మంత్రివర్గం.. సామాజిక లెక్కలను పట్టించుకోని కేసీఆర్!

తెలంగాణలో నూతన మంత్రివర్గం ఎట్టకేలకూ ఏర్పడింది. ఎన్నికల ఫలితాలు వచ్చి, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసిన నెలల తర్వాత తెలంగాణలో కేబినెట్ ఏర్పడింది. అనేక అవాంతరాల అనంతరం.. ఈ కేబినెట్ ఏర్పడింది. కేసీఆర్ కూడా కేబినెట్ ఏర్పాటు పట్ల మరీ అంత ఆసక్తితో కనిపించలేదు. చివరికి ఇప్పటికి కేబినెట్ ఏర్పడింది.

మొత్తం పదిమందికి కేసీఆర్ కేబినెట్లో బెర్తులు లభించాయి. ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, ఈటల, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డిలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే మహ్మద్ అలీ రూపంలో కేసీఆర్ కేబినెట్లో ఒకరున్నారు. స్థూలంగా పదకొండు మంది, కేసీఆర్ తో కలుపుకుంటే పన్నెండు మంది. మరికొన్ని బెర్తులు అయితే ఖాళీగానే ఉన్నాయి. వాటిని లోక్ సభ సార్వత్రిక ఎన్నికల అనంతరం భర్తీ చేసే అవకాశాలున్నాయని సమాచారం.

ప్రస్తుతానికి అయితే కేసీఆర్ మరీ సామాజిక సమీకరణాలను పట్టించుకున్నట్టుగా లేదు. ఆయనకు అత్యంత సన్నిహిత నేత నాయిని నర్సింహారెడ్డికి కేసీఆర్ ఈసారి అవకాశం ఇవ్వలేదు. అయితే అనూహ్యంగా ఐదుమంది రెడ్లు మంత్రి పదవులను దక్కించుకోవడం విశేషం. పది మందిలో సగంమంది వీరే ఉన్నారు. ఇక ఇతరులకు తలా ఒక అవకాశాన్ని ఇచ్చినట్టున్నారు.

హరీష్ రావును కేబినెట్లోకి తీసుకోకపోవడం పట్ల రకరకాల ఊహగానాలు చెలరేగుతున్నాయి. అయితే కేబినెట్లోకి తీసుకోకపోవడం పట్ల తనకు అసంతృప్తి ఏమీలేదని హరీష్ ప్రకటించుకున్నారు. కేటీఆర్, హరీష్ లను ఎన్నికల అనంతరం కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతూ ఉంది.

ఇక కేసీఆర్ కేబినెట్లో ప్రస్తుతానికి మహిళలకు కూడా స్థానం దక్కలేదు. ఎలాంటి సమీకరణాలనూ పరిగణనలోకి తీసుకోకుండానే కేసీఆర్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్టున్నారు.

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?

Show comments