చనిపోతే మెడిసిన్ చదివి ప్రజల ఆరోగ్యాలకు బాసటగా ఉండాలని, సమాజానికి సేవ చేయాలని కష్ట నష్టాలకు వెరవక మెరిట్లో ఉన్నత చదువులు చదివి ఒక సక్సెస్ఫుల్ డాక్టరుగా నిలిచిన వ్యక్తి ఆయన.

తన రాజకీయ ప్రథమ ప్రత్యర్థి కాసు కృష్ణారెడ్డి లాగా బంగారు ఉయ్యాలలో పుట్టలేదు కానీ, ఎన్టీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించి మంత్రిని చేస్తే మాత్రం కోడెల కూడా ఫక్టు ఫ్యాక్షన్ రాజకీయ నాయకుడి లాగా రూపాంతరం చెందటం నాలాంటి వాళ్ళను నిరుత్సాహ పరిచింది.

ఒక విద్యాధికుడు, ఒక అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చినవాడు ఈ సమాజానికి గణనీయంగా సేవలందించి జనహృదయాలలో కొలువుతీరే సువర్ణ అవకాశం రావడం ఒక మహద్భాగ్యం, కోడెల దాన్ని కాలదన్నుకున్నాడు.

దీనికి తోడు ఆయన వ్యవహార శైలి, కొడుకూ కూతుర్ల అత్యాశ ఆయన రాజకీయ ప్రవేశానికి ముందు సాధించిన అద్భుత విజయాలను పూర్తిగా నాశనం చేసి ఒక బలహీనమైన మనిషిగా, విఫల రాజకీయ నాయకుడిగా మిగిల్చింది.

ఈ సామాజిక రాజకీయ వ్యవస్థల విఫలమో, ఆ మనిషి నైజమో తెలీదు కానీ ఆయన మాత్రం చరిత్రహీనుడిగా మిగిలిపోయారు. 

పల్నాడులో కాసు కుటుంబ ఆధిపత్యానికి చెక్ పెట్టి చిరస్మరనీయుడిగా నిలిచే అవకాశాన్ని చేజేతులా జారవిడవడానికి కోడెల చేసిన తప్పులు:

1. తను మంత్రి కావాలంటే పార్టీ గెలిచి, తను గెలిచి పలనాడులోని మిగిలిన తెలుగుదేశం అభ్యర్థులు ఓడిపోవాలనే తన స్ట్రాటజీ పార్టీలోనే వ్యతిరేకత తెచ్చింది.

2. విద్యార్థి దశలో ఆ భావన ఉండేదో లేదో కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం కులాభిమానాన్ని ఎక్కువగా ప్రదర్శించి స్థాయిని దిగజార్చుకోవడం

3. రాజకీయ నాయకులంతా కొద్దో గొప్పో అవినీతి చెయ్యడం అనివార్యమైన నేటి సమాజంలో మొదటి మూడు దశాబ్దాల పాటు గౌరవంగానే నెట్టుకొచ్చినా చరమాంకంలో కోడుకూ కూతుర్ల దుర్మార్గమైన అవినీతి దౌర్జన్యాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలవడం అత్యంత ముఖ్యమైన వైఫల్యం.

4. చంద్రబాబు దుర్మార్గంగా 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుక్కుని, అందులో నలుగురిని మంత్రులను చేస్తే సభాపతి స్థానంలో ఉండి అడ్డుచెప్పి తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాల్సిన వ్యక్తి తనే ప్రోత్సహించడం.

5. సభా గౌరవాలను మంటగలిపే విధంగా ప్రతిపక్షాన్ని పూర్తిగా అణగదొక్కాలని చూడటం.

6. కే టాక్స్, అసెంబ్లీ వస్తువుల తస్కరణ వ్యవహారాలు

పుత్రవాత్సల్యం సహజమే అందరికీ కాని శృతిమించిపోవడం శ్రేయస్కరం కాదు, అధోపాతాళానికి దిగజారుస్తుందని కోడెల ఉదంతం ఒక ఉదాహరణ.

ఎన్టీఆర్ ఇచ్చిన మహదవకాశం, స్వతహాగా ఆయనకున్న శక్తిసామర్ధ్యాలు పోరాట పటిమకు పల్నాడులో ఒక పులిలా అవతరించాల్సిన కోడెల పిల్లిలా తనువు చాలించారు.

తన కుటుంబం చేసిన అవినీతి వలన వచ్చిన సంపదేమి ఆయనకు గౌరవమైన మరణాన్ని ఇవ్వలేదు, ఎలానూ ఆ సంపదని పైలోకాలకి తీసుకెళ్లేందుకు వీలు కాదు.

ఆనాటి ఎన్టీఆర్ ఇచ్చినట్టే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన నాయకులు అనుక్షణం ప్రతిక్షణం నేర్చుకోవాల్సిన పాఠాలు, గుణపాఠాలు కోడెల ప్రస్థానంలో ఉన్నాయి - ఆకలింపు చేసుకునే ఆసక్తి ఉంటే!

గురవా రెడ్డి, అట్లాంటా

Show comments