కోదండకి 'షాక్‌'.. ఇది కాంగ్రెస్‌ 'మార్క్‌'.!

పదవిలో కూర్చోబెట్టి, 'పవర్‌' లేకుండా చేయడమెలాగో కాంగ్రెస్‌ పార్టీకి బాగా తెలుసు. తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌గా బోల్డంత ఫాలోయింగ్‌ తెలంగాణలో సంపాదించుకున్న కోదండరామ్‌, తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ పెట్టాక.. ఆయన్ని రాజకీయంగా తమవైపుకు తిప్పుకోవడంలో సఫలమైన కాంగ్రెస్‌ పార్టీ.. టిక్కెట్ల పంపకంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

కోదండరామ్‌ కోసం, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సీటును త్యాగం చేస్తున్నట్లు బిల్డప్‌ ఇచ్చింది. ఓ దశలో పొన్నాల కూడా ఈ విషయమై అసహనానికి లోనయ్యారు. కానీ, కాంగ్రెస్‌ రాజకీయం వర్కవుట్‌ అయ్యింది. తెలంగాణలో ఇప్పుడు మహాకూటమి కన్వీనర్‌ కోదండరామ్‌. ఈ విషయాన్ని అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీ ధృవీకరించింది.

పైగా, తెలంగాణ జన సమితికి ముందుగా కేటాయిస్తామన్న 12 సీట్లు కేటాయించలేదు.. కేవలం 8 సీట్లతోనే సరిపెట్టేసింది. జనగామ సీటుని పొన్నాలకు ఇచ్చేసి, కోదండరామ్‌ అండ్‌ టీమ్‌కి షాక్‌ ఇచ్చింది. ఇప్పుడిక కోదండరామ్‌, పోటీచేసే అవకాశం దాదాపు లేనట్టే. 'కోదండరామ్‌ పోటీ అన్న అంశం అప్రస్తుతం' అంటూ ఎఐసిసి తరఫున కుంతియా తేల్చి చెప్పేశారు.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో కాంగ్రెస్‌ అధిష్టానం, పొన్నాల లక్ష్మయ్యను ట్రంప్‌ కార్డులా వాడేసింది. పొన్నాలకు టిక్కెట్‌ ఇచ్చే అవకాశమే లేదని సంకేతాలు పంపి, కుల సమీకరణాల్ని రెచ్చగొట్టి.. కోదండరామ్‌ని డిఫెన్స్‌లో పడేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయాలు ఇలాగే వుంటాయి.

పాపం, కోదండరామ్‌.. ఈ రాజకీయాల్ని అర్థం చేసుకోలేక, ఓ దశలో పొన్నాల లక్ష్మయ్య విషయంలో తాను చెయ్యగలిగిందేమీ లేదనీ, జనగామకు సంబంధించి రెండో ఆలోచనే లేదంటూ అక్కడ తాను పోటీచేసే విషయమై అత్యుత్సాహం ప్రదర్శించారు. చివరికి, ఇలా కోదండరామ్‌ బోల్తా కొట్టేశారు.

మొత్తమ్మీద, ఒకప్పటి తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ ఇమేజ్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఉపయోగపడనుంది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ, టీజేఎస్‌కి కేటాయించిన సీట్లలోనూ 'స్నేహపూర్వక పోటీ' లేదా 'రెబల్‌ రాజకీయం' షురూ అయ్యే అవకాశాలు సుస్పష్టం. అంటే, కోదండరామ్‌ అండ్‌ టీమ్‌ కాంగ్రెస్‌ రాజకీయానికి బలైపోతున్నట్టే లెక్క.  

Show comments