కాపులకు పవన్ హిప్నాటిజం సెషన్

హిప్నాటిస్ట్ ఏం చేస్తారు. మనను ట్రాన్స్ లోకి తీసుకువెళ్లి, తను ఎలా చెబితే అలా వినేలా చేస్తారు. అలా వినడం ప్రారంభించాక మన మనసులో మాటలు మనమే చెప్పేలా చేస్తారు. అంతే కదా. ఇప్పుడు పవన్ కాపులను మాస్ హిప్నాటిజం చేయాలని చూస్తున్నారు. అందుకోసం ఓ అద్భుతమైన మాటలు పేర్చుకుని, మాంచి స్క్రిప్ట్ రెడీ చేయించుకుని, సుదీర్ఘ ప్రసంగం చేసారు. ఈ స్క్రిప్ట్ పూర్తిగా విన్న తరువాత తెలుగుదేశం వీరాభిమానులు అందరికీ గుండెల మీద నుంచి పెద్ద భారం దిగిపోయింది.

గతంలో ఇలాంటి కీలక సమావేశంలోనే తెలుగుదేశం, లోకేష్ ల మీద విరుచుకుపడిన వైనం ఇంకా వారి మనస్సులో వుంది. ఈ సారి ఏం చేస్తారా? ఏ మాట్లాడతారా? అని తెగ టెన్షన్ పడ్డారు. కానీ తెలుగుదేశం పార్టీతోనే తాను వెళ్తున్నాన్న హింట్ చాలా క్లియర్ గా, క్లారిటీగా ఇవ్వడంతో పాటు, కాపులు అందరినీ మెతమెత్తగా, కాస్త గట్టి గట్టిగా మాట్లాడుతూ తెలుగుదేశం దిశగా నడవండి అని చెప్పిన వైనం వారికి మరింత ఆనందాన్ని ఇచ్చింది.

ఇంతకీ పవన్ ఉపన్యాసం మొత్తం అర్థం పరమార్థం ఏమిటి? అంటే ఒకటి రెండు లైన్లలో చెప్పాలంటే…బిసి లకు కోపం రాకుండా, కాపులను చేరదీసి తెలుగుదేశం దిశగా మళ్లించడం, ఆ క్రమంలో త్యాగాలు చేసేలా చేయడం. అంటే బిసి లకు టికెట్ లు ఎక్కువ ఇస్తారు. కాపులు ఓటు వేసి సహకరించాలి. అదీ విషయం.

కృష్ణ..గుంటూరు..కాపులకు కమ్మలకు..కాపులకు ఎస్సీలకు పడదు అన్నది లోకల్ హిస్టరీ చెబుతున్న విషయం. అలాగే వెస్ట్ లో కాపులకు క్షత్రియులకు, ఎస్సీలకు, ఈస్ట్ లో కాపులకు కమ్మలకు, ఎస్సీలకు, విశాఖ జిల్లాలో కాపులకు గవరలకు, ఎస్సీలకు, విజయనగరం జిల్లాలో కాపులకు కొప్పల వెలమలకు, ఎస్సీలకు, శ్రీకాకుళం జిల్లాలో కాపులకు కాళింగులకు, ఎస్సీలకు పొసగదు అన్నది వాస్తవం. మరి ఇలాంటపుడు కాపులను చేరదీస్తే బిసి లు అంతా తెలుగుదేశానికి కావచ్చు, జనసేనకు కావచ్చు దూరం అవుతారు. గతంలో జరిగింది అదే. తెలుగుదేశం భయపడుతున్నది అదే. జగన్ ధీమా అదే. ఇవన్నీ మార్చుకుంటూ రావాలన్నదే పవన్ మీదుగా చంద్రబాబు పెట్టుకున్న అజెండాగా కనిపిస్తోంది.

ఇంతకీ పవన్ ఏం చెప్పారు.

కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అన్నారు. అంటే త్యాగాలు చేయాలని ఇండైరెక్ట్ గా చెప్పారు. అంటే పవన్-బాబు కలిసి బిసిలకు ఎక్కువ టికెట్ లు ఇచ్చినా కాపులు అలగకూడదు. అలా ఎందుకు చేయడం అంటే కాపులకే ఎక్కువ టికెట్ ల ఇస్తే సమస్య. జ‌గన్ ఎలాగూ బిసిలకు అగ్ర పీఠం వేస్తారు. దానిని తట్టుకోవాలంటే అదే పని తేదేపా కూడా చేయాలి. జ‌నసేన కనుక తేదేపాతో పొత్తు పెట్టుకున్నాక కూడా కాపులకు సరిపడా సీట్లు రాకపోతే సమస్య అవుతుంది. అందుకే ఈ బ్రెయిన్ వాష్.

మీరు మంచిగా వుండండి..కమ్మలతో, క్షత్రియులతో, బిసి లతో అని చెప్పడం. బ్రాహ్మణులతో, వైశ్యులతో అని ఎందుకు చెప్పలేదు అంటే కాపులకు బ్రాహ్మణులకు, వైశ్యులకు ఏ గొడవా లేదు కనుక. వాళ్లతో టికెట్ ల పంచాయతీ లేదు కనుక.

తెలుగుదేశం-జ‌నసేన పొత్తు అంటే కాపులకు చెందిన వంగవీటి రంగా, కమ్మ వర్గానికి చెందిన రత్నకుమారిని పెళ్లి చేసుకోవడం అన్నట్లు ఇండైరెక్ట్ గా చెప్పుకుని వచ్చారు పవన్. కాపు నేతలు తమ పిల్లలను కమ్మ వారికి ఇచ్చినపుడు కాపు జ‌నాలకు కమ్మ వారితో గొడవ ఎందుకు అన్నది పవన్ వాదన.

కాపు నేతలు నమ్మరు

కాపు నేతలు ఎవ్వరినీ నమ్మవద్దు..నన్నే నమ్మండి అన్నది పవన్ మరో మాట. ఎందుకు ఇలా చెబుతున్నారు. పవన్ తెలివిగా ఆడుతున్న ఈ కమ్మ-కాపు డ్రామా అంతా తెలుగుదేశం కోసమే అని కాపు నేతలకు తెలిసిపోతుంది. వారి అనుభవం అలాంటిది. వాళ్లు ఈ కాపు యువతను ఏమైనా డైవర్ట్ చేస్తారేమో అన్నది పవన్ అనుమానం. 

అందుకే ముందరి కాళ్లకు బంధంలా కాపు నాయకులను పట్టించుకోకండి. వాళ్లు మిమ్మల్ని ఇన్నాళ్లూ వాడుకున్నారు. వాళ్ల చేత మీకోసం పని ఎలా చేయించాలో నాకు తెలుసు..నాకు వదిలేయండి అంటున్నారు. అంతే కాదు ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి అంటూ ప్రాధేయపడ్డారు.

గెలుపు ముఖ్యం

ఒకసారి తెదేపా, భాజ‌పాలను ధిక్కరించి, ఓటమి పొందానని, మరోసారి అలా ఓడిపోవడం తనకు ఇష్టం లేదని క్లారిటీగా చెప్పేసారు పవన్. భాజ‌పా ను, తేదేపా ఎందుకు ఆ రోజు ద్వేషించారు. ఒకటి లోకేష్ అవినీతి..రెండు ప్రత్యేక హోదా. మరి ఈ రెండు సిద్దాంతాలు ఇప్పుడు ఏమయినట్లు. అంటే ఓటమి భయంతో వాటిని వదిలేసారు. 

గెలుపే కీలకం అంటున్నారు. మరి ఇంక పవన్ కు ఏ మేరకు సైద్దాంతిక నిబద్దత వున్నట్లు? తాను భాజ‌పాను వదిలేస్తే అది వైకాపాతో వెళ్లిందని, అందుకే ఇప్పుడు వదలనని చెప్పకనే చెప్పారు.

కప్పదాటు

కాంట్రిబ్యూటర్ పింఛను మీద వైకాపా మాట తప్పిందని చెప్పారు. ప్రతి దానికీ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పారు తప్ప దీనికి మాత్రం మాట దాటేసారు. మద్య నిషేధం ప్రాంతాల వారీ పెడతానంటూ కొత్త థియరీ చెప్పారు. 

మద్య నిషేధం సాధ్యం కాదు కనుక క్వాలిటీ లిక్కర్ ఇస్తా అంటూ చెప్పుకు వచ్చారు. మరి మీకు సాధ్యం కానిది జ‌గన్ ఎలా చేయాలని అడుగుతున్నారు.

అసలు కీలకం అదే

అసలు ఒంటరి పోటీ లేదనే అంటున్నారు. తేదేపాతో వెళ్లక తప్పదంటున్నారు. సిఎమ్ సిఎమ్ అని ఎంత అరిచిన అది తన మైండ్ కు పట్టదంటున్నారు. అంటే జ‌నసైనికులకు ఇంకా క్లారిటీ రావడం లేదు. చంద్రబాబును సిఎమ్ చేయాలన్నదే ఎజెండా అని. కానీ అలా అధికారపార్టీతో పొత్తు అనుకున్నా, తాను ఇచ్చిన హామీలు ఎలా అమలు అవుతాయి. అవే హామీలు తేదేపా కూడా ఇస్తే తప్ప?

పవన్ చేస్తున్న ఈ బ్రెయిన్ వాష్, హిప్నాటిజం లోంచి జ‌నసైనికులు బయటకు వస్తే, మరోసారి పవన్ కు దారుణ పరాభవం తప్పదు. కానీ ఫ్యానిజంతో గుడ్డిగా వెంట వెళ్లినా, ఓ ఏడాదిన్నర తరువాత పవన్ తత్వం బోధపడుతుంది. అప్పటికి అంతా అయిపోతుంది.

Show comments