కామెడీ: ఇదే లాస్ట్.. ఇంకొక్క సినిమా చేస్తా

ఇకపై తన జీవితం పూర్తిగా రాజకీయాలకే అంకితం అన్నాడు
పెండింగ్ లో ఉన్న 2 సినిమాలు కంప్లీట్ చేసి అంకితమైపోతా అన్నాడు
తన చిరకాల కోరిక ఇండియన్-2 సినిమా మాత్రం చేసి అంకితమైపోతా అన్నాడు
ఇప్పుడేమో ఫ్రెష్ గా మరో సినిమా ఎనౌన్స్ చేశాడు కమల్ హాసన్.

అవును... పార్టీ స్థాపించిన తర్వాత తొలుత రాజకీయాలకే ప్రాధాన్యం అని చెప్పిన కమల్, తర్వాత మాట మార్చారు. పెండింగ్ ప్రాజెక్టులతో పాటు శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2 చేస్తానన్నారు. ఇప్పుడేమో దీనికి అదనంగా మరో సినిమా కూడా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు ప్రకటించాడు.

గతంలో తను నటించిన క్షత్రియపుత్రుడు సినిమాకు సీక్వెల్ చేస్తానంటున్నాడు కమల్. శివాజీ గణేశన్ ఒళ్లో, ఎంజీఆర్ భుజాలపై ఆడుకున్న తనకు మాత్రమే ఆ సినిమాకు సీక్వెల్ చేసే అర్హత ఉందని, పైగా అది తన డ్రీమ్ రోల్స్ లో ఒకటని అంటున్నాడు. శివాజీ గణేశన్, కమల్ హాసన్, రేవతి, గౌతమి, నాజర్ కీలకపాత్రల్లో పోషించిన ఈ సినిమా 1992లో వచ్చింది. ఆ సినిమాకు సీక్వెల్ చేస్తానంటున్నాడు కమల్.

రీసెంట్ గా విశ్వరూపం-2 రిలీజ్ చేసి ఫ్లాప్ తెచ్చుకున్న కమల్ హాసన్, శభాష్ నాయుడు సినిమాను పూర్తిచేసే పనిలో పడ్డాడు. దీంతో పాటు శంకర్ దర్శకత్వంలో త్వరలోనే ఇండియన్-2ను స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత క్షత్రియ పుత్రుడు సీక్వెల్ సెట్స్ పైకి వస్తుంది.

ఈ సినిమాకు సంబంధించి డ్రాఫ్ట్ వర్క్ మొదలైందని చెబుతున్న కమల్.. త్వరలోనే దర్శకుడి వివరాల్ని వెల్లడిస్తానని ప్రకటించాడు. తనే దర్శకత్వం వహించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలా వరుసపెట్టి సినిమా మీద సినిమా ప్రకటిస్తున్న కమల్ హాసన్.. తను కొత్తగా స్థాపించిన రాజకీయ పార్టీని ఏ తీరానికి చేరుస్తారో చూడాలి. 

Show comments