బీజేపీకి మిత్రుడేనా?

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బీజేపీకి మిత్రుడా? శత్రువా? పైకి చూస్తే బీజేపీ తమ ప్రత్యర్థేనని చెబుతారు. కాని లోపల ప్రధాని నరేంద్ర మోదీకి, కేసీఆర్‌కు మధ్య రహస్య ఒప్పందం ఉందనేది చాలామంది అభిప్రాయం. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిప్రాయం కూడా ఇదే. అందుకే కోల్‌కతాలో జనవరిలో నిర్వహించబోయే బీజేపీ వ్యతిరేక ర్యాలీకి కేసీఆర్‌ను ఆమె ఆహ్వానించలేదు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తూ లేఖ పంపారు. ఆయన బీజేపీకి నికార్సయిన ప్రత్యర్థని నమ్ముతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా చేసే పోరాటంలో చంద్రబాబు నాయుడే సరైన భాగస్వామని ఆమె అభిప్రాయం. మమత నుంచి చంద్రబాబుకు లేఖ అందినా కేసీఆర్‌కు అందలేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో భూకంపం సృష్టిస్తానని, రాజకీయాల ముఖచిత్రం సమూలంగా మార్చేస్తానని, గుణాత్మక మార్పుల కోసం జాతీయ రాజకీయాల్లో అడుగు పెడతానని, భవిష్యత్తు రాజకీయాలకు హైదరాబాద్‌ కేంద్రంగా మారబోతోందని కేసీఆర్‌ బాహుబలిలా ఇదివరలో దడదడలాడించారు.

ఆవేశంతో ఊగిపోయిన ముఖ్యమంత్రిని చూసి దేశం నివ్వెరపోయింది. పదమూడు వేలమంది ప్రతినిధులు పాల్గొన్న టీఆర్‌ఎస్‌ ప్లీనరలో మాట్లాడుతూ తాను చేసిన ఫ్రంట్‌ ప్రతిపాదన ఇప్పటికే ప్రకంపనాలు పుట్టిస్తోందన్నారు. ఇది సిల్లీ వ్యవహారం కాదన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన డెబ్బయ్‌ ఏళ్ల తరువాత కూడా దేశం దుర్భర స్థితిలో ఉండటానికి కాంగ్రెసు, బీజేపీలే కారణమని దుమ్మెత్తిపోశారు. తాను ఏర్పాటు చేయబోయే ఫెడరల్‌ ఫ్రంట్‌ దేశాభివృద్ధిని వేగవంతం చేస్తుందని, నిజమైన సహకార ఫెడరలిజంకు నాంది పలుకుతుందని అన్నారు.

కేసీఆర్‌ ఫ్రంట్‌ ప్రకటన చేయగానే టీఆర్‌ఎస్‌లో అన్ని శ్రేణుల నేతలు, కార్యకర్తలు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయి సంబరాలు చేసుకున్నారు. 'దేశ్‌కీ నేత కేసీఆర్‌', 'కాబోయే ప్రధాని కేసీఆర్‌ ' నినదించారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లగానే కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతాడని కొందరు ప్రకటనలు చేశారు.

ఫ్రంట్‌ ఏర్పాటు కోసం చర్చలు జరపడానికి కేసీఆర్‌ మొదటగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుసుకున్నారు.  కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ ప్రకటన చేసినప్పుడు ముందుగా స్పందించింది మమతా బెనర్జీయే. ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించారు. 

దీంతో ముందుగా అక్కడికి వెళ్లారు. వాస్తు,జ్యోతిష పండితులతో సంప్రదించి ముహూర్తం పెట్టుకొని మరీ వెళ్లారు. కాని పాజిటివ్‌ రిజల్టు రాలేదు. సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడారు. చెన్నయ్‌ వెళ్లి డీఎంకే నేత స్టాలిన్‌ను కలుసుకున్నారు.

బెంగళూరు వెళ్లి జేడీఎస్‌ అధినేత దేవెగౌడను కలుసుకున్నారు. కాని ఫెడరల్‌ ఫ్రంట్‌పై కేసీఆర్‌ చేసిన హడావుడి క్రమంగా చప్పబడిపోయింది. వచ్చే ఎన్నికల కంటే ముందుగానే ఫ్రంట్‌ సాకారమయ్యేది కాదని ఇదివరకే అర్థమపోయింది.

Show comments