కమ్మోళ్లపై కంప్లయింటా? నో అపాయింట్మెంట్!

అనంతపురంలో ప్రబోధానంద ఆశ్రమానికి సంబంధించి రేగిన వివాదం... కమ్మ రెడ్డి గొడవగా రూపు మార్చుకుంది. అనంతపురం జిల్లాలోని తెలుగుదేశానికి కమ్మ నాయకులందరూ ప్రబోధానంద స్వామికి అండగా నిలిచారు. ఆయనకు మద్దతు పలికారు. ప్రబోధానంద కమ్మ వర్గానికి చెందిన వ్యక్తి అని, ఆయన అసలు పేరు పెద్దన్న చౌదరి అని తేలింది. దీంతో ఆ వర్గం ఆయనను అక్కున చేర్చుకుంది. తెరవెనుక నుంచి ఆయనకు వారు భరోసా అందించారు.

నీకేమీ కాకుండా చూస్తాం అంటూ మాట ఇచ్చారు. ఇదే సమయంలో ప్రబోధానంద స్వామి మీద యుద్ధం ప్రకటించిన జేసీ దివాకర రెడ్డి... ఒక పట్టాన దీన్ని వదలిపెట్టేలా లేరు. ప్రబోధానంద అంతు తేల్చాలనే ఆయన అనుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో చంద్రబాబునాయుడు ఎవరి పక్షం వహిస్తారు? జేసీ దివాకరరెడ్డి చెబుతున్న కంప్లయింట్లను ఆయన ఆలకిస్తారా? లేదా, కమ్మవాళ్ల మాటను మాత్రం పరిగణించి.. ఆయన సొదను పెడచెవిన పెడతారా అనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఇలాంటి సంక్లిష్టత నెలకొని ఉన్న నేపథ్యంలో.. ప్రబోధానంద అక్రమాలు, అరాచకాలకు సంబంధించి కంప్లయింట్లు చేయడానికి కొన్ని వీడియో సాక్ష్యాల సహా జేసీ దివాకరరెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవడానికి వెళ్లడం... ఆయన జేసీకి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడం అనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

జేసీ దివాకరరెడ్డి తొలినాళ్లలో ప్రబోధానంద ఆశ్రమానికి సన్నిహితంగానే మెలిగారు. ఇప్పుడు ఆయన ఆశ్రమం వైఖరిపై కత్తిగట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు.. ఆశ్రమం గురించి కొన్ని వీడియోలు కూడా చూపిస్తానంటూ ఆయన చెబుతున్నారు. నిజానికి ఇదేపని మీద జేసీ దివాకర రెడ్డి మంగళవారం అసెంబ్లీకి కూడా వచ్చారు. ఏదో ఒక సమయంలో సీఎంకు కాస్త ఖాళీ దొరికితే వీడియోలు చూపించాలని అనుకున్నారు.

చంద్రబాబును కలిసి ఈ విషయం చెప్పారు కూడా. అయితే చంద్రబాబు టైం ఇవ్వలేదు. శాసనసభ్యులతోను, అధికార్లతోను సమావేశాల్లో బిజీగా ఉన్నానని, ఇప్పుడు కుదరదని చంద్రబాబు చెప్పారు. దీంతో బుధవారం మరోసారి కలిసి అయినా సరే.. ప్రబోధానంద వీడియోలు చూపించడానికి జేసీ వేచి ఉండిపోయారు.

ఇంతకూ బుధవారం అయినా ... వీడియోలు చూసేంత ఓపికగా.. అదికూడా కమ్మవారి మీద కంప్లయింటు ఇవ్వడానికి సంబంధించి.. చంద్రబాబు జేసీకి సమయం ఇస్తారా లేదా అనేది అంతుబట్టడం లేదు. 

Show comments