చట్టంలో లొసుగులు.. జగనొచ్చినా ఇదేతంతు!

తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్‌, ఆంధ్రాలో పరిపాలన చేస్తున్న చంద్రబాబు నైతిక విలువలను వదిలేసి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, ఫిరాయింపుదారులకు పదవులు కట్టబెట్టారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఆంధ్రాలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి పాలక పెద్దలను, పార్టీల పెద్దలను కలిశారు. తెలంగాణలో ఫిరాయింపుదారుడితో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్‌ ఆంధ్రలోనూ అదే తప్పు చేశారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే ఫిరాయింపులను ప్రోత్సహించడంలో, ఫిరాయింపుదారులకు పదవులు ఇవ్వడంలో రాజకీయ ప్రయోజనాలే తప్ప నైతిక విలువల ప్రసక్తి లేదని, ఫిరాయింపుల చట్టంలోనే లొసుగులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు, గవర్నరు చేసేదేమీ లేదని, జగన్‌ అధికారంలోఉన్నా ఇందుకు భిన్నంగా జరగదని 'పచ్చ' పార్టీకి అనుకూలుడైన జర్నలిస్టు కమ్‌ మీడియా సంస్థ అధినేత తేల్చిపారేశారు. రాజకీయాల్లో నైతిక విలువలకు స్థానం లేదని చెప్పారన్నమాట. తెలంగాణలో కాంగ్రెసు లేదా మరో పార్టీ అధికారంలోకి వచ్చినా, ఆంధ్రాలో జగన్‌ ముఖ్యమంత్రి అయినా ఫిరాయింపులను  ప్రోత్సహించేవారని, జంప్‌ జిలానీలకు పదవులు ఇచ్చేవారని, అప్పుడు కేసీఆర్‌, చంద్రబాబు గగ్గోలు పెట్టేవారని ఆయన విశ్లేషించారు.

తెలంగాణలో ప్రతిపక్షాలు కాని, ఆంధ్రాలో వైకాపాగాని మడి కట్టుకొని లేవని, అధికారంలోకి వస్తే అవీ నైతిక విలువలు పట్టించుకోవని చెప్పారు. ఫిరాయింపుల చట్టంలో లొసుగులను సవరించనంతవరకు, ఆ చట్టాన్ని పటిష్టం చేయనంత వరకు ఇదే తంతు కొనసాగుతుందన్నారు. చట్టంలో ఉన్న లొసుగులేమిటి? ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో పార్టీలో చేరినప్పుడు వారు రాజీనామా లేఖలు స్పీకరుకు ఇచ్చినా లేదా వారిని అనర్హులను చేయాలని బాధిత పార్టీలు పిటిషన్లు ఇచ్చినా వాటిని స్పీకరు వెంటనే ఆమోదించాలని లేదా తగిన చర్యలు తీసుకోవాలనే నిబంధన చట్టంలో లేదు. 'స్పీకర్‌ ఇంత కాలంలో నిర్ణయం తీసుకోవాలి' అనే నిబంధన లేదు. అది స్పీకర్‌  ఇష్టం. ఆ విచక్షణాధికారాన్ని ప్రశ్నించే హక్కు కోర్టులకు లేదు. స్పీకర్‌ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు. సో...బాధిత పార్టీలు ఎంత అరిచి గీపెట్టినా, ఎంతగనం ఆందోళన చేసినా స్పీకర్‌ మౌనంగా ఉండొచ్చు. 

స్పీకర్‌ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాలను కాపాడకుండా ఉండటం సాధ్యం కాదు. స్పీకర్‌ రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలని సూక్తిముక్తావళిగా చెప్పుకోవడానికి  బాగానే ఉంటుంది. కాని వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఇక మరో అంశం. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇది నైతికంగా తప్పు. కాని రాజకీయంగా సరైనదేనని మీడియా సంస్థ అధినేత విశ్లేషించారు. ఎలా? గవర్నరుకు పరిమితమైన అధికారాలున్నాయి. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నాయకుల నేపథ్యం గవర్నరుకు అనవసరం. ప్రభుత్వం ఇచ్చే జాబితాలోని వారి చేత ఆయన ప్రమాణం చేయించాలి. కాకపోతే ప్రమాణం చేసే వ్యక్తి అధికార పార్టీకి చెంది వుండాలి లేదా ఏ పార్టీకి చెందని వ్యక్తి అయివుండాలి. తెలంగాణలో తలసాని శ్రీనివాస యాదవ్‌తో ప్రమాణం చేయించినప్పుడు ఆయన రాజీనామా లేఖ జిరాక్స్‌ కాపీని గవర్నర్‌కు చూపించారు. ఆయన నమ్మేసి ప్రమాణం చేయిచారు. ఆంధ్రాలోనూ నలుగురు ఫిరాయింపు రాజీనామా లేఖల జిరాక్సులను చూపించారట...! ఓకే ఫైన్‌ అనుకొని ప్రమాణం చేయించారు. సో...గవర్నర్‌ తప్పు చేయలేదని మీడియా అధినేత అభిప్రాయం. తన వ్యాసంలో ఉమ్మడి ఏపీలో వైఎస్‌ఆర్‌, కిరణ్‌ కుమార్‌ రెడ్డి (ఈయన స్పీకరుగా కూడా చేశారు), స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఫిరాయింపులపై వ్యవహరించిన తీరుపై కూడా రాశారు.

ఇక్కడ కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. తలసాని రాజీనామా లేఖ జిరాక్స్‌ చూసి ప్రమాణం చేయించిన గవర్నర్‌కు ఈమధ్య తలసాని చేసిన ప్రకటన గుర్తు లేదా? ఆనాడు తాను రాజీనామా చేయలేదని, ఏపీలో ఫిరాయింపుదారులతో రాజీనామా చేయిస్తే తానూ చేస్తానని అన్నారు. ఇది గవర్నర్‌ను మోసం చేయడం కాదా? అయినప్పటికీ మౌనంగా ఉంటారా? ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తే ఆరు నెలల్లోగా మళ్లీ ఎన్నికలు జరగాలని రాజ్యాంగం చెబుతోంది. అలాగే చట్టసభకు ఎన్నిక కాని వ్యక్తి మంత్రి అయితే ఆరు నెలల్లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కావాలి. లేకపోతే పదవి పోతుంది. కాని ఇవేవీ జరగడం లేదు ఎందుకు? దీనిపై గవర్నర్‌ ప్రశ్నించకూడదా? ఏం చేసినా మౌనంగా ఉంటే ఆయన రాజ్యాంగ రక్షకుడని చెప్పుకోవడం ఎందుకు? కనీస నైతిక విలువలు లేని చట్టాలు, పాలన ఉన్న ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందనుకోవాలా? ఆటవికత రాజ్యం చేస్తోందనుకోవాలా? ఎవరిష్టం వచ్చినట్లు వారు చేసుకుంటే అసలు రాజ్యాంగం ఎందుకు?

Show comments