కేసీఆర్ అంటే బాబుకి వణుకా?

వీరుడు పోరాడతాడు. ఓడతాడు. గెలుస్తాడు.. వీరమరణం పొందుతాడు. అంతేకానీ మడమ తిప్పడు. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వీరుడు కాదు కానీ, విజయం ఎలా సాధించాలా అన్నది తెలిసిన వాడు. విజయం కోసం ఏదైనా, ఎలాగైనా, ఎవరితోనైనా పని సాధించుకోగలిగిన వాడు. కానీ అలాంటి వ్యక్తి తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా పిల్లిలా మారిపోతున్నారు.

తెలంగాణలో తాను అది చేసా, ఇది చేసా అంటారు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు ఎలా వుందన్నది చెప్పరు. మోడీ, భాజపా వెనకాల వున్నాయి అంటారు కానీ, కేసీఆర్ వాళ్లకు లొంగిపోయారు అని అనరు. జగన్ మీద, మోడీ మీదా కూడా ఒంటికాలి మీద లేచి, తన భాషాజాలం అంతా వాడేసి విమర్శలు చేసే బాబుగారు, ఒక్క కేసీఆర్ విషయంలో మాత్రం వెనకడుగే వేస్తున్నారు.

వాస్తవానికి కుదరలేదు కానీ, పాపం, కేసీఆర్ తో పొత్తు పెట్టుకుందామనే చూసారు. కానీ ఎక్కడా సాధ్యంకాలేదు. ఈక్వేషన్లు అస్సలు కుదరలేదు. వన్ పర్సంట్ కుదిరినా బాబుగారు ఆ చాన్స్ వదిలేవారు కాదు. బాబుగారు పెట్టుకునే ఏ అక్రమ సంబంధాన్నైనా, సక్రమంగా చూపించాడానికి ఆయన మీడియా ఆయనకు వుంది. ఎదుటవారివి అన్నీ అక్రమసంబంధాలే అని కూడా అదే మీడియా బమ్మిని తిమ్మిని చేస్తుంటుంది.

సరే, ఆ విషయం వదిలేసి మళ్లీ అసలు విషయానికి వస్తే, నిన్నటికి నిన్న హరికృష్ణ కార్యక్రమం వుంది కాబట్టి, తప్ప హైదరాబాద్ వచ్చారు. పనిలో పనిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులకు కాస్త ధైర్యం చెప్పారు. మన కేడర్ మనకు వుంది. మీరు యోధులు పోరాడండి. పోరాడితే పోయేది మీరే తప్ప, నేను కాదు అని మాత్రం అనలేదు. 

తాను మాత్రం ముఖ్యమంత్రిగా వున్నాను కనుక ఎన్నికల ప్రచారానికి రాను అనేసారు. నిజానికి బాబుగారు ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటే అక్కడి నుంచి వందల కోట్లు డంప్ చేయగలరు. కాపుల ఏరియాకు కాపు మంత్రిని, రెడ్ల ఏరియాకు రెడ్డి మంత్రిని, యాదవ సామాజిక వర్గం కోసం ఆ కులానికి చెందిన మంత్రిని, ఇలా జనాలను అందరినీ ఆ మధ్య ఆళ్లగడ్డకు ఎలా డంప్ చేసారో అలా చేసి వుండేవారు. 

ఆళ్లగడ్డలో ఎలా నోట్లు వెదజల్లారో అలాచేసి వుండేవారు. కానీ అసలు ప్రచారమే చేయనంటున్నారు. అదేదో కురుక్షేత్రంలో ప్రారంభంలోనే అర్జునుడు విల్లంబులు కిందపడేసి, ఎదురుగుండా వున్నవాళ్లంతా తన బంధువులే అన్న చందంగా వుంది ఇదంతా. పోనీ అలా అని బాబుగారు టోటల్ గా యుద్దం వద్దు అనడంలేదు. మీరు చేయండి.. తాను ఆంధ్ర నుంచి చూస్తుంటా అంటున్నారు.

మరి ఆ మాత్రం దానికి తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీ అనడం ఎందుకో? తెలుగు రాష్ట్రంలోనే బలంగా పోరాడలేని నాయకుడు అనిపించుకోవడం ఎందుకో? అంటే ఎప్పటికైనా కేసీఆర్ వీక్ కాకపోడు, అప్పుడు తన ప్రతాపం చూపించకపోడు అని అనుకోవాలా?

సేనాని ముందుగానే తాను యుద్దంలోకి దిగను, మీరే ఫైట్ చేయండి అని సైనికులకు దిశానిర్దేశం చేయడం అంటే ఏమనుకోవాలి? నిజంగా పోరాడమనా? మీ చావు మీరు చావండి అనా? ఏమో? ఏమైనా ఏదో ఎక్కడో తేడా జరిగింది. చిన్న పిల్లాడు ఎక్కడో ఏదో చూసి, నిద్రలో పదే పదే ఉలిక్కి పడినట్లు వుంది బాబుగారి చందం.

హైదరాబాద్, కేసీఆర్ ను ఢీ కొనడం అంటేనే ఆమడ దూరంలో వుంటున్నారు. ఏమైందో పాపం, కేసీఆర్ డౌన్  అయ్యేవరకు బాబుగారు ఇలాగే వుంటారు.