కేసీఆర్ Vs కోదండ.. అందరి దృష్టి దీనిపైనే!

తెలంగాణ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరందుకుంటున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ టీమ్, కోదండ టీమ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేసీఆర్ అవివేకి అంటూ కోదండరాం చేసిన వ్యాఖ్యలే దీనికి తాజా ఉదాహరణ. కుటుంబ పెత్తనం, గుత్తాధిపత్యంతో తెలంగాణలో ప్రభుత్వం నడుస్తోందని గతంలో ఎప్పుడూ ఇంత అవినీతి చూడలేదని కోదండరాం విమర్శలతో దండెత్తారు. టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల నిలయంగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

టీజేఎస్ ఆవిర్భావం తర్వాత కోదండరాం ఈ స్థాయిలో టీఆర్ఎస్ పై విరుచుకుపడిన దాఖలాలు లేవు. పార్టీ పెట్టేటప్పుడు కూడా ప్రత్యామ్నాయం కావాలన్నారు కానీ, అవినీతి, బంధుప్రీతిపై విమర్శలు ఎక్కుపెట్టలేదు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ మాస్టారు బాగానే రెచ్చిపోతున్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలతో ఉద్యమకారుల్లో ఒకరకమైన భావావేశం నింపిన కోదండరాం, ఈసారి ఆ ప్రయత్నం టీఆర్ఎస్ నేతలపై చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ కూడా ఏం తక్కువ తినలేదు.

నేరుగా కేసీఆర్ నోరు చేసుకోకపోయినా గతంలో మా మంచి మాస్టారంటూ పొగిడిన హరీష్ రావే స్వయంగా కోదండరాంని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఎంపీ కవిత కూడా కోదండంపై విరుచుకుపడుతున్నారు. కోదండరాం వార్డు సభ్యుడిగా కూడా గెలవలేడని, కేసీఆర్ తయారు చేసిన అనేకమంది నాయకుల్లో ఈయన కూడా ఒకరని అన్నారు. రాజకీయాల్లో కేసీఆర్ స్థాయి కోదండరాంకి లేకపోయినా తెలంగాణ ఉద్యమ సమయంలో ఒకే ఒరలో ఉన్న రెండు కత్తుల్లా కేసీఆర్, కోదండరాం మెలిగారు.

టీఆర్ఎస్ తో ఒకరు రాజకీయంగా పోరాడితే, టీజేఏసీ పేరుతో మరొకరు జనాల్ని సమైక్యం చేసి ఉద్యమానికి ఊపు తీసుకొచ్చారు. అయితే సహజంగానే ఉన్న సామాజిక వర్గ విభేదం వీరిద్దరి మధ్య కూడా ఉంది. ఏపీలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల మధ్య ఎంత వైరం ఉందో.. తెలంగాణలో రెడ్డి, వెలమ మధ్య అంతకంటే ఎక్కువ వర్గపోరు ఉంది. ఎక్కడికక్కడ కోదండరాం ఎదుగుదలకు బ్రేక్ లు వేస్తూ ఆనాడే వ్యూహాలు రచించారు కేసీఆర్.

అధికారంలోకి వచ్చాక టీజేఏసీలో ఉన్న బలహీనులందరికీ టికెట్ల ఎరవేసి టీఆర్ఎస్ కండువాలు కప్పేశారు. ఉద్యోగుల దగ్గర నుంచి, విద్యార్థి నాయకుల వరకు అందరినీ టీఆర్ఎస్ లీడర్లుగా మార్చేసి... టీజేఏసీని పూర్తిగా నామరూపాల్లేకుండా చేసి, కోదండరాంని ఏకాకిని చేశారు కేసీఆర్. ఇంతచేసినా కోదండరాం కేసీఆర్ పంచన చేరలేదు. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకున్నారు. ఆ ఆత్మాభిమానంతోనే ఆయన బీజేపీ, కాంగ్రెస్ లు పదవులిస్తామని పిలిచినా వాటిలో చేరలేదు.

సొంత కుంపటి పెట్టుకున్నారు. చివరకు రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందాడు. దీంతో తెలంగాణలో రాజకీయం రంజుగా మారిపోయింది. టీఆర్ఎస్ తిరస్కరించిన టీజేఏసీలోని మిగులు జనాలే ఇప్పుడు తెలంగాణ జనసమితిలో ఉన్నారు. తెలంగాణ జనసమితి కొన్నిచోట్ల గెలుపోటములపై ప్రభావం చూపగలదని సర్వేలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్, టీడీపీ వంటి పార్టీలతో పొత్తుకి సిద్ధపడటమే కోదండరాం చేస్తున్న పెద్ద తప్పు అని విశ్లేషకులు అంటున్నారు.

ఒకప్పుడు తెలంగాణ వ్యతిరేకులు అన్న పార్టీలతో ఇప్పుడు చేతులు కలపడం టీఆర్ఎస్ చేతికి విమర్శనాస్త్రాలు స్వయంగా అందించినట్టయింది. మొత్తమ్మీద ఈ ఎన్నికల్లో  బరిలో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ ప్రజల దృష్టి మాత్రం కేసీఆర్, కోదండరాం మాటల యుద్ధం మీదే ఉంది.

Show comments