కేసీఆర్‌ వర్సెస్‌ చంద్రబాబు!

-ఇదే 'పోరు తెలంగాణ'
-మహాకూటమి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే!
-కూటమి గెలిచినా బాబు కనుసన్నల్లోనే పాలన!
-గెలుస్తుందా అంటే మాత్రం సందేహామే!
-ఆసక్తిదాయకంగా 'పోల్‌ తెలంగాణ'

తెలంగాణలో టీడీపీ ఉందా? అనేది మొన్నటి దాకా చాలావరకూ స్పష్టత ఉన్న ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం కూడా సులభమే. తెలంగాణలో టీడీపీ లేదు! అని అంతా ముక్తాయింపులను ఇచ్చేవారు. దానికి కారణాలు అనేకం. తెలంగాణలో గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు అంతా ఫిరాయించేయడం ఒక రీజన్‌ అయితే.. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నుంచి బిచాణా ఎత్తేయడం రెండో రీజన్‌.. ఆపై జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి అనేదానికి ప్రాక్టికల్‌ ఆధారాలుగా నిలిచాయి.

ఇక చంద్రబాబు కూడా తెలంగాణలో టీడీపీ బతికించుకోవాలని ఆరాటపడలేదు. ఏపీలో అధికారం చేజారకుండా ఉండేందుకు ఎత్తులు వేస్తూ బాబు వస్తున్నాడు. తెలంగాణలో పొత్తులు తప్పవు అని మొదటి నుంచి చెబుతూ వచ్చాడు. పొత్తులే తమ పార్టీకి మనుగడ అని బాబు చేతులు ఎత్తేశాడు. ఆ పొత్తు.. తెలంగాణ రాష్ట్ర సమితితోనే కుదుర్చుకోవాలనేది చంద్రబాబు మొదటిప్లాన్‌. తెరాస నేతలను డైరెక్టుగా కలిసే అవకాశాలు ఉండవు కాబట్టి.. హరికృష్ణ మరణించినప్పుడు.. ఆయన శవాన్ని ముందు పెట్టుకుని పొత్తుల చర్చలు చేశాడట చంద్రబాబు నాయుడు.

అయితే తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడం కన్నా.. టీడీపీని ఓట్లు చీల్చే ఆయుధంగా చూశాడు కేసీఆర్‌. మనిద్దరి పొత్తు వద్దు, అలాగే నువ్వు కాంగ్రెస్‌తో పోవొద్దు.. సోలోగా వెళ్లు అని కేసీఆర్‌ ఉచిత సలహా ఇచ్చాడట. ఈ విషయాన్ని చంద్రబాబే చెప్పాడు. బాబు అలా ఎన్నికలకు వెళితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది అనేది కేసీఆర్‌ ఎత్తుగడ. దానివల్ల తనకు ఒరిగేది ఏమీలేదని బాబుకు తెలుసు! ఆల్రెడీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో ఆ కథ తెలిసిపోయింది. ఇప్పుడు సోలోగా బరిలోకి దిగితే.. తను ఆటలో అరటిపండు అవుతానని చంద్రబాబుకు అర్థం అయ్యింది. అందుకే.. రూటు మార్చాడు!

ఇంతలోనే అంత తేడా!
మొన్నటి వరకూ తెలంగాణ ఎన్నికల విషయంలో టీడీపీ అనామకమైనదే. అయితే ఇప్పుడు ఒక్కసారిగా పోరులో చంద్రబాబు కీలకం అయ్యాడు. అసలు తెలంగాణలో ఏనాడో చేతులు ఎత్తేసిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు అక్కడ రాజకీయ పరిణామాలను శాసిస్తున్నాడు. కేసీఆర్‌ గ్యాంగ్‌కు చంద్రబాబు ప్రత్యర్థిగా తయారయ్యాడు. తెలంగాణలో పోరు.. చంద్రశేఖర్‌ రావు వర్సెస్‌ చంద్రబాబు నాయుడుగా మారింది! తెలంగాణలో టీడీపీ తరఫున ఇప్పటికి మిగిలింది ఒకే ఒక ఎమ్మెల్యే కాగా.. ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీతో చంద్రబాబు నాయుడే ఢీ కొడుతున్నట్టుగా తయారైంది రాజకీయ పరిస్థితి!

కులం చెడ్డా సుఖం దక్కుతోందా!
కులం చెడ్డా సుఖం దక్కించుకోవాలనే థియరీ చంద్రబాబుది. అందుకే నిర్మొహమాటంగా, నిస్సిగ్గుగా, ఏమాత్రం భయంభక్తీ లేకుండా కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపేశాడు! ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా.. తనకు భయం లేదన్నట్టుగా చంద్రబాబు భావించాడు. ఎవరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపేశాడని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి పునాదులే కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకతే అనేదానితో వేశారనేది అందరికీ తెలిసిందే.

దశాబ్దాల తెలుగుదేశం గమనం.. కేవలం కాంగ్రెస్‌ వ్యతిరేకత అనే దానిమీద సాగిందనేది ఎవ్వరూ కాదనలేని అంశం. తెలుగుదేశం పార్టీ మొదటిసారి కావొచ్చు.. ఆపై ఎప్పుడైనా కావొచ్చు.. ఎప్పుడైనా అధికారంలోకి వచ్చిందంటే.. అది కాంగ్రెస్‌ మీద జనాల్లో వ్యతిరేకత ప్రబలినప్పుడే! అలాంటి కాంగ్రెస్‌తో చంద్బరాబు చేతులు కలిపాడు. ఈ విషయంలో టీడీపీ వీరాభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ప్రత్యేకించి ఏపీలో చంద్రబాబును ఛీత్కరించుకుంటున్నారు అనేమాట కూడా వినిపిస్తోంది.

చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలపడం ద్వారా తన అవకాశవాదాన్ని పరిపూర్ణంగా అర్థంఅయ్యేలా చేశాడని అంతా అనుకుంటున్నారు. అయితే బాబు కిందపడ్డా పైచేయి తనదే అనే టైపు. ఆయనకు వంత పాడటానికి మీడియా ఉండనే ఉంది. అందుకే కాంగ్రెస్‌ పార్టీతో కూడా చేతులు కలిపేయగలిగాడు. దీన్ని అనుకూల మీడియా అందంగా కవర్‌ చేస్తోంది. బీజేపీని బూచిగా చూపి చంద్రబాబు ఇలా తెలుగుదేశం పార్టీని సంకరం చేసేశాడు!

మరి ఇలా కులం చెడ్డా.. ప్రస్తుతానికి అయితే చంద్రబాబుకు తెలంగాణలో సుఖం దక్కుతోంది. మరి ఎన్నికల తర్వాత కూడా ఈ సుఖం ఉంటుందా? అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం!

కాంగ్రెస్‌ చేతగాని తనమే.. బాబుకు ప్లస్‌!
తెలంగాణ రాజకీయంలో చంద్రబాబు మళ్లీ ప్రధానం కావడానికి.. కనీసం అలా అనిపించడానికి ఉన్న మరోకారణం కాంగ్రెస్‌ పార్టీ. ఆ పార్టీ నేతల చేతగాని తనం చంద్రబాబును సమర్థుడిగా చేస్తోంది. ఆఖరికి తమ అభ్యర్థుల జాబితాను అమరావతికి పంపి బాబు ఆమోదముద్రను వేయించుకుందంటే ఆ పార్టీ పతనావస్థను అర్థం చేసుకోవచ్చు. ఈ బ్రోకరేజీ పనికి ఒక రాష్ట్ర మాజీ సీఎంను వినియోగించింది కాంగ్రెస్‌ పార్టీ. ఇక కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ విభాగంలో నాయకత్వ లేమి కొట్టుకొచ్చినట్టుగా కనిపిస్తోంది.

అటు సీఎల్పీ నేత, ఇటు పీసీసీ అధ్యక్షుడు ఇద్దరూ ఇద్దరే. ఇక అందరూ నాయకులే. ఎవరికీ అందరినీ కలుపుకపోయే శక్తిలేదు. ఎవరైనా అలాంటి ప్రయత్నం చేసినా.. వారికి మిగతావాళ్లు సహకరించరు. అదీ పరిస్థితి. అధిష్టానం కూడా అలాగే ఉంది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడేకాదు.. భవిష్యత్తులో కూడా బలమైన లీడర్‌ ఉండడు, రాడు. వచ్చినా వాళ్లను అధిష్టానమే తొక్కేస్తూ ఉంటుంది. నిజంగానే తెలంగాణ కాంగ్రెస్‌లో బలమైన లీడరే ఉంటే.. టీడీపీతో చేతులు కలపడానికే అతడు ఒప్పుకోడు!

అలా దిక్కూదివాణం లేక.. తమ శక్తిపై తమకే నమ్మకం లేనిస్థితిలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపాడు చంద్రబాబు. ఇదే సమయంలో బాబు ఆర్థికశక్తికి కాంగ్రెస్‌ అధిష్టానం కూడా గులాం అంటోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో బాబు చక్రం తిరుగుతోంది!

కూటమి గెలిస్తే.. బాబే కింగ్‌!
ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబు నాయుడు రాహుల్‌ గాంధీకి ఆదేశం లాంటి సూచన చేశాడట. అదేమిటంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశాడని సమాచారం. తెలుగు రాజకీయాల్లో కాంగ్రెస్‌ హైకమాండ్‌కు రెడ్ల మీదే నమ్మకం. ఇక్కడి రాజకీయ పరిస్థితికి అదే శరణ్యం అని హైకమాండ్‌ భావించింది. అయితే బాబు మాత్రం రెడ్డికి సీఎం పోస్టు ఇవ్వొద్దని స్పష్టం చేశాడట.

మరి అదంతా గెలిచినప్పటి కథ. గెలిస్తే.. కాంగ్రెస్‌ నేతలను పట్టేందుకు ఉండదు. అలాంటి వాళ్లను తనగాటన కట్టేసుకోవడం కూడా చంద్రబాబుకు పెద్ద కథ కాదు. చంద్రబాబుకు ఒక ఏడెనిమిది సీట్లు వచ్చి.. తనమద్దతు లేకపోతే తప్ప కాంగ్రెస్‌ నిలబడే పరిస్థితి లేకపోతే.. అప్పుడు తెలంగాణలో బాబు కింగ్‌ అయినట్టే. పాలన మొత్తం.. చంద్రబాబు, ఇద్దరు పత్రికాధినేతల కనుసన్నల్లో నడుస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఏం సందేహం లేదు కూడా.

ఇప్పుడు మహాకూటమి వాపును బలంగా చూపిస్తున్నది ఆ మీడియా వర్గాలే. కాబట్టి.. రేపు వీళ్లే గనుక లక్‌ కొద్దీ అధికారాన్ని సంపాదించుకుంటే.. అప్పుడు పాలన మొత్తం చంద్రబాబు కనుసన్నల్లో సాగుతుంది. అప్పుడు ఏపీలో అధికారం కోల్పోయినా చంద్రబాబు ఫీలవ్వడు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణలో అధికారం చంద్రబాబుకు ఏపీకి మించిన మజా అవుతుంది!

కేసీఆర్‌ చూస్తూ ఊరుకుంటాడా?
ఈ పోరు తెలంగాణలో... చంద్రబాబు నాయుడు అడుగుపెట్టడం కూడా తన మంచికే అని తెలంగాణ రాష్ట్ర సమితి భావిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్‌ కూటమితో చంద్రబాబు చేతులు కలిపకపోయుంటే.. కాంగ్రెస్‌ మీద తెరాస సెంటిమెంట్‌ అస్త్రాన్ని ప్రయోగించేందుకు అవకాశం ఉండేదికాదు. ఎంతసేపూ కాంగ్రెస్‌ నేతలు చవటలు, సన్నాసులు.. అని తిట్టడం మినహాయించి టీఆర్‌ఎస్‌కు అస్త్రం ఉండేదికాదు. కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణ పాలన ఢిల్లీ నుంచి సాగుతుంది అని తెరాస అంటే.. అందులో అంత పంచ్‌ ఉండదు.

అదే కాంగ్రెస్‌కు ఓటేశారో.. తెలంగాణ పాలన విజయవాడ నుంచి సాగుతుంది.. అని తెరాస అనడంలో పంచ్‌ ఉంది. తమకు అనుకూలంగా సెంటిమెంట్‌ను వాడుకోవడానికి తెరాసకు ఈ అంశం బాగా ఉపయోగపడుతుంది.

కూటమిలో లుకలుకలు కేసీఆర్‌కు లాభం!
తెలుగుదేశం పార్టీ అధినేతో కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చాలా సులభంగా చేతులు కలిపేశారు కానీ.. దిగువస్థాయి నాయకత్వం, కార్యకర్తల్లో అలాంటి పరిస్థితి అంత తేలికకాదు. పెద్దిళ్లలో వాళ్లకు పెళ్లిళ్లు, విడాకులు రెండూ సులభమే... అదే మధ్యతరగతిలో పెళ్లి, విడాకులు రెండూకష్టమే. ప్రతిష్టాత్మకమే. అందుకే పట్టింపులకు పోకుండా పెద్దవాళ్లు సుఖంగా ఉంటే, మధ్యతరగతి జనాలు పరువు హత్యలకు పోతారు, ప్రశాంతత లేకుండా చేసుకుంటారు.

రాజకీయంలో కూడా ఇంతే. పైస్థాయి నేతుల చేతులు కలిపినంత తేలికకాదు.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చేతులు కలపడం! మహాకూటమి విషయంలో ఇదే జరుగుతోంది. తెలంగాణలో గత ఎన్నికల్లో చాలా సీట్లలో త్రిముఖ పోటీ జరిగింది. తెరాస, కాంగ్రెస్‌, టీడీపీలు ఢీ అంటే ఢీ అన్నాయి. తెరాస బెస్ట్‌ ఆఫ్‌ త్రీగా నిలిచింది. ఈసారి కాంగ్రెస్‌, తెదేపాలు చేతులు కలిపాయి కదా.. ఓట్లు కూడా కలిసిపోతాయి అనుకోవడం అమాయకత్వమే. రాజకీయంలో వన్‌ ప్లస్‌ వన్‌ ఎప్పటికీ టూ కాదు. అది ఒక్కోసారి సున్నా కూడా కావొచ్చు.

ఇప్పటికే మహాకూటమిలో లుకలుకలు తీవ్రస్థాయికి చేరాయి. ఒక పార్టీకి కేటాయించిన సీటు విషయంలో మరో పార్టీ సహకరించం అని అంటోంది. అలా సహకరించుకునే పరిస్థితి ఉన్నచోట.. టికెట్‌ దక్కిన పార్టీకి సంబంధించిన రెబల్స్‌ బయల్దేరారు. ఇలా ఏదో ఒక ప్రతిబంధకమే కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కూటమి రాణిస్తుంది అనుకోవడం భ్రమే అని విశ్లేషకులు అంటున్నారు. ఇది కేసీఆర్‌కు లాభం కలిగించే అంశమే!

ఎన్నికల తర్వాతే కేసీఆర్‌ చక్రం?!
తెలంగాణలో ప్రజా వ్యతిరేకత కాస్త తొందరగానే వస్తుంది. దీనికి కేసీఆర్‌ కూడా మినహాయింపు కాకపోవచ్చు. వ్యతిరేకతే అయితే తప్పనిసరిగా ఉంటుంది. మహాకూటమికి అది అడ్వాంటేజే. అలాగని కూటమి గెలిచేస్తుందని అనుకోలేం. 2009లో వైఎస్‌కు వ్యతిరేకంగా నాలుగు పార్టీలు కూటమి కట్టాయి. తెలుగుదేశం, తెరాస, కమ్యూనిస్టు పార్టీలు.. మందకృష్ణ మాదిగ.. ఇలాంటి వాళ్లంతా వైఎస్‌ను ఓడించడమే లక్ష్యమని కలిశారు. చివరకు వాళ్లు ఏమయ్యారు? కూటమిగా వెళ్లి అప్పట్లో కేసీఆర్‌ పరువు పోగొట్టుకున్నాడు.

తెరాస పది సీట్లకు పరిమితం అయ్యింది. అందుకే రాజకీయంలో వన్‌ ప్లస్‌ వన్‌ టూ కాదు అనేది. ఇప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వం కూడా దాదాపు 2009లో వైఎస్‌ ప్రభుత్వం ఉండిన స్థాయిలోనే ఉంది. కాబట్టి.. మహాకూటమి వర్కవుట్‌ అయ్యే అవకాశాలు తక్కువే. పేపర్‌ మీద రాసుకుని చూసినా, కొన్ని పేపర్లలో చదివినా కూటమి బలంగా కనిపిస్తోంది కానీ.. క్షేత్రస్థాయిలో దీనికంత సీన్‌ లేదు. ఇక రాజకీయ అరాచక వ్యూహాల్లో కేసీఆర్‌ కూడా తలపండిపోయాడు.

తెలంగాణ ఏర్పడితే సీఎం సీటు దళితుడికి అని ప్రకటించిన మనిషి సీఎంగా కొనసాగుతున్నాడు. ఇక రాజకీయ ప్రత్యర్థి పార్టీల నుంచి వరసపెట్టి నేతలను చేర్చుకుని కూడా పెద్దగా టికెట్‌ల పోరులేకుండా చేసుకుంటున్న సమర్థుడు. ఫలితాల తర్వాత పరిస్థితి కాస్త అటూ ఇటుగా ఉన్నా.. కేసీఆర్‌ చక్రం తిప్పుతాడని స్పష్టం అవుతోంది. దీనికి కూటమి రాజకీయమే అవకాశాన్ని ఇస్తోంది.

మినిమం మెజారిటీ రాకున్నా.. కేసీఆర్‌దే రాజ్యం?
కర్ణాటకలో ఏం జరిగిందో చూశాం. అక్కడ అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి ప్రకారం చూసినా.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా నిలవడం ఖాయం! మినిమం మెజారిటీకి కాస్త దూరంగా నిలిచిన.. తెరాస అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని ఖాయంగా చెప్పవచ్చు. మినిమం మెజారిటీ కూడా రావొచ్చు. రాకపోయినా.. తెరాస సింగిల్‌ లార్జెస్ట్‌గా నిలుస్తుంది. దరిద్రంగా కేసీఆర్‌కు 40 చిల్లర సీట్లు వచ్చినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం కేసీఆర్‌ సమాయత్తం అవుతాడు. ఆ మేరకు చక్రం తిప్పగలడు కూడా.

ఎందుకంటే.. ఎలాగూ ఎంఐఎం సపోర్టు కేసీఆర్‌కే ఉంటుంది. మరోవైపు మోడీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నాడు తెరాస అధినేత. అదే కీలకం అయ్యే అవకాశం ఉంది. మోడీ అండతో.. ఫలితాల తర్వాత కేసీఆర్‌ మళ్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఆపై తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైనా గెలిచినా, కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలను లాక్కోవడం అయినా, టీజేఎస్‌ తరఫున ఎవరైనా గెలిచి ఉంటే వాళ్లను తిప్పుకోవడం అయినా, సీపీఐ తరఫున ఎవరైనా నెగ్గినా వాళ్లను తన వాళ్లను చేసుకోవడం అయినా కేసీఆర్‌కు చాలా సులువే!

చంద్రబాబు ఏం పతివ్రత కాదు కదా!
అలాంటి పరిస్థిత వస్తే చంద్రబాబు గగ్గోలు పెట్టవచ్చు. అప్రజాస్వామికం అంటూ విరుచుకుపడవచ్చు. తమ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ తిప్పుకోవడాన్ని బాబు గట్టిగా ఖండించవచ్చు. ఢిల్లీ వరకూ వెళ్లి లొల్లి పెట్టవచ్చు. అయితే.. చంద్రబాబుకు ఇలాంటి తిప్పుకోవడాలు బాబుకు కొత్త కాదు కదా. బాబు తొలిసారి సీఎం కావడమే అలాంటి పద్ధతిలో.. ఏపీలో కూడా 23 మంది ఎమ్మెల్యేలను బాబు తన వైపుకు తిప్పుకున్నాడు, నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు. ఇలాంటి చరిత్రను పెట్టుకుని చంద్రబాబు ఎంత గగ్గోలు పెట్టినా.. ప్రయోజనం ఉండకపోవచ్చు. బాబు కథను కేసీఆర్‌ అప్పుడు బుర్రకథలుగా పాడే అవకాశం ఉంది.

ఎలా చూసినా... బాబు వర్సెస్‌ కేసీఆర్‌గా సాగుతున్న తెలంగాణ రాజకీయంలో కేసీఆర్‌ విజేతగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అసలు కథ ఎలా ఉంటుందో డిసెంబర్‌ 11న తెలిసిపోతుంది!

-ఎల్‌.విజయలక్ష్మి

తెలంగాణలో అధికారం మాదే. కనీసం డెబ్బై నుంచి ఎనభై సీట్లను మహాకూటమి సొంతం చేసుకుంటుంది. కేసీఆర్‌ పాలనకు ఈ కూటమి చరమగీతం పాడబోతోంది. ఇందులో ఎలాంటి సందేహంలేదు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా కష్టపడుతోంది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే. నాలుగున్నరేళ్ల కేసీఆర్‌ పాలనపై ప్రజల్లో విరక్తి పుట్టింది. ఇక కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామే. ఆ పార్టీ 14 సీట్లకు పోటీచేస్తోంది.

ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా అందుకు తగ్గట్టుగా పని చేస్తున్నారు. చంద్రబాబు అనుమతి తీసుకునే అభ్యర్థులను ఖరారు చేసింది ఏమీలేదు. పొత్తు ధర్మంలో భాగంగానే బాబు వద్దకు కాంగ్రెస్‌ నేతలు వెళ్లారు తప్ప అంతకుమించి మరేం లేదు. కూటమిలో కాంగ్రెస్‌ పార్టీదే ప్రధానపాత్ర. కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణను పరిపాలిస్తుంది.

-డీకే అరుణ..  మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పాత్ర అనేది అభూత కల్పన. ఇది తెరాస సృష్టి. ఏపీలో ఏమాత్రం బలంలేని బీజేపీని బూచిగా చూపించి చంద్రబాబు ఎలా ప్రయోజనం పొందాలని చూస్తున్నారో... తెలంగాణలో కూడా టీఆర్‌ఎస్‌ బాబును బూచిగా చూపిస్తోంది. కాంగ్రెస్‌ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి టీఆర్‌ఎస్‌కు చంద్రబాబు ఉపయోగపడుతున్నాడు. ఇక చంద్రబాబు కూడా అంతా తమ చూట్టూరానే తిరుగుతోంది అనిపించుకోవడానికి ఉబలాటపడుతున్నాడు. ఇది బెడిసికొట్టవచ్చు.

మహాకూటమికి ఇది మైనస్సే అవుతుంది. గత ఎన్నికల్లో టీడీపీ సొంతంగా గెలిచిన సీట్లలో ఇప్పుడు మూడోవంతు నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ఇక మహాకూటమి అధికారం అన్నది కల్లగానే మిగిలే అవకాశం ఎక్కువగా ఉంది.
-తెలకపల్లి రవి.. సీనియర్‌ జర్నలిస్టు, విశ్లేషకులు

చంద్రబాబు కిందపడ్డా పైచేయి అయనదే అని చూపించే మీడియా ఉంది. అందుకే తెలంగాణ ఎన్నికల్లో బాబు ప్రధానా పాత్రధారిగా, సూత్రధారిగా కనిపిస్తున్నాడు. తెలంగాణ కాంగ్రెస్‌లో చెప్పుకోదగిన రాష్ట్రస్థాయి నేత కూడా లేడు. దీనితో చంద్రబాబే అంతా అనే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో బాబు కూడా అవకాశ వాదంతోనే అయినా.. రాహుల్‌ను కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇలా తెలంగాణ రాజకీయంలో ఉనికి చాటుతున్నాడు.

బాబు ప్రమేయం టీఆర్‌ఎస్‌కు ఒకరకంగా అడ్వాంటేజ్‌. మరోవైపు ఆ పార్టీకి భయం కూడా ఉంది. పక్కరాష్ట్ర సీఎంను తెరాస బూచిగా చూపించగలదు ఇది అడ్వాంటేజ్‌. తెరాస భయం ఎంటంటే ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీకి ఎంతోకొంత ఓటుశాతం ఉంది. అది ఫలితాలను మార్చివేయగలదు. కానీ కాంగ్రెస్‌లో రెబల్స్‌పోటు అధికంగా కనిపిస్తోంది. కనీసం 40 స్థానాల్లో వారు బరిలో దిగేలా ఉన్నారు. అదే జరిగితే తెరాస విజయం నల్లేరు మీద నడకే.

-విశేష్‌.. రాజకీయ, మానసిక విశ్లేషకులు

బిడ్డా రాస్కో.. తెలంగాణ‌లో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments