గులాబీ దళపతి ఇక ఆ ఊసెత్తరేమో!

పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ భవన్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు.

తొలివిడతలో కరీంనగర్ ఎంపీ నియోజకవర్గపరిధిలోని నేతలతో సమావేశమైన ఆయన ఈ సారి అక్కడ తాము ఖచ్చితంగా గెలవబోతున్నామని కూడా చెప్పారు. వ్యూహాలను గురించి చర్చించారు. పార్టీలో ఉత్తేజం నింపడానికి ప్రయత్నించారు. అయితే భారాసగా అవతరించిన తర్వాత.. భవిష్యత్ రాజకీయ ప్రస్థానం గురించి ఎలాంటి ఆర్భాటపు ప్రకటనలైతే చేశారో... ఈ సమావేశంలో వాటి జోలికి కూడా వెళ్లలేదు. కేసీఆర్.. పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతుండగా.. జాతీయ రాజకీయాల్లో భారాస చూపబోయే ముద్రగురించి ప్రస్తావన కూడా చేయలేదు.

ఒకవైపు.. భారాస నుంచి ఎంపీలు ఒక్కరొక్కరుగా ఇప్పటికే ముగ్గురు ఇతర పార్టీల్లోకి ఫిరాయించారు. మునిసిపాలిటీల విషయంలో పార్టీ ఎన్నడో బాగా దెబ్బతింది. ఎమ్మెల్యేలు ఇంకా వేచిచూస్తున్నారు. ఎమ్మెల్యేలే వేచిచూస్తున్నారా?.. వారిని చేర్చుకోవడానికి కాంగ్రెసు పార్టీ వేచిచూస్తున్నదా అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారాస పూర్తిగా బలహీనపడుతోంది. ఇప్పుడు కేసీఆర్ పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపడానికి ప్రయత్నిస్తున్నారు గానీ.. ఆ ధ్యాసలో తమది జాతీయ పార్టీ అనే సంగతి మర్చిపోతున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరున్న తమ పార్టీకి భారత రాష్ట్ర సమితిగా పునర్నామకరణం చేయడమే తమ అతిపెద్ద తప్పు అని కేసీఆర్ ప్రభృతులు ఈ పాటికి గుర్తించే ఉండవచ్చు. అలాంటి పరిణామం జరిగినప్పటినుంచి మొన్నమొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు.. దేశరాజకీయాలను మొత్తం తమ పార్టీ శాసించబోతున్నట్లుగా కేసీఆర్ అండ్ కో చెప్పుకుంటూ వచ్చారు.

Readmore!

తెలంగాణ పరిపాలనను కొడుకు చేతిలో పెట్టేసి.. తాను హస్తినాపురం కేంద్రంగా రాజకీయం నడిపించాలని కేసీఆర్ కలగన్నారు. భారాసగా నామకరణం అయినప్పటినుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు- ఆయన తెలంగాణలో కంటే.. ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన బహిరంగ సభలే ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. అయితే ఇక్కడ తల బొప్పి కట్టేసరికి ఇక జాతీయ రాజకీయాల మీద ఆసక్తి పూర్తిగా సన్నగిల్లిపోయినట్లుగా కనిపిస్తోంది.

నిజం చెప్పాలంటే ఆ పార్టీకి, అధినేతకకు ఇది చాలా సంకట స్థితి. ముందుగా అనుకున్నట్లుగా ఇతర ప్రాంతాల్లో కూడా ఎంపీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపి తొడకొట్టాలంటే.. తెలంగాణలో ఎంపీసీట్లు కూడా గల్లంతు అవుతాయేమోనని భయం. అదే సమయంలో.. ఇతర రాష్ట్రాల్లో పోటీచేయకపోతే.. భారాసగా ఆవిర్భావం అనేది ఆరంభశూరత్వంగా, అవమానకరంగా తేలిపోతుందని ఇంకోభయం! ఇలాంటి సంకటస్థితిలో గులాబీ దళపతి ఇక జాతీయ రాజకీయాల ఊసెత్తకపోవచ్చునని ప్రజలు అంచనా వేస్తున్నారు.

Show comments