ఎమ్బీయస్‌ - కెసియార్‌ ప్రభ తగ్గుతోందా?

రాబోయే ఎన్నికలలో తెరాసకు ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై కథనాలు చాలా వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు మేల్కొనడానికి ముందే బ్రహ్మాండమైన ప్లానుతో రంగంలోకి దిగింది కాబట్టి అదరగొట్టే మెజారిటీ వస్తుందని ముందులో అన్నారు. కానీ యిటీవల అన్ని సీట్లు రావని, క్షేత్రస్థాయిలో చాలా అసంతృప్తి వుందని, కెసియార్‌పై కాకపోయినా స్థానిక ఎమ్మెల్యేలపై కోపం ఉంది కాబట్టి చాలా సీట్లలో ఓటమి తప్పదని వార్తలు వస్తున్నాయి. ఫలానావారు నెగ్గి తీరతారనే అభిప్రాయం ముందే పాఠకులలో కలిగిస్తే మీడియాకు నష్టం. చివరి నిమిషం దాకా ఎటూ చెప్పలేం అనే ఉత్కంఠ కొనసాగిస్తేనే పత్రికలు, టీవీలకు గిరాకీ. అందువలన ఓ రోజు అనుకూల కథనాలు, మరో రోజు ప్రతికూల కథనాలు వెలువరిస్తూ ఉంటారు.

ప్రతి నియోజకవర్గం గురించి వివిధ పక్షాల బలాబలాలు రాసి, ఎన్నికలు దగ్గర పడేలోపున పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి అని ముగిస్తారు. ఇక చివరి రోజుల్లో కూడా సస్పెన్సు మేన్‌టేన్‌ చేస్తారు. అందువలన మనకు కాస్త గందరగోళం కలగడం సహజం. ప్రతి నియోజకవర్గం గురించి విశ్లేషించకుండా మొత్తం మీద పరిస్థితి ఎలా వుండవచ్చు అని అంచనా వేసే ప్రయత్నమిది. దీనికి ప్రధానంగా చూడవలసినది కెసియార్‌ పాలన ఎలా వుంది అన్నదానిపై ఓటర్ల అభిప్రాయం! ఉన్నదున్నట్లు చెప్పాలంటే కెసియార్‌ చేసిన అనేక వాగ్దానాలు, చెప్పిన కబుర్లు గాలికి పోయాయి. అయితే ఎంతో కొంత జరిగింది. ఈయన కాక వేరే ఎవరైనా ఉన్నా అంతే జరిగేదా? సాధారణంగా జరిగేదాని కంటె ఇరిగేషన్‌ రంగంలో కాస్త ఎక్కువే జరిగిందేమో! అంతే, అంతకు మించి పొడిచేసినది ఏమీ కనబడటం లేదు.

కానీ తెరాస వారి బడాయి కబుర్ల కారణంగా దీనికి కూడా మార్కులు పడని పరిస్థితి వచ్చింది. ఇక వాళ్లు ఊరించినదానితో పోల్చి చూస్తే విపరీతమైన ఆశాభంగం కలుగుతుంది. హైదరాబాదు అంతర్జాతీయ నగరం చేస్తామన్నారు, చేసేశామన్నారు. అధ్వాన్ననగరం తయారైంది. ఉద్యోగులను సంతృప్తి పరచాలని విపరీతంగా జీతాలు పెంచారు. వాళ్లు కూడా తెలంగాణ వస్తే రోజుకి యింకో రెండు గంటలు ఎక్కువగా పని చేస్తామన్నారు. ఇప్పుడు సరైన సమయానికి ఆఫీసుకి రావడమే గగనమైంది. అవినీతి సరేసరి, గతంలో కంటె ఎక్కువైంది తప్ప తగ్గలేదు.

కెసియార్‌ వైఫల్యం కొట్టవచ్చినట్లు కనబడేది - ఉద్యోగకల్పనలో! ఉద్యమసమయంలో ఎడాపెడా చేసిన వాగ్దానాలను నమ్మినవారు యిప్పుడు కసితో రగులుతున్నారు. రాజకీయపరమైన అవినీతి, అప్రజాస్వామిక పాలన, విమర్శను అణుమాత్రం కూడా సహించలేకపోవడం, ప్రతిపక్షం వారిని కాలరాయడం, మూఢనమ్మకాలు, చాదస్తాలు, దుర్భాషలు, ప్రచారార్భాటం, ప్రజాధన దుర్వ్యయం, మీడియాను అణగదొక్కడం - యిలా అనేక అంశాల్లో కెసియార్‌కు మైనస్‌ మార్కులే! అయితే కెసియార్‌కు కలిసి వచ్చిన అంశమేమిటంటే అన్నీ అమర్చిపెట్టిన హైదరాబాదు తెలంగాణకు దక్కడం! దాన్ని ఎంత భ్రష్టు పట్టించినా అది యింకా పెట్టుబడులు ఆకర్షిస్తోంది.

దాన్ని తెరాస తన ఖాతాలో వేసుకుంటోంది. కలిసి వచ్చిన యింకో అంశం - ఆంధ్రలో బాబు పాలన యింతకంటె ఘోరంగా ఉండడం! అక్కడ ఏ మాత్రమైనా బాగా వుండి వుంటే ఆంధ్రమూలాల వారే కాదు, తెలంగాణ వారూ అక్కడకి తరలేవారు, పెట్టుబడులు పెట్టేవారు. అది జరగకపోవడం వలన తెలుగువాళ్ల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షిస్తోంది. దానికి కారణం ప్రశాంతవాతావరణం.   

ఉద్యమసమయంలో అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నాయకుల భాష, తీరు చూసినవారికి తెలంగాణ యింత ప్రశాంతంగా ఉంటుందని తోచలేదు. కెసియార్‌ ఆంధ్రులను తిట్టి, పాప్యులర్‌ అవుతున్నాడనే అభిప్రాయంతో తక్కినవారు కూడా ఎగబడి తిట్టారు. ద్వేషాన్ని కక్కారు.

చివరకు తెలంగాణ రాష్ట్రం అతిశయోక్తులతో, అబద్ధాలతో, ముష్టిఘాతాలతో, పార్లమెంటులో అత్యంత హేయమైన పరిస్థితుల్లో అవతరించవలసి వచ్చింది. దీన్ని పాలించే హక్కును ప్రజలు తెరాసకు అప్పగించినప్పుడు మహారాష్ట్రలో శివసేన పాలనకు ప్రతిరూపం అవుతుందనిపించింది. కెసియార్‌ ముఖ్యమంత్రి కాగానే ఓ ఏడాది, ఏడాదిన్నర పాటు ప్రాంతీయ విద్వేషాలు వెదజల్లారు. సర్వేలు పెట్టి, స్థానికత రూల్సు మారుస్తూ కోర్టులకు వెళ్లి, ప్రజలను భయభ్రాంతులను చేశారు. పొరుగు రాష్ట్రంతో పేచీలు పెట్టుకున్నారు. వాళ్ల కివ్వాల్సిన ఆస్తులు, సంస్థలు అప్పగించలేదు. ఉద్యోగుల విషయంలో గొడవలు జరిపించారు. క్రమేపీ మార్పు వచ్చింది.

విద్వేషాలు రగల్చడం వలన తనకే నష్టమని బోధపడింది. శివసేన కూడా తను అధికారంలోకి వచ్చాక దక్షిణాది వారిని, గుజరాతీలను తరిమివేయలేదు. పాలన అంటే బాధ్యత. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి పట్ల తన విద్యుక్తధర్మాన్ని నిర్వర్తించాలి. ఇలా జరుగుతుందని కామన్‌ సెన్స్‌ ఉన్నవారికి ముందే తెలుసు. కానీ ఉద్యమంలో కిర్రెక్కించబడిన యువతకు, అవిద్యావంతులకు తెలియదు. తెలంగాణ ఏర్పడితే ఆంధ్రమూలాల వారు యిళ్లూ, ఉద్యోగాలు వదిలి వెళ్లి పోతారని, వాటిని తాము ఆక్రమించుకోవచ్చని భ్రమ పడ్డారు చాలామంది. కానీ అది జరక్కపోవడంతో, అంతా గతంలో లాగానే యథాతథంగా ఉండడంతో వారు నిరాశ పడుతున్నారు.

ఆంధ్ర కార్పోరేట్‌ కాలేజీలు మూతపడలేదు, వారి వ్యాపార సంస్థలు తరలి పోలేదు, కాంట్రాక్టులూ వారికే దక్కుతున్నాయి, సినిమారంగం వంటి వాటిల్లో వారి ఆధిపత్యం నడుస్తూనే ఉంది, వారి స్టూడియోలు మూసేయలేదు, ప్రయివేటు ఉద్యోగాలలో ఆంధ్రమూలాల వారికి ఉద్యోగాలు లభిస్తూనే ఉన్నాయి, అన్నిటా వారితో పోటీ పడవలసి వస్తూనే ఉంది. మరి కొట్లాడి కొత్త రాష్ట్రం తెచ్చుకుని లాభపడ్డదేమిటని వారు వాపోతున్నారు. వీరు తెరాసకు మళ్లీ ఓటేస్తారా అన్నది ప్రశ్న.

ఇక రాజకీయపరంగా చూస్తే కెసియార్‌ ఎడాపెడా ఫిరాయింపులు ప్రోత్సహించారు. అన్ని పార్టీల వారినీ తన పార్టీలోకి చేర్చేసుకున్నారు. చేర్చుకుని నిర్వీర్యం చేసి పడేశారు. కాంగ్రెసులో ఉండగా వాగ్‌శూరులుగా వెలిగినవారి నోళ్లు తెరాసలోకి ఫిరాయించగానే మూతపడ్డాయి. కెసియార్‌ ఏం చేసినా కిమ్మనే ధైర్యం ఎవరికీ లేదు. పార్టీ లోటుపాట్ల గురించి అంతర్గత సమావేశాల్లో (జరిగితే గిరిగితే) చర్చించే దమ్ము లేదు. దశాబ్దాలుగా చురుకైన ప్రజాజీవితం గడిపిన వీరందరికీ యిలా కుక్కిన పేనుల్లా పడి వుండడం నచ్చుతుందా? నానా పార్టీల నుంచి వారితో కలిసిపోవడం సాధ్యమౌతుందా? కెసియార్‌కి ప్రజాదరణ ఉందనే కారణంగానే భావంతోనే వీళ్లు మౌనంగా ఉంటున్నారు.

ఈ ఎన్నికల తర్వాత సీట్లు ఏ మాత్రం తగ్గినా, వీళ్లు గొంతు సవరించుకుంటారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండడం సహజం. అది మీడియా ద్వారా, పార్టీ నాయకుల ద్వారా ముఖ్యమంత్రికి తెలుస్తుంది. కానీ కెసియార్‌  నియంతగా మారి ఆ ద్వారాలు మూసేశారు. ఈ మధ్య నాయకులు సర్వేలంటూ జరిపించేసుకుని వాటి మీదే ఆధారపడి పోతున్నారు. సర్వేలు చేసేవారు ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారో ఎవరూ చెప్పలేరు. క్రిందకు వెళ్లేకొద్దీ ఎవరెవరికో ఔట్‌సోర్సు చేసేస్తారు. వాళ్లు జనంలోకి వెళ్లకుండా యింట్లో కూర్చుని టిక్కులు పెట్టేసి, కాగితాలు భర్తీ చేసి యిచ్చేస్తారు.  నిజంగా జనంలోకి వెళ్లి అడిగినప్పుడు కూడా వాళ్లు మనసులో మాట చెప్పరు - తెల్ల కార్డు తీసేస్తారో, పెన్షన్‌ ఆపేస్తారో అన్న భయం చేత! ఓటింగు వేళ తమ తడాఖా చూపిస్తారు. అందుకే అనేక సర్వేలు తప్పుతున్నాయి.

తెరాస విషయానికి వస్తే ప్రతి నియోజకవర్గంలో వివిధ రాజకీయ నేపథ్యాలతో వచ్చిన ముగ్గురు, నలుగురు నాయకులున్నారు. టిక్కెట్టు రానివాళ్లు మనస్ఫూర్తిగా పనిచేస్తారన్న నమ్మకం లేదు. కుట్రలు చేయరన్న హామీ లేదు. ఇవన్నీ ఫలితాల తర్వాత అందరికీ తేటతెల్లమౌతాయి. అందువలన కెసియార్‌ చెప్పుకునేట్లు 100 సీట్లు వస్తాయని అనుకోవడం పొరబాటు. అయితే తక్కిన అన్నిచోట్ల లాగానే తెలంగాణలో కూడా 'ప్రత్యామ్నాయం ఎవరు?' అనే ప్రశ్న ఎదురవుతోంది. కాంగ్రెసు, టిడిపి పార్టీలు కెసియార్‌ ధాటికి నిలబడి ఉద్యమాలు చేస్తూ ఉంటే, వాటి నాయకులు బెదిరో, లోభపడో గోడ దూకి వుండకపోతే నాలుగున్నరే ఏళ్లకే వాళ్లకు ఛాన్సు వచ్చుండేది. కలిసివస్తే అధికారంలోకి వచ్చి, బలమైన మంత్రులుగా ఉండేవారు.

కానీ యిప్పుడు తెరాసలో అనామకులుగా, కుక్కిన పేనుల్లా పడి వున్నారు. అలాటివాళ్ల వద్ద క్యాడర్‌ మిగిలివుందో లేదో చెప్పలేం. ఏది ఏమైనా కెసియార్‌ టిడిపికి నాయకులను మిగల్చలేదు. కాంగ్రెసులో చాలామందిని లాగేశారు. ఎంత లాగినా కొంతమంది మిగిలి, అదే ప్రధాన ప్రతిపక్షంగా మిగిలింది. అయితే తన బలం చాలదనే భావంతో అది టిడిపిని, తక్కిన పార్టీలను చేర్చుకోవాల నుకుంటోంది కానీ బేరాలు కుదరటం లేదు. ఇక మహాకూటమి ఏర్పడేదెప్పుడు? బరిలోకి దిగేదెప్పుడు? టిక్కెట్ల పంపిణీ గొడవలు తీర్చేదెప్పుడు? టిడిపిని వెంట తీసుకుని వెళితే మంచిదని కాంగ్రెసు ఎందునుకుంటోందో తెలియదు. ఆ రెండు పార్టీలు దశాబ్దాలుగా వైరం పూనినవారు, పోటాపోటీగా ఉన్నవారు. ఈనాడు నాయకులు చేతులు కలిపినా ఆ సఖ్యత క్యాడర్‌దాకా ఎలా పెర్కులేట్‌ అవుతుందో తెలియదు.

అసలు టిడిపికి క్యాడర్‌ మిగిలిందా అనేది మరో ప్రశ్న. తెలంగాణ విషయంలో టిడిపి నాయకత్వం చాలా తప్పులు చేసింది. తెలంగాణకై లేఖ యిచ్చినా, తెలంగాణ ద్రోహుల పార్టీగా ముద్ర పడిందనే భావంతో తెలంగాణపై దృష్టి పెట్టడం మానేసింది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పాపాన్ని ఆంధ్ర కాంగ్రెసు మోసింది. ఒక్క సీటు కూడా రాలేదు. దాని నాయకులు టిడిపిలోకి, వైసిపిలోకి గెంతేశారు. అయినా పార్టీకి ఎంతో కొంత బలం మిగలబట్టే కదా, యీ రోజు బాబు వాళ్లతో పొత్తు పెట్టుకుంటున్నారు! మరి టిడిపి నాయకత్వం తెలంగాణను గాలికి వదిలేయడం దేనికి? 'నేను యిక్కడి వాణ్నే, తెలంగాణ యూనిట్‌ నేనే చూసుకుంటాను' అన్న లోకేశ్‌ ఆంధ్రకు వెళ్లి మంత్రి అయి కూర్చున్నాడు.

టిడిపిలో మిగిలి వుంటే ఎవర్ని ఉద్ధరించినట్లు అనే భావంతో నాయకులందరూ తెరాసలోకి వెళ్లిపోయారు. లేదా స్తబ్ధంగా ఉన్నారు. ఈ రోజు 15 సీట్లు, అంటే ఎనిమిదో వంతు సీట్లలో నిలబడనిస్తే అదే మహద్భాగ్యం అన్నట్లు ఉన్నారు. ఇలాటి పార్టీని కలుపుకోవాలని కాంగ్రెసు అనుకోవడం దేనికి? తెలంగాణలోని ఆంధ్ర మూలాల వారందరూ టిడిపిని ఆదరిస్తారనే అంచనాతోనే కాంగ్రెసు టిడిపిని కూటమిలోకి ఆహ్వానిస్తోందనే వాదన వినబడుతోంది.  2014 ఎన్నికల సమయంలో ఆదరించారని స్పష్టంగా కనబడింది. దానికి కారణం - కెసియార్‌ తమను వేధిస్తూంటే తమకు అండగా టిడిపి నిలుస్తుందనే ఆశ! అందుకే నగరంలో టిడిపికి, దానితో పొత్తు పెట్టుకున్న బిజెపికి అన్ని సీట్లు వచ్చాయి.

టిడిపి ఆంధ్రలో కూడా ప్రతిపక్షంలో ఉండి వుంటే, యిక్కడా అక్కడా పోరాడుతూ వుండేదేమో, కానీ అక్కడ అధికారం చిక్కడం, కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని, నిధుల వేట అనే రంధిలో పడిపోవడంతో యిక్కడివారిని పట్టించుకోవడం మానేసింది. ఇక్కడ తాము ఎన్నుకున్న టిడిపి ఎమ్మేల్యేలంతా తమను తిట్టిపోసిన తెరాసలోకి దూకేశారు. కొన్నాళ్లకు ఓటుకు నోటు కేసులో చిక్కుకోవడంతో బాబు పదేళ్ల రాజధాని సౌకర్యాన్ని కూడా వదులుకుని ఉడాయించేయడంతో ఆశలు వమ్మయిపోయాయి. ఇక వాళ్లు టిడిపికి ఎందుకు ఎటాచ్‌ అయి వుంటారు? కార్పోరేషన్‌ ఎన్నికల్లోనే కెటియార్‌ యీ ఓటుబ్యాంకును మహా దువ్వాడు. దెబ్బకు టిడిపి తుడిచిపెట్టుకు పోయింది.  ఇప్పుడు మళ్లీ వాళ్లను తమవైపు తిప్పుకోవడానికి యీ మధ్యకాలంలో టిడిపి చేసిన దేముంది?

పైగా తెలంగాణలోని ఆంధ్రమూలాల వారందరూ టిడిపి సమర్థకులని ఎలా చెప్పగలరు? టిడిపి పాలిస్తున్న ఆంధ్రలోనే బాబు గ్రాఫ్‌ పడిపోతోంది. అలా ఎలా అనుకోగలం అనుకునేవారు బాబు, కాంగ్రెసుతో చేతులు ఎందుకు కలిపారో వివరించగలగాలి. ఆర్నెల్ల క్రితం దాకా బాబు కాంగ్రెసును తిట్టని తిట్టు లేదు. ముఖ్యంగా విభజన పాపం మొత్తాన్ని కాంగ్రెసు మీదే నెట్టేసి, ప్రత్యేక హోదా గురించి వారు చేసే ఉద్యమాన్ని తీసిపారేశారు. రాహుల్‌పై నిప్పులు కురిపించారు. అలాటిది యీ రోజు రాహుల్‌ వద్దకు వెళ్లి పొత్తు కుదుర్చుకోవలసి వచ్చిందంటే దాని భావమేమిటి? కాంగ్రెసు కున్న ఓట్ల శాతం - ఐదో, పదో ఎంత ఉంటే అంత - లేకపోతే తనకు విన్నింగ్‌ మార్జిన్‌ రాదన్న భయం చేతనే కదా!

వైసిపిని పిల్ల కాంగ్రెసు అంటూ వచ్చిన టిడిపి యీ రోజు వైసిపికి పిల్ల బిజెపి ముద్ర కొట్టి, తెలంగాణలో తను పిల్ల కాంగ్రెసు అయి, ఆంధ్రలో తల్లి కాంగ్రెసు అవుదామను కుంటోందంటేనే టిడిపి పాప్యులారిటీ ఏ స్థాయిలో వుందో తెలుస్తోంది. ఆంధ్రలోనే టిడిపి పరిస్థితి ఆశాజనకంగా లేనపుడు తెలంగాణలోని ఆంధ్రమూలాల వారు దానిపై ఆశలు ఎందుకు పెట్టుకుంటారు? పైగా తెరాసను కాదని, టిడిపిని నెత్తిన పెట్టుకోవడం వలన వాళ్లు బావుకునేదేముంది? ప్రస్తుతానికి తెలంగాణలో వాళ్లకు వచ్చిన కష్టాలేమీ లేవు. డబ్బున్న ఆంధ్రావాళ్లకు పనులన్నీ చక్కగా జరుగుతున్నాయి. కెసియార్‌ కుటుంబం ఆంధ్రులతోనే ఊరేగుతోంది. ముస్లింలను బుజ్జగించినట్లు ప్రతి తెలంగాణ రాజకీయ నాయకుడు ఆంధ్రమూలాల వారిని బుజ్జగిస్తున్నాడు.

నిత్యజీవితంలో ప్రాంతీయభేదాలను ఎన్నడూ ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, కళాకారుల విషయంలో వివక్షత కనబడుతోంది కానీ అది మరీ అస్తిత్వాన్ని గందరగోళ పరిచేది కాదు. ఇక్కడ కాదని ఆంధ్రకు వెళితే అక్కడ ఒక కులం వారికి తప్ప తక్కినవారికి పనులు జరగటం లేదంటున్నారు. కెసియార్‌ పాలనలో అన్ని కులాలకు ఒకే రకమైన ట్రీట్‌మెంట్‌. అయినవాడైతే కంచాల్లో, కాని వాడైతే ఆకుల్లో! కులంతో పని లేదు. డబ్బుండాలి, దాసోహమనాలి, చాలు. అందువలన ఆంధ్రమూలాల వారు చావైనా, రేవైనా తెలంగాణలోనే ఉంటున్నారు. మొదట్లో వాళ్లంతా వెళ్లిపోతే హైదరాబాదు వెలతెల పోయింది కానీ, ఆర్నెల్లలోనే పుంజుకుంది.

ఏడాది దాటేసరికి తెలంగాణలోనే పెట్టుబడులు పెట్టసాగారు. ఏడాదిన్నర, రెండేళ్లు గడిచేసరికి ఆంధ్రలో పెట్టుబడులు పెట్టినవారు నాలిక కరుచుకుని కర్ణాటక, మహారాష్ట్రలలో విహరించి వచ్చి తెలంగాణలో పెట్టసాగారు. ప్రస్తుతానికి హైదరాబాదులో ఫ్లాట్లే కాదు, తెలంగాణ గ్రామాల్లో ఎకరాలకు ఎకరాలు భూములు కొనేవాళ్లలో ఆంధ్రులు, ఆంధ్రమూలాల వారు ఉంటున్నారు. 

వీటన్నిటి కారణంగా తెలంగాణలో డబ్బు ధారాళంగా చేతులు మారుతోంది. డిమానిటైజేషన్‌ తర్వాత నల్లధనం మాయం అన్నారు కానీ యిప్పుడది శుబ్భరంగా ప్రవహిస్తోంది. భూముల వ్యాపారంలో ఉన్నవారు ఫీల్‌గుడ్‌ మూడ్‌లో ఉన్నారు.

రేట్లు పెరగడంతో ఆస్తులున్నవారందరూ - తెలంగాణవారు, ఆంధ్రమూలాల వారు, యితరులు కూడా - హ్యేపీగా ఉన్నారు. గతంలో తెలంగాణ ఆందోళన కారణంగా రేట్లు పడిపోయినప్పుడు కెసియార్‌ను తిట్టుకున్నవారు యిప్పుడతని పాలన పట్ల యీ విషయంలో సంతృప్తిగా ఉన్నారు. ఈ సంతోషకరమైన పరిస్థితిని చెడగొట్టుకుని వేరే ప్రభుత్వాన్ని తెస్తారా అన్నది సందేహమే. ఎందుకంటే ప్రత్యామ్నాయం ఏమంత ధైర్యాన్ని కలిగించటం లేదు. వారిని గెలిపిస్తే వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం, అందునా టిడిపితో! టిడిపి ఎప్పుడు ఎవరితో చేతులు కలుపుతుందో, ఎప్పుడు విసిరికొడుతుందో తెలియదు. యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనరుగా ఉండి హఠాత్తుగా వారికి చేయిచ్చారు బాబు. తర్వాత ఎన్‌డిఏతో ఉండి, వాళ్లతో కచ్చి కొట్టారు, మళ్లీ 2014లో పుస్తి కట్టుకున్నారు, నాలుగేళ్లలో పుస్తి తెంపారు.

కాంగ్రెసుతో కడుతున్న యీ పుస్తి ఆయుర్దాయం ఎంతో తెలియదు. 2019 ఎన్నికల తర్వాత మూడో ఫ్రంట్‌ పుంజుకుంటే, అప్పుడు కాంగ్రెసుకు రాంరాం చెబితే యిక్కడ తెలంగాణ సంకీర్ణ ప్రభుత్వం ఏమవుతుందో తెలియదు. కాంగ్రెసు ఒక్క పార్టీయే ఐనా దానిలో ముఖ్యమంత్రి అభ్యర్థులు అనేకులు. ఒకడి కాలు మరొకడు లాగుతూనే ఉంటాడు. ఈ తన్నులాటల్లో పాలన అస్తవ్యస్తమై, భూముల రేట్లు పడిపోతే ఎలా అనే బెంగ కచ్చితంగా ఉంటుంది. తెరాస విషయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఒకరే. సందిగ్ధత లేదు. ఆయన ఇంద్రుడు చంద్రుడని కీర్తించడానికి ముగ్గురు కుటుంబసభ్యుల ప్రతిభ ఉపయోగపడుతోంది. నిజానికి వాగ్ధాటి, కార్యశూరత్వం ఉన్న నలుగురు ఒకే కుటుంబంలో తటస్థపడడం అరుదు.

కరుణానిధి కుటుంబంలోనే దీన్ని కాస్త చూస్తాం. అతను, మేనల్లుడు మురసొలి మారన్‌, కొడుకు స్టాలిన్‌, కూతురు కనిమొళి! కనిమొళికి కార్యశూరత్వం ఉందో లేదో నాకు తెలియదు కానీ కవితకు మాత్రం పుష్కలంగా ఉంది. ఇలాటి ఫ్యామిలీ మద్దతు సౌకర్యం ఉన్న కాంగ్రెసు నాయకుడు ఒక్కడు కానరాడు. ఇక టిడిపిని కలుపుకోవడం వలన కాంగ్రెసుకు నిధులు అందవచ్చు కానీ యిమేజి చెడిపోతుంది. దానికి కారణం బాబు ఆంధ్రకు ముఖ్యమంత్రి కావడం. బాబును తెలంగాణ ద్రోహిగా తెరాస చేసే అభివర్ణనను తెలంగాణా వాసులు నమ్ముతున్నారనుకో నక్కరలేదు. ఎందుకంటే తను సిఎంగా ఉండగా బాబు పెట్టుబడులన్నీ హైదరాబాదులోనే, దాని పరిసరాల్లోనే పోశారు.

తద్వారా హైదరాబాదు బ్రాండ్‌ యిమేజి, తెలంగాణలో భూమి విలువ పెంచారు, అనేక మంది తెలంగాణ వారికి ఉద్యోగాలు వచ్చేట్లు చేశారు. ఇదంతా వాస్తవమే కానీ ప్రస్తుతం ఆయన ఆంధ్రకు సిఎం. అందువలన ఆయన ప్రాధాన్యత అక్కడ పెట్టుబడులే! ఎవరైనా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఆయన సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామిగా ఆంధ్రలో పెట్టమని లాక్కుని పోవచ్చు, ఎందుకంటే అక్కడ ఆయనది పై చేయి. ఈ అనుమానాల చేతనే, ప్రాంతీయ పార్టీలేవీ పక్క రాష్ట్రాలలో వర్ధిల్లలేదు. డిఎంకె పార్టీ అధికారంలోకి రాగానే తెలుగు నాట 'ద్రవిడ ముందడుగు కూటమి' అనే పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో ఒక శాఖ ప్రారంభించింది కానీ దానికి ముందడుగు పడలేదు.

కర్ణాటకలో డిఎంకె, ఎడిఎంకె రెండింటికి శాఖలున్నాయి. తమిళులు అధికంగా ఉన్న చోట అవి ఏ కౌన్సిలరు పోస్టో గెలుస్తాయి తప్ప రాష్ట్రంలో అధికారంలోకి రావు. ఎందుకంటే కావేరీ గొడవ వస్తే వీళ్లు తమిళ గీతమే పాడతారని స్థానికుల సందేహం. ఆంధ్ర, తెలంగాణ మధ్య నదీజలాల పంపిణీతో సహా అనేక చిక్కుముళ్లు వున్నాయి. అలాటప్పుడు పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని యిక్కడ అధికారంలోకి తీసుకురావడానికి జంకుతారు. ఈ వాదనలో తర్కముందనుకుంటే టిడిపితో పొత్తు పెట్టుకుని కాంగ్రెసు పొరబాటు చేస్తోందనే అనుకోవాలి. కెసియార్‌ బిజెపితో సఖ్యంగా ఉన్నాడు కాబట్టి, బిజెపి యిటీవల చాలా వివాదాల్లో మునిగింది కాబట్టి అది దెబ్బ కొడుతుందని కొందరంటున్నారు.

పార్లమెంటు ఎన్నికలతో వీటిని కలిపి వుంటే ప్రభావం పడేదేమో కానీ యిప్పుడు స్థానిక కారణాలే ముందుకు వస్తాయి. కెసియార్‌ ఓ పక్క మజ్లిస్‌తో మరో పక్క బిజెపితో స్నేహం చేయగల సమర్థుడు. మజ్లిస్‌ తన ఓటర్లకు ఎలా నచ్చచెపుతుందని ఆలోచించనక్కరలేదు. అధికారంలో ఎవరుంటే వారితో దోస్తీ వారి విధానం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కెటియార్‌ను ముఖ్యమంత్రిని చేసి, కెసియార్‌ బిజెపితో బాహాటంగా చేతులు కలిపి పార్లమెంటుకి పోటీ చేసి కేంద్రమంత్రి అయిపోయి, తెలంగాణకు నిధులు ప్రవహింపచేస్తారనే వాదన కూడా ప్రచారంలో వాడుకుంటున్నారు.

కెటియార్‌ ముఖ్యమంత్రి కావడంపై పెద్దగా ఎవరికీ అభ్యంతరాలు లేవు. ఆ మాట కొస్తే కెసియార్‌ కంటె అతనే ఎక్కువ అందుబాటులో వుండే వ్యక్తి, నోటిపై అదుపు ఉన్న వ్యక్తి, చాదస్తాలు తక్కువగా వున్న వ్యక్తి. కాంగ్రెసులోని ఏ ముఖ్యమంత్రి అభ్యర్థి కన్నా అతనికే ఎక్కువ ఆమోదయోగ్యత ఉందనుకోవచ్చు. మొత్తం మీద చూస్తే ప్రస్తుతానికి తెరాసకు 80 సీట్లకు ఐదు అటూయిటూగా రావచ్చనిపిస్తోంది. కాంగ్రెసు టిడిపితో వెళ్లకుండా వుంటే తెరాసకు 70కు లోపులే వస్తాయనుకునేవాణ్ని.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2018)

మీటూ... సంచలనంగా మొదలైందో.. అంతే చప్పున చల్లారిందా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments