బాబు అజ్ఞానాన్ని బయట పెట్టిన కేసీఆర్!

మొన్నటి వరకూ మోడీతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సాగత్యం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మోడీని చంద్రబాబు నాయుడు ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా ప్రశంసించాడో తెలిసిన సంగతే. మోడీ మేధస్సు గురించి, మోడీ చరిష్మా గురించి, మోడీ సమర్థత గురించి చంద్రబాబు నాయుడు బోలెడన్ని సార్లు మెచ్చుగోలు మాటలు.. భజనలు చేశాడు. కేవలం మోడీని వ్యక్తిగతంగా ప్రశంసించడమే కాదు.. మోడీ ఎదురుపడితే చాలన్నట్టుగా పర్యటనలు కూడా పెట్టుకున్నాడు బాబు.

అంతేగాక రాష్ట్రానికి మోడీ సర్కారు బ్రహ్మాండమైన స్థాయిలో సాయం చేస్తోందని అప్పట్లో బాబు ప్రకటించాడు. అందుకు ప్రతిగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం కూడా ప్రవేశ పెట్టాడు. ఏపీకి హోదాకు మించిన ప్యాకేజీ దక్కిందని చంద్రబాబు నాయుడు అప్పట్లో మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం పెట్టాడు. ఆ తీర్మానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే బాబు గయ్యిమన్నాడు వాళ్ల మీద. తనకే ఎక్కువ తెలుసని హోదాతో ఉపయోగం ఉండదని, ఏమీ రాదని.. ప్యాకేజే మేలని బాబు అప్పట్లో వాదించాడు.

ఇప్పుడు మొత్తం మాటలన్నీ మార్చేశాడు అనుకోండి. ఇవన్నీ ప్రజలకు తెలిసిన విషయాలే. చంద్రబాబు నాయుడు మోడీ భజన ఏ  రేంజ్ లో చేసేవాడో కొన్ని మీటింగులు కూడా అప్పట్లో తేటతెల్లం చేశాయి. ఎన్డీయే మీటింగులో చంద్రబాబు మరో తీర్మానాన్ని పెట్టాడు. అదేమిటంటే.. మళ్లీ మోడీనే ప్రధాని కావాలని! మోడీని మళ్లీ ప్రధానిని చేయాలని ఏడాది కిందట చంద్రబాబు నాయుడు ఎన్డీయే మీటింగులో తీర్మానం పెట్టాడు. ఇప్పుడు మోడీ అన్ని వ్యవస్థలనూ నాశనం చేశాడంటూ విరుచుకుపడుతున్నాడు. దటీజ్ చంద్రబాబు.

ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో విషయాన్ని చెప్పాడు. అది నీతి అయోగ్ సమావేశంలో జరిగిన వ్యవహారం. ఆ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హాజరైతే.. తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు మోడీని కీర్తించే పని మొదలుపెట్టాడట. మోడీ వీరుడు, శూరుడు అంటూ భజన అందుకున్నాడట బాబు.

ఆ భజన చేయడంలో కూడా చంద్రబాబు బొక్క బోర్లా పడ్డాడు అని కేసీఆర్ అన్నాడు. అదెలాగంటే..’దేశంలో ప్రధానమంత్రి అయిన తొలి సీఎం మీరే..” అంటూ మోడీని ప్రశంసించాడట చంద్రబాబు. అంటే సీఎం పదవి నుంచి పీఎం పదవికి ప్రమోషన్ పొందిన ఏకైక నేత మీరే అని బాబు చెప్పుకొచ్చాడట. ఈ మాట విని అక్కడున్న ముఖ్యమంత్రులంతా ఫక్కున నవ్వారని కేసీఆర్ అన్నాడు.

మోడీ భజన చేయడంలో మైమరిచిపోయిన చంద్రబాబు నాయుడు.. ఒకసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించి అనంతరం ప్రధాని అయిన నేతలను మరిచిపోయాడని కేసీఆర్ అన్నాడు. తెలుగు వాడు పీవీ నరసింహారావు ముందుగా ముఖ్యమంత్రి అయ్యి తర్వాత ప్రధాని అయ్యాడు, వీపీ సింగ్ కూడా అలాంటివాడే. అంతే కాదు..బాబు తనే ప్రధానిని చేశాననే దేవేగౌడ కూడా అంతకు పూర్వం కర్ణాటకకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేతే!

అలాంటి వాళ్లు ఉన్నా.. మోడీని ప్రశంసించడమే పని పెట్టుకుని చంద్రబాబు నాయుడు అలా భజన చేసి బొక్కబోర్లా పడ్డాడు అని.. అలాంటి బాబు ఇప్పుడు మోడీతో దోస్తీ చేస్తున్నాడు అంటూ తనను విమర్శిస్తున్నాడని.. కొంచెమైన సిగ్గుందా? అని కేసీఆర్ ప్రశ్నించాడు. మరి దీనికి చంద్రబాబు దగ్గర సమాధానం ఉందా?

Show comments