వెనక్కు తగ్గిన కేసీఆర్.. అసలు కారణం కేటీఆర్!

ప్రభుత్వాన్ని రద్దుచేసిన తర్వాత ఊరూవాడా బహిరంగ సభలు పెడతానని మాటిచ్చిన కేసీఆర్ ఇప్పుడెందుకు బైటకు రావడంలేదు. 2014లో తెలంగాణ అంతా సుడిగాలి పర్యటన చేసిన చంద్రశేఖర్ రావులో ఆ హుషారు ఏమైంది? ప్రత్యర్థులను విమర్శలతో చెడుగుడు ఆడుకునే గులాబీ బాస్ మౌనం వెనక కారణం ఏంటి? వీటన్నిటికీ సమాధానం కే..టీ..ఆర్. అవును కొడుకు కోసమే కేసీఆర్ వ్యూహాత్మకంగా వెనకడుగు వేశారు.

2014 ఎన్నికల టైమ్ లో టీఆర్ఎస్ లో వినిపించిన ఒకే ఒక్క పేరు కేసీఆర్. ఇప్పుడా పరిస్థితి మారుతోంది. కొడుకు కోసం కేసీఆర్ రోడ్ క్లియర్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని రద్దుచేసిన తర్వాత ప్రజా ఆశీర్వాద సభల్లో మినహా ఇంకెక్కడా కేసీఆర్ తెరపైకి రావడంలేదు. తెరవెనకే మంత్రాంగం నడుపుతున్నారు. మరోవైపు కేటీఆర్ ని మాత్రం జనంలోకి వదిలేశారు. అదే సమయంలో హరీష్ రావు సహా ఇంకెవరూ ఆయనకి అడ్డంలేకుండా పూర్తిగా సైడ్ చేసేశారు.

ఈ విషయంలో మీడియాను భారీఎత్తున ఉపయోగిస్తున్నారు కేసీఆర్. తనయుడు నిర్వహిస్తున్న సభలకు మీడియాలో ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోంది. సేమ్ టైం, హరీష్ రావు సభలకు అంతంత మాత్రంగానే కవరేజ్ లభిస్తోంది. ఇక్కడే కేసీఆర్ మంత్రాంగం మొత్తం తెలుస్తోంది. ఒక్కముక్కలో చెప్పాలంటే ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ, తన కంటే కేటీఆర్ అనే పదమే ఎక్కువగా వినిపించాలనే వ్యూహాన్ని కేసీఆర్ సక్సెస్ ఫుల్ గా అమలుచేస్తున్నారు.

ఇదంతా ఎందుకు అని ప్రశ్నించుకుంటే.. దీనివెనక ఓ సీక్రెట్ సర్వే ఉందనే టాక్ వినిపిస్తోంది. కేటీఆర్ ను ఫ్రంట్ రన్నర్ గా పెట్టాలనే నిర్ణయాన్ని కేసీఆర్ ఆషామాషీగా తీసుకోలేదు. తెలంగాణలో రహస్యంగా ఓ సర్వే నిర్వహించి మరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అవును.. అసెంబ్లీని రద్దు చేయకముందే ఈ సీక్రెట్ సర్వే నిర్వహించారట కేసీఆర్. తనయుడికి తెలంగాణ జిల్లాల్లో మైలేజీ ఎలా ఉందో తెలుసుకొని, ఆ తర్వాతే ప్రభుత్వాన్ని రద్దుచేశారు.

ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. 2018 ఎన్నికలకు తెలంగాణలో టీఆర్ఎస్ కి కేటీఆర్ నేతృత్వం వహిస్తున్నట్టు ఉంది. ప్రతిరోజూ బహిరంగ సభలు, ప్రత్యేక సమావేశాలతో జనంలో ఉంటున్నారు కేటీఆర్. హరీష్ రావు కూడా జనాల్లో నలుగుతున్నా దాన్ని విజయవంతంగా సైడ్ ట్రాక్ లోకి నెట్టేయగలిగారు. ఇదంతా కేసీఆర్ వ్యూహంలో భాగమే.

మరోవైపు కేసీఆర్ మాత్రం పూర్తిగా వ్యూహాలు, మేనిఫెస్టో, టిక్కెట్ల కేటాయింపులకు మాత్రమే పరిమితమయ్యారు. ప్రకటించిన జాబితా, ప్రకటించాల్సిన జాబితా అన్నిటికీ కేసీఆర్ ఒక్కరే రచయిత. ప్రచార పర్వం అంతా కేటీఆర్ కే వదిలిపెట్టేశారు.

రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, ముఖ్యమంత్రి స్థానంలో కేటీఆర్ ను కూర్చోబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేసీఆర్ టార్గెట్ ఇదే. జనాలకు అర్థంకావడానికి మాత్రం ఇంకాస్త టైం పడుతుంది.

వెనక్కి చూడకుండా పారిపో!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

Show comments