కోదండా... మీరు పోటీ చేయకండి!

తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్‌ను ఎన్నికల్లో పోటీ చేయొద్దని కాంగ్రెసు కోరిందా? 'అవును' అని కాంగ్రెసు వర్గాల సమాచారం. ఇందుకు కారణమేమిటంటే ఆయనకు బలమైన నియోజకవర్గం లేదనేది కాంగ్రెసు అభిప్రాయం. ఆయన ఏ నియోజకవర్గంలో నిలబడినా ఓడించేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉంది. అందుకు తగ్గ వ్యూహాలు పన్నుతోంది. కోదండరామ్‌ ఓడిపోతే అది రాజకీయంగా ఆయనకు పెద్దదెబ్బ అవుతుందని, కేసీఆర్‌ ముందు మరింత చులకన అవుతారనేది కాంగ్రెసు అభిప్రాయం.

దీంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెసు ఆయన్ని ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కాంగ్రెసు వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ పోటీ చేయకుండా ఉన్నట్లయితే మహాకూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీని చేస్తామని కాంగ్రెసు నాయకులు ఆయనకు చెప్పారు. ఆయన మేధావి వర్గానికి చెందినవాడు కాబట్టి ఆయనకు శాసనమండలి అయితేనే మంచిదని అభిప్రాయం. ఉమ్మడి కనీస ప్రణాళిక కమిటీకి ఆయన్ని ఛైర్మన్‌ను చేస్తామని హామీ ఇచ్చింది.

దీనిపై కోదండరామ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం సీట్ల పంపిణీలో కాంగ్రెసు, టీడీపీ మధ్య విభేదాలు లేవు. టీజేఎస్‌, సీపీఐతోనే ఇబ్బందిగా ఉంది. టీజేఎస్‌ 20 సీట్లు అడుగుతుండగా, సీపీఐ 8 సీట్లు కావలంటోంది. ఆ పార్టీలు అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెసు సిద్ధంగా లేదు. ఆ రెండు పార్టీల్లో బలమైన నాయకులు లేరని, వారికి అన్ని సీట్లు ఇస్తే అది టీఆర్‌ఎస్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని కాంగ్రెసుతోపాటు టీడీపీ కూడా అభిప్రాయపడుతోంది.

మొత్తం 119 సీట్లలో పాత బస్తీలోని ఏడు స్థానాలు ఎంఐఎం ఖాతాలో పడతాయి. ఇక 11 సీట్లు టీడీపీకి, టీజేఎస్‌కు, సీపీఐకి చెరి నాలుగు సీట్లు ఇవ్వాలని కాంగ్రెసు నిర్ణయించుకుంది. ఆ పార్టీ 96 సీట్లలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. రెండు మూడురోజుల్లో సీట్ల పంపిణీ ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెసు ఈ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు నాయకులు చెబుతున్నారు. ఒక్క సీటు కూడా కోల్పోకూడదని భావిస్తోంది.

ఎక్కడా బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టకూడదని నిర్ణయించుకుంది. బలమైన కాంగ్రెసు అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలను అడగొద్దని, అందుకోసం ఒత్తిడి చేయొద్దని టీజేఎస్‌ను, సీపీఐని కోరింది. అలాంటివారు ఎవరైనా ఉంటే మహాకూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పోస్టులు ఇస్తామని, మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పింది.

ఇక సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్‌ నుంచి పోటీ చేస్తానని చెప్పగా, రామగుండం సురక్షితంగా ఉంటుందని సలహా ఇచ్చింది. టీడీపీ అధ్యక్షుడు రమణ నియోజకవర్గమైన జగిత్యాలను కాంగ్రెసు నేత జీవన్‌ రెడ్డికి కేటాయించారు. రమణ కోరుట్ల నుంచి పోటీ చేసేందుకు అంగీకరించారు.

Show comments