కేసీఆర్‌కి బూతులే ఆహారం

పదో చెల్లెలు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. 'అన్న' కేసీఆర్‌ మీద. 'ఆయన నన్ను దేవుడిచ్చిన చెల్లెలు అనుకున్నాడేమో.. నేనూ ఓ దశలో ఆయన్ని అన్నగా భావించానేమో.. కానీ, ఆయన నన్ను చెల్లెలిలా చూడలేదు. దళితుడే తొలి ముఖ్యమంత్రి అని దళితుల్ని ఎలాగైతే మోసం చేశాడో.. నన్నూ అలాగే మోసం చేశాడు. మోసమే అతని జీవితం..' అంటూ సినీ నటి, మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత విజయశాంతి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

''మన్మోహన్‌ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నప్పుడు.. ఆ రోజు పార్లమెంటులో ఇద్దరమే వున్నాం తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున.. అందులో ఒకరు కేసీఆర్‌.. ఇంకొకరు నేను మాత్రమే.. ఆ లెక్కన చూస్తే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్‌ టీఆర్‌ఎస్‌దే అయినప్పుడు, అందులో సగంవాటా నాకే దక్కుతుంది..'' అంటోంది రాములమ్మ అలియాస్‌ విజయశాంతి.

''బూతులు తిట్టడంతోనే కేసీఆర్‌లోని అభద్రతా భావం బయటపడ్తోంది.. బూతులే కేసీఆర్‌ ఆహారంగా మారిపోయినట్లుంది.. ఆయన తీరుతో తెలంగాణ సమాజం సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తోంది. తెలంగాణలో చిన్న పిల్లలెవరూ ఆయన మాటల్ని వినకూడదనేలా వుంది పరిస్థితి..'' అంటోన్న విజయశాంతి, ముందస్తు ఎన్నికలకు వెళ్ళి కేసీఆర్‌ చాలా పెద్ద తప్పిదం చేశారనీ, ఆ తప్పిదానికి తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారనీ, పది నుంచి పాతికసీట్లు టీఆర్‌ఎస్‌కి వస్తే గొప్పేనని చెబుతుండడం గమనార్హం.

కాంగ్రెస్‌ది 'అతి' విశ్వాసం కాదని ఘంటాపథంగా చెబుతున్నారు విజయశాంతి...

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తే, అ నియోజకవర్గానికే పరిమితమవ్వాల్సి వస్తుందనీ, అందుకే స్టార్‌ క్యాంపెయినర్‌గా తనకు దక్కిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని, రాష్ట్రమంతా పర్యటించి, కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావాలనే బాధ్యతను భుజానికెత్తుకున్నానని విజయశాంతి చెబుతున్నారు.

మొత్తమ్మీద, విజయశాంతి అయితే కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా పూర్తి కాన్ఫిడెన్స్‌తోనే కన్పిస్తున్నారు. అయితే, కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, అంతర్గత ప్రజాస్వామ్యం.. ఆ పార్టీకి పెనుశాపం కాబోతున్నాయన్నది ఓపెన్‌ సీక్రెట్‌. అంతకు మించి, మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాకపోవడం ఇంకో పెద్ద మైనస్‌ పాయింట్‌.

ఆ అంశాలపై విజయశాంతి మాట్లాడుతూ, 'ఏ పార్టీలో అయినా ఇలాంటివి సహజమే.. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఇంకాస్త ఎక్కువ అంతే..' అంటున్నారు.

Show comments