జాతీయ ప్రాజెక్టు ఆశలు.. అటకెక్కినట్టే!

విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కట్టబెట్టారు గనుక.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం డిజైన్లు మార్చి ఘనంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా అదే హోదా కావాలంటూ.. తెరాస, కేసీఆర్ సర్కారు చాలా రోజులుగా కోరుతోంది. గత అయిదేళ్లలో అనేకసార్లు మోడీని కలిసి వారు జాతీయహోదా కోసం డిమాండ్ చేశారు. కానీ... తాజాగా హైదరాబాదులో నిర్వహించిన పార్టీ సమావేశం సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధి లాగా వచ్చిన జేపీ నడ్డా... అలాంటి ఆశలను పూర్తిగా తుంచేశారు. ఈ ఆశలు ఇంతటితో పరిసమాప్తం అయినట్టే భావించాల్సి వస్తోంది.

తెలంగాణలో పలువురు నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరిన సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ కార్యక్రమానికే జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన కేసీఆర్ సర్కారు మీద ఎడా పెడా విమర్శలు గుప్పించారు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి పహెన్షా లాగా, నేను నా కుటుంబం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని’’ విమర్శించారు. ఇదొక ఎత్తు అయితే కాళేశ్వరం వంటి పవిత్రమైన పేరుతో నిర్మిస్తున్న ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 30 వేల కోట్ల నుంచి 80 వేల కోట్లకు పెంచేసి... భారీగా అవినీతికి పాల్పడ్డారని కూడా ఆరోపించారు.

మిషన్ కాకతీయను, మిషన్ కమీషన్ గా మార్చేసారని కూడా విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు చాలా కీలకమైనవి. కాళేశ్వర ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడం గురించి.. తెరాస కేంద్రం వద్ద నిరంతరాయ పోరాటం సాగిస్తోంది. గతంలోని, ఇటీవలి కాలంలో కూడా పలుమార్లు కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర భాజపా నాయకుల్ని ఎవర్ని విమర్శించదలచుకున్నా.. ‘చేతనైతే, రాష్ట్రంమీద చిత్తశుద్ధి ఉంటే.. కాళేశ్వరానికి జాతీయహోదా తీసుకురండి’ అని విమర్శించడం రివాజు అయిపోయింది. భాజపా నాయకులు కూడా కొన్నాళ్లు, ‘సాధించుకు వస్తాం’ అని ప్రకటించి, తర్వాత మిన్నకుండిపోయారు.

ఇప్పుడు కాళేశ్వరం, మిషన్ భగీరథ గురించి భాజపా చేస్తున్న ఆరోపణలను గమనిస్తోంటే.. ఇకమీద ఆ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి పైసా రాలడం కల్ల అనుకోవాల్సి వస్తోంది. వేల కోట్ల రూపాయల అవినీతి కోసమే అవి చేసినట్లు ఆరోపిస్తున్న వారు.. అదే ప్రాజెక్టులకు డబ్బులు మంజూరు చేస్తారా? అనేది సందేహమే. జాతీయ ప్రాజెక్టు ఆశలు ఇక్కడితో అంతరించినట్లే. మరి కేసీఆర్ ఈ వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారో చూడాలి.

సాహోపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయంటే..

Show comments