కేసీఆర్‌ వ్యూహం.. ఒవైసీతో బేరం.?

'ఈక్వేషన్‌ ఎలా వున్నా, మాకు మీ మద్దతు కావాలి..' అంటూ మజ్లిస్‌ పార్టీని, తెలంగాణ రాష్ట్ర సమితి అడిగి వుండాలి. కానీ, ఎంచక్కా ఓ బుల్లెట్‌ వేసుకుని.. సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుని కలిసి సంచలనం సృష్టించారు మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ. ఆయన రూటే సెపరేటు.

ఇక్కడ, టీఆర్‌ఎస్‌కి మద్దతిచ్చేందుకు మజ్లిస్‌ పార్టీ ఆరాటపడ్తోందన్న విషయం ఎలివేట్‌ అవుతోంది. కానీ, తెరవెనుకాల జరుగుతున్న వ్యవహారం వేరట. అత్యంత వ్యూహాత్మకంగా కేసీఆర్‌, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీని, ప్రగతి భవన్‌ (సీఎం క్యాంప్‌ కార్యాలం)కు రప్పించారట.

ఎందుకు రప్పించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! బేరసారాల కోసం. 'మేం అధికారంలోకి వచ్చేస్తున్నాం.. మీకు ఏం కావాలి.?' అన్న విషయమై ఇరువురు నేతల మధ్యా చర్చ జరిగిందంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

మామూలుగా మజ్లిస్‌ పార్టీ, ఎవరికి మద్దతిచ్చినా.. అది కొన్ని పరిమితులకు లోబడి వుంటుంది. కానీ, టీఆర్‌ఎస్‌కి మజ్లిస్‌ మద్దతిచ్చే క్రమంలో చాలా అత్యుత్సాహం ప్రదర్శించింది. 'మనం పోటీచేస్తున్న చోట్ల మన పార్టీని గెలిపించండి.. మనం పోటీచేయని చోట, తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించండి..' అంటూ చాలా చాలా గట్టిగా.. మునుపెన్నడూ లేనంత గట్టిగా అసదుద్దీన్‌ ఒవైసీ నినదించారు.

అసదుద్దీన్‌ రాజకీయం ఇలావుంటే, ఆయనగారి సోదరుడు అక్బరుద్దీన్‌ తీరు ఇంకోలా వుంది. 'మేం ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు.?' అంటూ సాగాయి ఆయనగారి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు. ఒకవేళ రేపటి ఫలితాల్లో హంగ్‌ తప్పదని తేలితే, మజ్లిస్‌కి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన అవకాశాలు టీఆర్‌ఎస్‌ ఇవ్వకుండా వుంటుందా.? ఏమోగానీ, 'టీఆర్‌ఎస్‌ సొంతంగానే అధికారంలోకి వస్తుంది..' అని అసదుద్దీన్‌ తేల్చేశారు. 'మరి, మీ తమ్ముడి మాటేంటి.?' అనడిగితే, 'పార్టీ అధినేతగా చెబుతున్నా.. నా మాటే శాసనం..' అనేశారయన.

మజ్లిస్‌ రాజకీయాలకి కాంగ్రెస్‌, టీడీపీలే షాక్‌ తినాల్సి వచ్చింది. అలాంటిది, టీఆర్‌ఎస్‌ - మజ్లిస్‌ వ్యూహంలో చిక్కుకోదని ఎలా అనుకోగలం.? కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ, ఆల్రెడీ అసదుద్దీన్‌ నుంచి మాట తీసుకున్నారనీ, కాంగ్రెస్‌కి మజ్లిస్‌ మద్దతిస్తుందనీ కాంగ్రెస్‌లో ఓ వర్గం చాలా గట్టిగా నమ్ముతున్న వేళ.. అసద్‌తో భేటీలో కేసీఆర్‌కి, పూర్తిస్థాయి నమ్మకం వచ్చిందా.? ప్రగతి భవన్‌ కేంద్రంగా జరిగిన ఈ చర్చల వెనుక ఎలాంటి 'ఒప్పందాలూ' లేవని అనుకోగలమా.? 

టిఆర్ఎస్ గెలిస్తే ఎం జరుగుతుంది?..కూటమి గెలిస్తే ఏమవుతుంది?

Show comments