కాపులపై ఆశ వదులుకున్న 'దేశం'?

తెలుగుదేశం వ్యవహారం ఏ దిశగా వెళ్తోంది అన్నది తెలుసుకోవడానికి పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకోనక్కర లేదు. ఆ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకుని, ఆ పార్టీ వార్తలు లీక్ చేస్తూ, ఆ పార్టీ తరపున మోడీనీ, జగన్ ను, పవన్ ను చీల్చి చెండాడే మీడియాను నిత్యం పరిశీలిస్తే చాలు. తెలుగుదేశం పోకడలు అర్థం అయిపోతాయి.  లెటెస్ట్ గా ఈ బాబు అను'కుల' మీడియా పోకడలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో కాపు ఓట్లపై ఆశ వదిలేసుకుని, బిసి ఓట్లను ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఆంధ్ర రాజకీయాల్లో కాపు ఓట్లది ఎప్పుడూ కీలకపాత్రే. అయితే తెలుగుదేశం ఆవిర్భావం నాటికి అవన్నీ కాంగ్రెస్ సొత్తుగా వుండేవి. అందుకే అప్పట్లో తెలుగుదేశం పార్టీ తెలివిగా కాపులను కాకుండా వెలమ, యాదవ తదితర బిసి కమ్యూనిటీలను దగ్గరకు తీసింది. తరువాత తరువాత కాపులు కూడా కొంతవరకు దగ్గరయ్యారు. కానీ ఎలాగైనా కాపులు తెలుగుదేశం పార్టీకి కాస్త దూరంగానే వుంటూ వస్తున్నారు.

వైఎస్ టైమ్ లో కాంగ్రెస్ కు, చిరంజీవి టైమ్ కొంతవరకు ప్రజారాజ్యానికి కాపులు మద్దతు ఇచ్చారు. అంతే తప్ప, తెలుగుదేశంతో ఫిక్స్ డ్ గా మాత్రంలేరు. 2014లో మాత్రం పవన్ అండగా వుండడంతో, కాపుల ఓట్లు చాలావరకు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. వాటిని నిలబెట్టుకోవడం కోసం, కాపు కార్పొరేషన్, కాపులకు రిజర్వేషన్, ఇంకా బోలెడు వరాలు వంటి వ్యవహారాలు చేపట్టారు.

కానీ ఎప్పుడు అయితే పవన్ మళ్లీ బాబుగారికి దూరం అయ్యారో, కాపుల ఓట్లు మళ్లీ సందిగ్థంలో పడ్డాయి. కాపుల ఓట్లు మూడు ముక్కలుగా చీలిపోయే అవకాశం కనిపించింది. దానికితోడు పవన్, తరచు ఈస్ట్, వెస్ట్ ల్లోనే వుంటూ, అక్కడే దృష్టిపెట్టారు. ఈ రెండు జిల్లాల్లో దేశం ఓట్ బ్యాంక్ కు పవన్ బాగా కన్నం పెట్టే అవకాశం వుందని ఇంటిలిజెన్స్ వర్గాలు రిపోర్టులు ఇస్తున్నట్లు బోగట్టా.

దీంతో తెలుగుదేశం పార్టీ రూట్ మార్చేసినట్లు కనిపిస్తోంది. ఇక కాపుల ఓట్ల కోసం పాకులాడే బదులు, వాటిపై ఆశ వదులుకుని, బిసి ఓట్లను పదిలం చేసుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. గత రెండు మూడు రోజులుగా , తెలుగుదేశం అనుకూల మీడియా..' జయహో..బి.సి' 'జయహొ..బి.సి' అని తెగ ఊదరగొడుతోంది.

తెలుగుదేశం పార్టీ మద్దతుతో బిసిల మహా సభ జరుగుతున్నట్లు, తెలుగుదేశం కోసమే జరుగుతున్నట్లు హడావుడి చేస్తోంది. ఇదంతా చూస్తుంటే పవన్ ఎఫెక్ట్ తో ఇక కాపుల ఓట్ల కోసం పాకులాడే బదులు మళ్లీ బిసి ఓట్లను పదిలం చేసుకునే ఆలోచన తెదేపా చేస్తున్నట్లు కనిపిస్తోంది.

కానీ చిత్రంగా ఇదే ఆలోచన జగన్ ఎప్పుడో చేసారు. కాపు రిజర్వేషన్ల మీద తన వైఖరి తేల్చిచెప్పారు. అప్పుడు ఇదే మీడియా, కాపులు మొత్తంగా జగన్ కు, ఆయన పార్టీకి వ్యతిరేకం అయిపోయినంతగా హడావుడి చేసి వార్తలు వండి వార్చింది.

మరి ఇప్పుడు జయహో బిసి. జయహో బిసి అంటే, కాపులు తేదేపాకు దూరం కారా? లేదా దూరం అయిపోయారని డిసైడ్ అయిపోయారా?

Show comments