కెసియార్‌తో 'పొత్తు' వలన జగన్‌కి ఒరిగేదేముంది?

జగన్‌ యీ బుధవారం కెటియార్‌తో నేరుగా, కెసియార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. 'తెలుగువారిలో ప్రాంతాల పేర చీలిక తెచ్చి, రాష్ట్రాన్ని చీల్చి, ఆంధ్రులను నానా మాటలూ అన్న తెరాసతో పొత్తా?' అని టిడిపి జగన్‌ను నిలదీస్తోంది. 'మనకు ద్రోహం చేసినది కాంగ్రెసు, ఓ మేరకు బిజెపి కావచ్చు, కానీ చేయించినది మాత్రం కెసియారే కదా, ఎంత చంద్రబాబుతో వైరమైతే మటుకు, పోయిపోయి అతనితో చేతులు కలపడమా?' అని ఆంధ్రులు అడుగుతారన్న భయం లేదా జగన్‌కు? తెరాసకు ఆంధ్రలో బలమేముంది కనుక? ఆంధ్రలో కెసియార్‌కు అభిమానులెవరున్నారు నుక? ఏ వర్గం ఓట్లను ఆశించి జగన్‌ యిలా బాహాటంగా సమావేశమయ్యారు? ఇది రాజకీయ జూదమా? అయితే పర్యవసానం ఏమిటి?

జగన్‌ కెసియార్‌తో 'పొత్తు' పెట్టుకోవడం పట్ల చాలా చర్చే జరుగుతోంది. నిజానికి దాన్ని పొత్తు అనడం సరైన పదం కాదు. జాతీయస్థాయిలో భాగస్వామ్యం అనే అనాలి. ఎన్నికలలో కలిసి పోటీ చేస్తేనే పొత్తు పెట్టుకోవడం అంటారు. తెరాసతో 2004లో కాంగ్రెసు, 2009లో టిడిపి పెట్టుకున్నది పొత్తు. ఆంధ్రలో తెరాసకు సీట్లు యిచ్చే ప్రశ్నే లేదని, ఒంటరిగానే పోటీ చేస్తాననీ అంటోంది వైసిపి. ఫ్రంట్‌లో కానీ, ప్రభుత్వంలో కానీ వేర్వేరు పార్టీలు చేతులు కలిపితే భాగస్వాములంటారు. ఎన్‌డిఏలో శివసేన, అకాలీదళ్‌ సహా చాలా పార్టీలున్నాయి. టిడిపికి వాళ్లతో పొత్తు ఉందని అనగలమా? బిజెపితో మాత్రమే ఉండేది. ఎన్‌డిఏలో ఉండగా టిడిపికి, అకాలీదళ్‌కు మధ్య ఉండే సంబంధమే, ఫెడరల్‌ ఫ్రంట్‌లో వైసిపికి, తెరాసకు ఉండబోతోంది.

కానీ టిడిపి వాళ్లు అలా అనుకోవటం లేదు. మొన్నటిదాకా బిజెపి అంటే బి(బిజెపి) జె(జగన్‌), పి(పవన్‌) అన్నారు. ఇప్పుడు పవన్‌ను ఆ కూటమిలోంచి తప్పించి, ఆ స్థానంలో తెరాసను తెచ్చారు. అంతా వాళ్లిష్టమే లెండి. పవన్‌ మీద విమర్శల జోరు తగ్గించారు. పవన్‌ కూడా బాబు, లోకేశ్‌ల మీద విసుర్లు తగ్గించి, జగన్‌పై పెంచాడు. అతని స్ట్రాటజీ ఏమైనా మారుతోందేమో, టిడిపికి దగ్గరవుతున్నాడో తెలియదు. సరే ప్రస్తుతం టిడిపి కెసియార్‌తో చేతులు కలపడం ఆంధ్రకు ద్రోహం చేయడమే అని ఏకి పారేస్తోంది.

వాళ్లు గతంలో బిజెపితో చేతులు కలిపితే బిజెపివాళ్లపై ఆంధ్రకు హితులుగా ముద్ర కొట్టారు, యిప్పుడు కాంగ్రెసుతో చేతులు కలిపారు కాబట్టి కాంగ్రెసును ఆంధ్ర రక్షకులంటున్నారు. ఆంధ్ర అంటే టిడిపి అని వాళ్ల నిర్వచనం. కెసియార్‌ ఆంధ్ర ద్రోహి కాబట్టి, జగన్‌ అతనితో చేతులు కలిపి ఘోరమైన తప్పిదం చేశాడు, అదీ వాళ్ల దృక్కోణం. తా ములిగినది గంగ, తా వలచినది రంభ!

కెసియార్‌పై అంత ఆగ్రహం ఉందా?
నిజంగా ఆంధ్రులకు కెసియార్‌పై అంత మంటే ఉంటే తెలంగాణ ఎన్నికల సమయంలో బాబు 'కెసియార్‌తో కలిసి పొత్తు పెట్టుకుందామని కోరాను' అని బహిరంగంగా చెప్పుకుంటారా? పోయిపోయి తనతో పొత్తా? అని ఆంధ్రులు నిలదీస్తారని భయపడలేదా? (దానితో పోలిస్తే జగన్‌ది ఫ్రంట్‌ భాగస్వామ్యం మాత్రమే) 'అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై కెసియార్‌ పేరు ఎందుకు వేయించారు? బుద్ధుందా'ని ప్రజలు అడుగుతారని జంకి వుండరా? బాబు జంకలేదు, ప్రజలూ తిరగబడలేదు. కెసియార్‌ వచ్చినపుడు నల్లజండాలు ఊపలేదు, ఉపన్యాసం యిస్తూంటే గేలి చేయలేదు. అక్కడే కాదు, తిరుపతిలో, అనంతపురంలో, మొన్న వైజాగ్‌లో ఎక్కడా నిరసనలూ లేవు, నినాదాలూ లేవు. కెసియారే కాదు, ఆంధ్రులపై ఆంధ్ర సంస్థలపై విపరీతంగా నోరు పారేసుకునే హరీశ్‌రావు వచ్చినా మర్యాదగానే చూస్తారు తప్ప, మరోలా ప్రవర్తించరు - గుళ్లోనే కాదు, ఎయిర్‌పోర్టులో బయట తిరిగినప్పుడు, బస చేసినప్పుడు కూడా. పెద్దవారే కాదు, యువకులు, విద్యార్థులు కూడా ఎన్నడూ ఏ మాటా అనలేదు.

2017 ఫిబ్రవరిలో కెసియార్‌ తిరుపతి వచ్చినపుడు టిడిపి నాయకుడు బొజ్జల స్వాగతం పలికారు, కెసియార్‌ అభిమానులు మోటర్‌ సైకిలు ర్యాలీ నిర్వహించారు. 2017 అక్టోబరులో అనంతపురంలో పరిటాల యింట్లో పెళ్లికి వచ్చినపుడు టిడిపి నాయకులు సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. పయ్యావుల కేశవ్‌ అయితే 15 ని.లు కెసియార్‌తో ఆంతరంగికంగా మాట్లాడారు. ఆంధ్ర ప్రజలు కెసియార్‌ను అసహ్యించుకుంటూ వుంటే యిది సాధ్యపడేదా? అప్పుడు వారిపై చర్యలు తీసుకోని బాబు యిప్పుడు తలసాని శ్రీనివాస యాదవ్‌ ఆంధ్రకు వచ్చినపుడు కలుసుకోవడానికి వెళ్లిన టిడిపి నాయకులను సస్పెండు చేయమని ఆదేశాలు యిస్తున్నారు. ఆయన దృక్పథం మారింది కాబట్టి మననీ మార్చుకోమంటారు.

ఆంధ్రులు మద్రాసు నుంచి విడిపోయి వచ్చేశారు. మద్రాసు నుంచి తరిమివేసిన తమిళులపై కక్ష పూనారా? ఉద్యోగుల ఫర్నిచర్‌ విషయంలో విరిగిపోయిన బల్లలు, కుర్చీలు యిచ్చి దగా చేశారని కొన్నాళ్లు చెప్పుకున్నారు. అంతే. తర్వాత కోపం కంటిన్యూ కాలేదు. ఎవరి పనుల్లో వాళ్లున్నారు. తమిళనాడులో చాలామంది తెలుగువాళ్లు ఉండిపోయారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్లారు, వెళుతూనే ఉన్నారు. సినిమా పరిశ్రమ కూడా ఓ పట్టాన తెలుగు రాష్ట్రానికి తరలి రాలేదు. మమ్మల్ని దోపిడీదారులని తిట్టి వెళ్లిపోయినవారు అని తమిళులు తెలుగువారిని చులకనగా చూడలేదు.

అలాగే తెలుగునాట, ముఖ్యంగా సరిహద్దు జిల్లాలలో బోల్డు మంది తమిళులు ఎప్పణ్నుంచో ఉన్నారు. వాళ్లు వెళ్లిపోలేదు. అక్కడే వుండి వర్ధిల్లారు. తక్కిన ప్రాంతాలకూ విస్తరించారు. రాజాజీపై కోపం వీళ్ల మీద ఎవరూ చూపలేదు. ఈ పంపకాలూ, గొడవా నాయకుల మధ్య ఉంటాయి తప్ప సామాన్య ప్రజలను స్పృశించవు అని అర్థం చేసుకోవాలి.

పొరుగు రాష్ట్రంతో వైరం ఎన్నాళ్లు?
సరిహద్దు రాష్ట్రాలకు నీటి పంపిణీ, సరిహద్దు వంటి విషయాల్లో ఎప్పుడూ గొడవలుంటాయి. కానీ ఎప్పుడో ఓసారి రాజుకుంటాయి, రెండు, మూడు నెలలు హడావుడి జరుగుతుంది. తర్వాత అంతా యథాతథమే. కర్ణాటక-తమిళనాడు చూడండి. కావేరీ జలాల వివాదం వస్తే తప్ప తక్కిన రోజుల్లో కన్నడిగులు, తమిళులు తమిళనాడులో, కర్ణాటకలో కలిసే వుంటారు. అలాగే కేరళ-తమిళనాడుకి కూడా కొన్ని ప్రాజెక్టులు, సరిహద్దు తగాదాలు ఉన్నాయి. అంత మాత్రం చేత తమిళనాడు ముఖ్యమంత్రి పేరు చెప్పగానే కర్ణాటకలో, కేరళలో శివాలెత్తి పోరు. అక్కడి సాంస్కృతిక కార్యక్రమాలకు పిలుస్తూనే ఉంటారు. వీళ్లు వెళ్లి వస్తూనే ఉంటారు.

సాధారణ పరిస్థితుల్లో అయితే, తెలంగాణ కేవలం పొరుగు రాష్ట్రమే అయితే కెసియార్‌కు అతని సాహిత్యాభిలాషకు, వాక్పటిమకు ఆంధ్రలో చాలా మర్యాదే దక్కి వుండేది. అనేకమంది తెలంగాణ వాళ్లకు యిప్పటికీ ఆంధ్రలో అవార్డులు యిస్తూనే ఉన్నారు, అలాగే తెలుగు మహాసభలు నిర్వహించినందుకు కెసియార్‌కు సన్మానం చేసి వుండవచ్చు, కానీ కెసియార్‌ ఉద్యమసమయంలో రాక్షసజాతి అంటూ ఆంధ్రులపై నోరు పారేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా హైదరాబాదులో ఉన్న ఉమ్మడి సంస్థలను కబళించారు. ప్రాజెక్టులకు అడ్డు తగులుతున్నారు, అడుగడుగునా పేచీలు పెడుతున్నారు. తెలుగు మహాసభల్లో కూడా సాటి తెలుగు ముఖ్యమంత్రిని ఆహ్వానించకుండా ఆంధ్ర రాష్ట్రాన్నే అవమానించారు. కెసియార్‌ ఎందుకిలా చేయాలి?

ఆంధ్రపై కోపమా? బాబుపై కోపమా? 2014 ఎన్నికల ఫలితాలు వచ్చేముందు ఆంధ్రలో జగన్‌, యిక్కడ మనం వస్తాం అని అన్నాడాయన. అది జరగకపోవడంతో యిలా బాబుపై కోపం ఆంధ్ర రాష్ట్రంపై చూపాడా? 2019 ఎన్నికల తర్వాత బాబు కాకుండా వేరే వారు ఆంధ్రకు ముఖ్యమంత్రి అయితే కెసియార్‌ ప్రవర్తనలో మార్పు వస్తే, అప్పుడు యీ థియరీ నమ్మవచ్చు. ఏది ఏమైనా ప్రస్తుతానికి ఆంధ్రలో కెసియార్‌కు అభిమానులుండరు. తెరాస అభ్యర్థులను నిలిపితే డిపాజిట్లు దక్కవు. కానీ అదే సమయంలో కెసియార్‌తో కలిసి భోజనం చేసినవాళ్లందరి పైనా ఆంధ్రులు ద్వేషం పూనుతారు అనుకోలేము. అందుకే గతంలో బాబు భోజనం చేశారు, యివాళ జగన్‌ ఆయన కొడుకుతో చేశారు. ప్రజల సహనానికి కారణం ఏమిటై ఉండవచ్చు?

కెసియార్‌ను ఎందుకు సహిస్తున్నారు?
ఉద్యమసమయంలో 'తెలంగాణా వాలే జాగో, ఆంధ్రావాలే భాగో' అని పిలుపు నిచ్చి తెలంగాణవాదుల మనసుదోచిన కెసియార్‌ రాష్ట్రం ఏర్పడగానే హైదరాబాదు నుంచి ఆంధ్రులను తరిమివేస్తాడనే చాలామంది నమ్మారు. కానీ అలా చేయలేదు. 'ఐ యామ్‌ ద మాస్టర్‌' అని చూపించి, అందరి చేత దాసోహం అనిపించుకుని వదిలేశాడు. ప్రయివేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్‌ వంటివి పెట్టలేదు. తనకు ఆత్మీయంగా ఉంటే ఆంధ్రులను కూడా చేరదీశాడు. అందుకే సినిమా వాళ్లతో సహా ఎవరూ తరలి వెళ్లలేదు. పరిస్థితి ఎప్పటిలాగానే ఉంది. ఇది ఆంధ్రులను మెప్పించిందనుకోవాలి. ఎందుకంటే ఆంధ్రలోని 13 జిల్లాల వారికీ హైదరాబాదులో బంధువులు, స్నేహితులు వున్నారు.

కెసియార్‌లో యీ మార్పువలననే కాబోలు కార్పోరేషన్‌ ఎన్నికల్లో ఆంధ్రమూలాల వారు తెరాసకు ఓటేశారు. తాజాగా తెలంగాణ ఎన్నికలలో కూడా. జంటనగరాల్లోనే కాదు, పలు ప్రాంతాల్లో, ఖమ్మం జిల్లాలో తప్ప - తెరాసను ఆదరించారు. ఈ మధ్య యింకో వాదన వింటున్నాను. గత నాలుగేళ్లగా ఆంధ్రలో ఆస్తుల రేట్లు పెరగడానికి కెసియార్‌ చేష్టలే కారణమని ఆంధ్రుల్లో ఆస్తిపరులు సంతోషిస్తున్నారని. 'ఎంతసేపూ హైదరాబాదు స్థలాలకు రేట్లు పెరగడమే తప్ప, మాకేమీ లేదా అనుకునేవారం, కెసియార్‌ ధర్మమాని రాష్ట్రం విడిపోయి మన దగ్గరా ధరలు పెరిగాయి' అనుకుంటున్నారట.

వైయస్‌ 3 ఏళ్లు కష్టపడితే కానీ హైదరాబాదుకి ఐఐటి రాలేదు, అలాటిది విభజన ధర్మమాని ఆంధ్రకు చటుక్కున వచ్చేసింది. అలాగే తక్కిన విద్యాసంస్థలు కూడా! ఎన్నో ఏళ్లగా నలుగుతున్న పోలవరానికి కూడా విముక్తి కలిగింది. అది అనవసరంగా బాబు తన చేతిలోకి తీసుకుని కాంప్లికేట్‌ చేసుకున్నారు కానీ పోలవరం కేంద్ర ప్రాజెక్టుగా తీసుకోవడం ఆంధ్రకు లాభదాయకమే.

హోదా రాకుండా అడ్డుపడినవారెవరు?
నిజానికి హైదరాబాదును పూర్తిగా తెలంగాణకు యిచ్చి వేయడం వలన ఆంధ్రకు అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదా యిచ్చి, కాస్త కళ్లు తుడిచారు. అది కూడా రాకపోవడం మోదీ-బాబుల మధ్య గొడవల వలన, బాబు ప్యాకేజీకి ఆశపడడం వలన తప్ప అది ఎప్పటికైనా హక్కే. బాబు అసమర్థత వలన, హోదా పట్ల తన స్టాండ్‌ మార్చుకుంటూ పోవడం వలన హాని జరిగింది, దానికి యితరులను బాధ్యులను చేయడం అనవసరం. ఆంధ్రకు హోదా యిస్తే తమ దగ్గరనుంచి పరిశ్రమలు తరలిపోతాయని కర్ణాటక, తమిళనాడు ముఖ్యమంత్రులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

బాబు వారిని కలవడం మానేశారా? హోదాకు కెసియార్‌ మాత్రమే అడ్డుపడుతున్నాడని యిపుడు టిడిపి చెపితే ఎవరు నమ్ముతారు? ఇమ్మనమని కెసియార్‌ లేఖ రాస్తానంటున్నారు. మరి మోదీ 'దా, యిదిగో తీసుకో' అని యిచ్చేస్తారా? హోదా పేరెత్తితే తాట తీస్తానని ఆంధ్రప్రజలను బెదిరించిందెవరో కాస్త గుర్తు తెచ్చుకోవాలి. బాబు కెసియార్‌ ఒకప్పటి మిత్రులు, తర్వాత శత్రువులు కావటం చేత యిరు రాష్ట్రాల మధ్య యీ సమస్యలు వచ్చాయి కాబోలు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా బాబు రాజీపడడానికి సిద్ధపడినా, కెసియార్‌ నిరాకరించారు.

తెరాసతో పొత్తుకై అడిగి, భంగపడి, రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చి, ఆంధ్రులను అనాథలుగా చేసిన కాంగ్రెసు వారితోనూ (ఈ పదాల కాపీరైటు టిడిపి వారిదే) పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి సుప్రీం కోర్టులో పిల్‌ వేసిన కోదండరామ్‌తోనూ పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికలలో తొడ చరిచి, ఊరుభంగమై కుప్పకూలిన టిడిపి యిప్పుడు తెరాసకు, బిజెపికి, వైసిపికి మూడు ముళ్లు వేసింది. రేపణ్నుంచి వైసిపిని పిల్ల బిజెపి అనాలో, పిల్ల తెరాస అనాలో తెలియక కాస్త తబ్బిబ్బు పడతారు టివీల్లో కనబడే టిడిపి ప్రతినిథులు.

కానీ ఏదో ఒకటి యాగీ చేయకమానరు. ఇవన్నీ తెలిసి కూడా జగన్‌ కెటియార్‌ను బాహాటంగా కలిశాడెందుకు? ఆంధ్ర ప్రజలను ఒప్పించగలనని ధైర్యమా? తెరాసతో స్నేహం చేస్తే ఆంధ్రలో కలిసి వచ్చేదేముంది? తెరాసకు ఆంధ్రలో బలమేముంది? యూనిట్లేమున్నాయి? అక్కడక్కడ తెలంగాణ వారున్నారనుకున్నా, వారు తెరాస సానుభూతిపరులని ఎలా చెప్తాం?

చేతులు కలిపినది నిధుల కోసమా?
మరి ఎన్నికల నిధుల కోసమా? 'బాబు తెలంగాణలో మా విరోధులకు నిధులు సప్లయి చేశారు కాబట్టి ఆంధ్రలో ఆయన విరోధులకు మేం నిధులిస్తామ'ని కెసియార్‌ ప్లానేశారా? అదేనా రిటర్న్‌ గిఫ్ట్‌? ఈ వాదన బొత్తిగా కొట్టి పారేయదగ్గది కాదు, టిడిపి దగ్గర పుష్కలంగా నిధులున్నాయి. తెలంగాణలో కోదండరాం అనుచరుల దగ్గర్నుంచి, టిడిపి నాయకుల దాకా అనేక ప్రజాకూటమి అభ్యర్థుల దగ్గర డబ్బులు దొరికాయి. అదంతా వారి కష్టార్జితం అని నమ్మడం కష్టం. పక్క రాష్ట్రంలో యితర పార్టీలకే అంత డబ్బు ఖర్చు పెడితే, సొంత పార్టీ వాళ్లను గెలిపించుకోవడానికి ఆంధ్రలో ఎంత పెడతారు? దాన్ని ఎదుర్కోవడానికి నిధుల కోసం జగన్‌ కెసియార్‌కు దగ్గరయ్యారా'? అయితే కావచ్చు కానీ ఆ మాట బయటకు చెప్పలేరుగా, ప్రత్యేక హోదా కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరుతున్నా అంటున్నారు జగన్‌.

అది నమ్మవచ్చా? ఎందుకు నమ్మకూడదు? హోదా ఎవరిస్తే వాళ్లకే జై అంటున్నారు జగన్‌. బిజెపి యివ్వలేదు, మళ్లీ అధికారంలోకి వస్తే కాంగ్రెసు యిస్తానంటోంది, ఇచ్చే మొహమైతే అప్పుడే బిల్లులో పెట్టేది, హైదరాబాదు తెలంగాణకు అప్పగించేశాక, ఆంధ్రను ఎలా కాంపెన్సేట్‌ చేయాలన్నది బిజెపి వాళ్లు సూచిస్తే తప్ప తెలియలేదా? బిజెపి కూడా లోకసభలో చర్చలోనే చెప్పవచ్చుగా, రాజ్యసభ దాకా ఆగిందెందుకు? దానితో బిల్లులో చేర్చకుండా అయిపోయింది. అందుకే యీ చిక్కుముడి. దీన్ని మేమే విప్పాలంటోంది కాంగ్రెసు.

అది అధికారంలో వచ్చేట్లా ఉందా? ఎన్ని సర్వేలు చూసినా, బిజెపికి సీట్లు తగ్గవచ్చంటున్నారు కానీ కాంగ్రెసు నాయకత్వంలోని యుపిఏ అధికారంలోకి వస్తుంది అనడం లేదు. బిజెపికి 200 ప్లస్‌, కాంగ్రెసుకు 100 మైనస్‌ వస్తాయని అంచనా. 100 సీట్లతో కాంగ్రెసు ప్రధాని పదవిని ఆశించగలదా? కాంగ్రెసు సారథ్యంలోని యుపిఏ కంటె 'అదర్‌ పార్టీస్‌'కు ఎక్కువ సీట్లు వచ్చేట్లు ఉన్నాయని చెపుతున్నారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ అవకాశాలు
ఇదే కెసియార్‌లో ఆశలు రగిలించింది. ప్రాంతీయ పార్టీలు తమతమ రాష్ట్రాలలో ఎంపీ సీట్లు గెలుచుకుని కూటమిగా ఏర్పడితే ఓ 150 దాకా బలం ఉంటుందని అంచనా. దానితో ఎవర్ని కావాలంటే వారిని సీటు ఎక్కించవచ్చు, దింపవచ్చు. యుపిఏ 1 ప్రభుత్వాన్ని కమ్యూనిస్టులు బయట నుంచే నియంత్రించారు. అలాగే తామూ చేద్దామని, రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు డిమాండ్‌ చేసి పొందుదామనీ కెసియార్‌ వాదన. ప్రస్తుతం మోదీ నియంతగా ఉన్నాడు. ఏ ముఖ్యమంత్రినీ నోరెత్తనీయటం లేదు. రేపు ఎన్నికలలో బిజెపి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేనప్పుడు యీ ఆటలు సాగవు.

బిజెపి వాళ్లు యీ ఫ్రంట్‌ మద్దతు కోరితే  'మోదీ కాకుండా వేరే ఎవరైనా మా మాటలు మన్నించేవాడుంటే, మా ప్రాంతీయ పార్టీలను తినేయనివాడైతే అప్పుడిస్తాం మద్దతు' అని ఫ్రంట్‌ డిమాండ్‌ చేయవచ్చు. రాహుల్‌ యీ మధ్యే నాయకుడిగా కాస్త ఎదుగుతున్నాడు కానీ ప్రధాని అయ్యే లక్షణాలు కనుచూపు మేరలో లేవు. అందుకే అతన్ని ప్రధానిగా అంగీకరించమని బిజెపియేతర పార్టీలు కుండబద్దలు కొట్టి చెపుతున్నాయి. రాహుల్‌ను ప్రధానిగా ప్రకటిస్తే ఓటర్లు మోదీయే బెటరు అనుకుంటారని వారి భయం.

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఓ కలగానే మిగిలిపోతుందా?
ఇంతమంది ఎలా కలుస్తారు? అనే సందేహం రావడం సహజం. ఎన్టీయార్‌ నేషనల్‌ ఫ్రంట్‌ కూర్చడానికి ప్రయత్నిస్తున్న రోజులవి. ''తుగ్లక్‌'' తమిళ వారపత్రికలో ఓ పాఠకుడు 'ఎన్టీయార్‌ ప్రస్తుతం ఏం చేస్తున్నారు?' అని ప్రశ్న వేస్తే సంపాదకుడు చో రామస్వామి 'చిల్లర పోగేస్తున్నారు' అని జవాబు యిచ్చారు. కానీ ఆ చిల్లరే శ్రీమహాలక్ష్మి అయింది. తర్వాతి రోజుల్లో యిద్దరు ప్రధానులను దేశానికి యిచ్చింది. అందువలన ఏ ప్రయత్నం ఎప్పుడు సఫలమౌతుందో ఎవరూ చెప్పలేరు.

ఈ బిజిపియేతర, కాంగ్రెసేతర ఫ్రంట్‌ చాలా ప్రాంతీయపార్టీలను ఊరించే విషయం. ఎందుకంటే వాటికి స్వరాష్ట్రంలో యీ రెండింటిలో ఏదో ఒకటి ప్రత్యర్థి. వారితో చేతులు కలిపితే తమ ఐడెంటిటీ పోతుంది. అందువలన యిలా ప్రెషర్‌ గ్రూపుగా ఏర్పడి, అంశాల వారీ మద్దతు అంటే వారికి యిబ్బంది ఉండదు. మమతా, ఎస్పీ, బియస్పీ, నవీన్‌ పట్నాయక్‌ వగైరాలు కలిసి వస్తే యిది కింగ్‌మేకర్‌గా మారే అవకాశాలు లేకపోలేదు. బిజెపి, కాంగ్రెసులలో ఎవరు వచ్చినా ఆంధ్రకు ప్రత్యేక హోదా యివ్వరు. ఫెడరల్‌ ఫ్రంటు వస్తే యిస్తామని కెసియార్‌ అంటున్నారు.

కెసియార్‌ జూనియర్‌ మోదీయా?
కెసియార్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ అంతా బోగస్‌ అని, అతను జూనియర్‌ మోదీ అనీ, మోదీ ప్లానునే అమలు చేస్తున్నాడని బాబు ఆరోపణ. కెసియార్‌ చరిత్ర చూస్తే అతనికి నిలకడ తక్కువని అనిపిస్తుంది. ఎవరితోనైనా కలుస్తాడు, ఎవరితోనైనా విడిపోతాడు. మామూలుగా విడిపోవడం కాదు, బండబూతులూ తిడతాడు. తాజాగా తెలంగాణ ఎన్నికలు ముందస్తుగా జరపడానికి మోదీ సాయమడిగి, పొంది లాభపడ్డాడు. మోదీ మాత్రం ఎందుకు చేయాలి? కాంగ్రెసును దెబ్బ తీయాలనే కోరికతో! ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెసు ఎలాగూ పుంజుకుంటోంది.

కనీసం దక్షిణాది రాష్ట్రంలోనైనా చావుదెబ్బ కొట్టి, మొరేల్‌ దెబ్బ తీయాలనుకున్నాడు. దాని కోసం తన పార్టీని పణంగా పెడతాడా? అని ఆశ్చర్యం వద్దు. అక్కడ పార్టీ ఏమీ లేదు, పణంగా పెట్టడానికి. బిజెపికి దక్షిణాదిన కర్ణాటకలో మాత్రమే ఎడియూరప్ప వంటి నాయకుడున్నాడు. కేరళలో యిన్నాళ్లూ వృద్ధనాయకత్వం. కొత్తగా యువకులను చేరదీస్తున్నారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రల్లో నాయకులూ లేరు, క్యాడరూ లేరు. ఇక్కడ డెవలప్‌ చేస్తూ టైము వెచ్చిస్తే అక్కడ ఉత్తరాదిన క్యాడర్‌ జారిపోతారన్న భయం వేసి, తెలుగు రాష్ట్రాలను గాలికి వదిలేశారు.

మోదీతో కెసియార్‌కు సఖ్యత ఉండవచ్చు కానీ మోదీ అజెండాను అమలు చేయవలసినంత అవసరమైతే లేదు. ఎన్నికల తర్వాత రాజెవరో, రంగడెవరో! మొదట స్వరాష్ట్రంలో బలం పెంచుకోవడంపై శ్రద్ధ పెట్టాలి. అదే విషయం ఆయన స్టాలిన్‌కు చెప్పాడు - రాహుల్‌, ప్రియాంకా అంటూ కూర్చోకు అని. మమతది, సిపిఎంది అదే స్టాండు. ఎన్నికల తర్వాతనే ప్రధాని ఎవరో తేలుద్దాం అని. ఈ ఫెడరల్‌ ఫ్రంట్‌ మెయిన్‌ టార్గెట్‌ మైనారిటీలు, హరిజనులు అనుకోవచ్చు.

ఎందుకంటే యీ వర్గాలు బిజెపితో విసిగిపోయి ఉన్నారు. బిజెపికి బలమైన ప్రత్యర్థి కనబడితే వాళ్లను ఆదరిద్దామని చూస్తున్నారు. కానీ కాంగ్రెసు అంతర్గత బలహీనతల వలన, నాయకత్వ లోపం వలన చాలా చోట్ల ప్రత్యర్థిగా ఎదగలేకపోతోంది. అలాటి చోట్ల యీ ఫ్రంట్‌ ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తోంది.

మైనారిటీ, హరిజనుల ఓట్లు కీలకం
యుపిలో ఎస్పీ, బియస్పీ కూటమి అలాటిదే. వాళ్లు బిజెపికి వ్యతిరేక వర్గాలను తప్పక ఆకర్షిస్తారు. ఆ ధీమాతోనే తమ కూటమిలో కాంగ్రెసుకు వాటా యివ్వం పొమ్మన్నారు. కెసియార్‌దీ అదే ప్లాను. కాంగ్రెసు  రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి. దానికి జీవం పోయడం తెలివితక్కువ పని. అందుకే యీ ఫ్రంట్‌ ఐడియా. జగన్‌దీ అదే పరిస్థితి. తనను జైల్లో పెట్టించిన కాంగ్రెసుతో చేతులు కలపలేడు. బిజెపితో చేతులు కలిపితే యిప్పటివరకు దన్నుగా నిలిచిన మైనారిటీ వర్గాలు, హరిజనులు దూరమవుతారు. అందువలన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఒకటే మిగిలిన మార్గం.

నిజానికి బాబుకీ యీ చింత ఉంది. తను బిజెపితో చేతులు కలపడం చేత మైనారిటీ, హరిజనుల ఓట్లు పోగొట్టుకున్నాడు. కానీ యితర వర్గాలు అండగా నిలవడం చేత 2014లో రాష్ట్రవ్యాప్తంగా 1.5% ఓట్ల ఓడాతో గెలిచేశారు. బిజెపితో వైరం తర్వాత ఆ మేరకు పూడ్చుకోవాలంటే యీ వర్గాలకు దగ్గర కావాలి. ఈ వర్గాల దృష్టిలో జాతీయ స్థాయిలో బిజెపికి ప్రత్యామ్నాయం కాంగ్రెసు. అందువలన కాంగ్రెసుకు ఓటేయవచ్చనే అంచనాతో బాబు కాంగ్రెసుతో చేతులు కలిపారు.

కాంగ్రెసు వ్యతిరేకతతోనే పురుడు పోసుకుని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చినందుకు కాంగ్రెసును అడ్డమైన తిట్లూ తిట్టి, యిప్పుడు పొత్తు ఏమిటి అని అందరూ అడుగుతారని తెలిసి కూడా బాబు వారితో చేతులు కలపడానికి యిదే కారణం. ఆ కాంబినేషన్‌ నివారించాలంటే జగన్‌కు ఉన్న ఏకైక మార్గం - ఫెడరల్‌ ఫ్రంట్‌. అప్పుడూ యీ వర్గాల ఓట్లు కాంగ్రెసుకు పడవు, జగన్‌ బిజెపికి ప్రత్యామ్నాయంగా వారికి కనబడతాడు. ఇది జరగకూడదనే టిడిపి మాటిమాటికి జగన్‌ను బుల్లి మోదీ అని పిలుస్తూ ఉంటుంది.

మీడియా మద్దతూ కారణమే
జగన్‌ కెసియార్‌ ఫెడరల్‌ ఫ్రంటులో చేరడానికి మరో ముఖ్యకారణం మీడియా సపోర్టు కోసం కావచ్చు. ప్రస్తుతానికి అధికభాగం తెలుగు టీవీ ఛానెళ్లు, పత్రికలు బాబు ఏం చేసినా అది పుణ్యకార్యంగా, జగన్‌ ఏం చేసినా పాపకార్యంగా చిత్రీకరిస్తున్నాయి. ''సాక్షి'' టీవీ ద్వారా తన వెర్షన్‌ను వినిపిద్దామని వైసిపి ప్రయత్నించినా కుదరటం లేదు. కేబుల్‌ ఆపరేటర్లందరూ తన పార్టీ సానుభూతిపరులు కావడంతో టిడిపి ఛానెళ్లను నియంత్రించ గలుగుతోంది. ఇప్పుడు కెసియార్‌ తన సన్నిహితుల ద్వారా కొన్ని టీవీ ఛానెళ్లలో పెట్టుబడి పెట్టించి, వాటిని నియంత్రించ గలుగుతున్నారు. కెసియార్‌తో సఖ్యం నెరపితే జగన్‌ సైడ్‌ ఆఫ్‌ ద స్టోరీ కూడా ప్రజలకు చేరే అవకాశం ఉంటుంది.

కెసియార్‌తో సఖ్యం వలన జగన్‌ను ఆంధ్ర ప్రజలు తప్పుపడతారా? తక్కినవారి మాట ఎలా ఉన్నా రాయలసీమవారు మాత్రం పట్టకపోవచ్చు. ఎందుకంటే వారికి తెలంగాణతో అనేక విధాలుగా సంబంధాలున్నాయి. నీటి పంపిణీయే కాదు, యిచ్చిపుచ్చుకోవడాల నుంచి చాలా ఉన్నాయి. అందుకే 'రాయల తెలంగాణా' కాన్సెప్టు విని వారు ఉత్సాహపడ్డారు. బాబు పాలన వచ్చాక రాయలసీమకు ఏమీ దక్కకుండా పోవడంతో వారికి ఎలాగూ ఆగ్రహం ఉంది. రాజధాని ఎటూ లేదు, హైకోర్టు కూడా యివ్వలేదు, కనీసం రాయలసీమ దత్తపుత్రుడిగా చెప్పుకున్న ఎన్టీయార్‌ విగ్రహం కూడా అక్కడ స్థాపించటం లేదు. తెలంగాణతో స్నేహంగా వుంటేనే వాళ్లకు మేలు. అది వద్దని బాబు చెప్తే వాళ్లు వింటారనుకోను.

ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ ఏర్పడితే కెసియార్‌ ఒక్కడే ఉండరు కదా, ఆయనను తెలంగాణ ముఖ్యమంత్రిగా మాత్రమే చూడకుండా ఏదో ఒక ప్రాంతీయపార్టీగా నాయకుడిగా చూస్తే, యీ గుంజాటన ఉండదు. ఉదాహరణకి నవీన్‌ పట్నాయక్‌ సారథ్యం వహించారనుకోండి, మా పోలవరానికి అడ్డుపడ్డావని చెలిమి వద్దు పొమ్మంటారా? అది వేరే, యిది వేరే అంటారు. నిజానికి బాబు కూడా యిలాటి ప్రయత్నం చేసి, సాగక, కాంగ్రెసు పాలబడ్డారు.

తెలంగాణలో టిడిపితో పొత్తు కారణంగా నష్టపోయామని కాంగ్రెసు వాళ్లు కొందరు అనడం మొదలెట్టారు. రేపు ఆంధ్రలో పొత్తు గురించి కూడా ఆంధ్ర కాంగ్రెసు నాయకులు యిలాగే అంటే పొత్తు కుదరకపోవచ్చు. అప్పుడు బాబు నాలుగో ఫ్రంటు అంటూ వేరే పల్లవి ఎత్తుకోవచ్చు. ఈలోగా వాళ్లేం అన్నా జగన్‌ ఉలిక్కిపడనవసరం లేదు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
[email protected]

పవన్ ఒంటరిగా పోటీచేస్తే ఎవరికి లాభం?

రామ్ చరణ్ స్టామినా ఇది..!