ఉద్యమ వీరుడిలో తీరని నిరాశ...!

ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన వ్యక్తి. కొత్త కొత్త పోరాట ప్రక్రియలతో ఉద్యమాన్ని పరుగులెత్తించారు. కేసీఆర్‌ లేని సందర్భాల్లోనూ ఉద్యమం ఊపు తగ్గలేదు. ఈ క్రెడిటంతా కోదండరామ్‌దే. అసలు తెలంగాణ జేఏసీకి రూపకల్పన చేసి దానికి కోదండరామ్‌ను కన్వీనర్‌గా నియమించింది కోదండరామే. అప్పట్లో ఇద్దరూ ఎంత సన్నిహితంగా ఉండేవారో అందరికీ తెలుసు. ఉద్యమంలో కోదండరామ్‌ మాట వేదవాక్కులా మారింది.

ఆయన ఏం చెబితే ఉద్యమకారులు అది చేశారు. ఉద్యమాన్ని పరుగులెత్తించారు. తెలంగాణలో ఉద్యమంలో పెద్ద హీరోగా మారిపోయారు కోదండరామ్‌. రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్‌-కోదండరామ్‌ మధ్య క్రమంగా ఆగధం ఏర్పడి క్రమంగా అది పూడ్చలేని స్థాయికి చేరుకుంది. గతంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం ఘనవిజయం సాధించిన వెంటనే నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏమన్నారో గుర్తుంది కదా.

కట్టలు తెంచుకున్న ఆవేశంతో తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌  కోదండరామ్‌ మీద నిప్పులు కురిపించారు. ప్రొఫెసర్‌పై తనకు ఎంతటి ఆగ్రహం, ఆవేశం ఉన్నాయో మొహమాటం లేకుండా బయటపెట్టుకున్నారు. పూచికపుల్ల మాదిరిగా తీసి పారేసి,  కనీస గౌరవం ఇవ్వకుండా 'వాడు' అంటూ మాట్లాడారు.  'కోదండరామ్‌ కెపాసిటీ నాకు తెలుసు. వాడు చాలా చిన్నవాడు' అన్నారు. 'సాగరహారం వీడు చేసిండా?' అని ప్రశ్నించారు. దమ్ముంటే పార్టీ పెట్టమంటూ సవాల్‌ చేశారు.  జేఏసీ ముసుగు తీసేసి నేరుగా తనను ఢీకొట్టాలని సవాల్‌ చేశారు. 'పార్టీ పెడితే తెలుస్తుంది.

పార్టీ పెట్టుడంటే పాన్‌డబ్బా పెట్టుడా? అంటూ రెచ్చగొట్టారు. మరి కోదండరామ్‌ సీఎం రెచ్చగొట్టినందువల్ల పార్టీ పెట్టారా? సొంత ఆలోచనతోనే పెట్టారా? అనేది పక్కన పెడితే ఎట్టకేలకు రంగంలోకి దిగారు. తెలంగాణలో కీలకపాత్ర పోషించిన నేత అయినప్పటికీ పార్టీ పెట్టే విషయంలో చాలాకాలం ఊగిసలాడి చివరకు సాహసం చేశారు. జేఏసీ ముసుగు తీసేసి రాజకీయంగా తనను నేరుగా ఢీకొనాలని కేసీఆర్‌ ఆనాడు సవాల్‌ చేసినప్పటికీ కోదండరామ్‌ పార్టీ పెట్టడం ఆయనకు ఇష్టం లేదు.

కోదండరామ్‌ కేసీఆర్‌కు సమవుజ్జీ అవుతారని అనుకున్నారు. కాని ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కాంగ్రెసు నేతృత్వంలోని కూటమిలో చేరిన కోదండరామ్‌ తీవ్ర నిరాశలో ఉన్నారు. అడిగినన్ని స్థానాలు కాంగ్రెసు ఇవ్వడంలేదు. ఎక్కువ స్థానాలు ఇచ్చేంత బలం ఆ పార్టీకి లేదని భావిస్తోంది. మహాకూటమి చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఉమ్మడిగా పనిచేద్దామని అందరం అనుకుంటున్నం. మాట్లాడుకుంటున్నాం. చాయ్‌ తాగి వెళ్లిపోతున్నాం.

నిర్ణయాలు మాత్రం జరగడంలేదన్నారు. సీట్ల సంగతి తేలితే ప్రచారంలో ముందుకు సాగవచ్చంటున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని పరుగులు పెట్టించిన కోదండరామ్‌ ఇప్పుడు కూటమిలో జీరోగా మారిపోయారు. కేసీఆర్‌కు సమవుజ్జీ అనుకున్న నేత కాంగ్రెసు చేతిలో బందీగా మారారు. కోరిన సీట్లు ఇవ్వకుంటే కూటమి నుంచి వెళ్లిపోతానని హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి. బీజేపీతో కలవొచ్చని కూడా అన్నారు. కాని ఇంకా ఇదే కూటమిలో కొనసాగుతూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Show comments