కాజల్ తో చాలా కంఫర్ట్-బెల్లంకొండ

అల్లుడు శీను.. స్పీడున్నోడు.. జయజానకీ నాయక.. సాక్ష్యం.. లేటెస్ట్ గా కవచం. ఇదీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినీ ప్రయాణం. సినిమా సినిమాకు వైవిధ్యం, జోనర్ మార్పు క్లియర్ గా కనిపిస్తోంది. అయితే కవచం సినిమాకు ముందు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు అన్నీ భారీ భారీ సినిమాలు. ఇప్పుడు కవచం సినిమా వ్యవహారం కాస్త వేరుగా కనిపిస్తోంది. అసలు బెల్లంకొండ శ్రీనివాస్ ఐఢియా ఏమిటి? వైవిధ్యమా? బడ్జెట్ నా? ఇంకేమిటి? చూద్దాం.

ఈ 'కవచం' కెరీర్ కు కవచంగా వుంటుందా?
ఈ సినిమానే కాదు, మరే సినిమా అయినా కెరీర్ కు కవచంలాగే వుండాలి. ఇదో డిఫరెంట్ సినిమా. ముఖ్యంగా ఈ జోనర్ సినిమా ఇప్పటి వరకు ఈ రేంజ్ ఖర్చుతో రాలేదు. సాధారణంగా థ్రిల్లర్ సినిమాలు కోటి నుంచి అయిదుకోట్ల వరకు ఖర్చుచేస్తారు. కానీ ఇదే సినిమాను ఓ రేంజ్ లో చూపించే ప్రయత్నమే కవచం. ఒక పక్క థ్రిల్ అవుతూనే, మరోపక్క పెద్ద సినిమాను ఎంజాయ్ చేసే ఫీలింగ్ వుంటుంది.

ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్ర. మిగిలిన హీరోల స్టయిల్ పై ఓ లుక్ వేసారా?
అలా అని ప్రత్యేకంగా లేదు. అన్ని సినిమాలు తెలిసినవే. అయితే కాస్త రియలిస్టిక్ గా, పక్కా పోలీస్ గెటప్ అనేలా, పక్కా పోలీస్ బాడీ లాంగ్వేజ్ అనేలా వుండాలి అని మాత్రం అనుకున్నారు. ఆ మేరకు కష్టపడ్డాను.

బోయపాటి డైరక్షన్ లో చేసిన ప్రభావం ఇంకా కనిపిస్తోంది డైలాగ్ డిక్షన్ లో?
అలా అని కాదు, పోలీస్ క్యారెక్టర్ కదా, ఆ ఫోర్స్, ఆ ఫ్రస్టేషన్ అన్నీకలిసి డైలాగ్ మాడ్యులేషన్ అలా సెట్ చేసాం.

బెల్లంకొండ శ్రీనివాస్ అంటే పాటలు, డ్యాన్స్ లు కూడా. మరి థ్రిల్లర్ మూవీ అంటున్నారు.
అవీ వున్నాయి రెండు పాటలు, డ్యాన్స్ లు వుంటాయి. అలా అని కథకు అడ్డంపడవు.

ఇప్పటివరకు మీరు చేసిన హీరోయిన్లో సీనియర్ మోస్ట్ కాజల్. టెన్షన్ ఏమన్నా పడ్డారా?
ఇప్పటి దాకా నేను చేసిన హీరోయిన్లలో నా మైండ్ సెట్ కు దగ్గరగా వున్న హీరోయిన్, నేను చాలా కంఫర్ట్ బుల్ గా ఫీలయిన్ హీరోయిన్ కాజల్. తను చాలా సలహాలు కూడా ఇచ్చేది.

కవచం ముందువరకు అన్నీ భారీ సినిమాలే. ఈ సినిమాకు ఆ రేంజ్ బడ్జెట్ పెట్టలేదు. అంటే మీ సినిమాలు, మీ మార్కెట్ మీద ఓ అయిడియా వచ్చిందా?
సినిమాలకు తగినట్లే ఖర్చు వుంటుంది. సాక్ష్యం సినిమాను, జయజానకీ నాయక సినిమాలను తక్కువలో తీయలేం కదా? ఈ సినిమా చూస్తే  మీకు తెలుస్తుంది ఏ రేంజ్ ఖర్చుచేసామన్నది. ఇక నా మార్కెట్ అంటారా? మీకే తెలుసు.

ముఫై అయిదుకోట్ల మేరకు అన్నీకలిపి రెవెన్యూ పక్కాగా వస్తోంది. అంటే ఆ మేరకు నా మార్కెట్ వున్నట్లేగా? నిర్మాతలు సేఫ్ గా వుండాలని కూడా నేను అనుకోవడంలో తప్పులేదు కదా? అందుకే ముఫైకోట్ల బడ్జెట్ సేఫ్ అని ఓ నిర్ణయానికి వచ్చాను.

మీ ఫాదర్ పెట్టుబడులు పెడతారని, అందుకే మీకు వరుసగా సినిమాలు వస్తున్నాయని టాక్. నిజమేనా?
అలాంటి ఆర్టికల్స్ ఒకటి రెండు నేనూ చదివాను. అంత అవసరం లేదు. మార్కెట్ వుంటే నిర్మాతలు వస్తారు. పదిహేను కోట్ల వరకు అదర్ దాన్ థియేటర్ హక్కులు వస్తున్నాయి. మీరే గమనించి వుంటారు. అందువల్ల ఇలాంటి గ్యాసిప్ లు అన్నీ విని వదిలేయడమే.

పోనీ, డబ్బుల సంగతి పక్కన పెడితే, ఆయన జోక్యం ఏమేరకు వుంటుంది?
నిర్మాతలు కొత్త వాళ్లయితే, వాళ్లు అడిగితే సలహా ఇవ్వడం తప్ప, ఆయన నేరుగా కలుగచేసుకోరు. ఆయన ఎన్నో సినిమాలు తీసారు, ఎన్నో సినిమాలు పంపిణీ చేసారు. ఇండస్ట్రీ గురించి ఆయన అనుభవం వాడుకోవడం అయితే తప్పుకాదు కదా?

నిర్మాతలకు మీకు మధ్య కవచంలా మీ ఫాదర్ వుంటారేమో కదా?
అది నాకు ఆనందమే. ఆయన ఎప్పటికీ నాకు ఓ కవచమే. అందులో సందేహంలేదు.

మీ ఫాదర్ పెద్ద నిర్మాత. కానీ మిమ్మల్ని సినిమాల్లోకి తీసుకురావడం కోసం ఆయన నిర్మాణాలే వదులుకోవాల్సి వచ్చింది. త్యాగమంటారా? నష్టపోయారంటారా?
త్యాగమే అంటాను. నా కోసం ఆయన నాకన్నా ఎక్కువ కలలు కన్నారు. వాటికోసం ఆయన చేయాల్సినంతా చేసారు. చేస్తున్నారు. అది నాకు ఎప్పటికీ గుర్తు వుంటుంది.

ఇంట్లో అన్నీ అమర్చే ఫాదర్ వున్నారు. కాంపిటీషన్ కూడా ఇంట్లోంచే రాబోతోందా?
మా బ్రదర్ సంగతా మీరు అడిగేది. వాడి జోనర్, వాడి ప్రయత్నాలు వేరు. ఆ సబ్జెక్ట్ లు మనం టచ్ చేసేవికావు.

సాక్ష్యం సినిమా డిస్పపాయింట్ చేసిందా?
తప్పదు కదా? నిజానికి మంచి సబ్జెక్ట్. ఇప్పటిదాకా రాని సబ్జెక్ట్. అందుకే చాలా నమ్మాం దాన్ని.

భీమినేని శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, శీవాస్, మళ్లీ ఇప్పుడు శ్రీనివాస్.. ఇంకా ఎంతమంది డైరక్టర్లు వస్తారు ఈ లైన్ లో?
నాకు భలే చిత్రం అనిపించింది. అలా సెట్ అయింది అదేంటో? తరువాత సినిమా తేజతో కదా.. బ్రేక్ పడింది లెండి.

తేజతో సినిమా.. ఎలా నమ్మారు? సక్సెస్ రేట్ విషయంలో?
నేనేరాజు నేనేమంత్రి మంచి హిట్ కదా? అయినా అది చూడలేదు. కథ. ఆయన తెచ్చిన కథ, నిజంగా ఇప్పటి వరకు స్క్రీన్ మీద రాలేదు. పైగా మాంచి పెర్ ఫార్మెన్స్ కు చాన్స్ వున్న పాత్ర.

తేజతో సెట్ మీద సమస్యలు వుంటాయేమో?
అస్సలులేవు. ఆయన నిజంగా చాలా అద్భుతమైన విషయం వున్న డైరక్టర్. సరిగ్గా పనిచేస్తే సమస్యలు ఎందుకు వస్తాయి. కాజల్ అన్నది కూడా. ఏం మాయ చేసావు. తేజగారు ఇంత సాఫ్ట్ గా కనిపిస్తున్నారు అని.

ఫైనల్ గా కవచం గురించి ఒక్కమాట
మంచి సినిమా. పూర్తిగా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే సినిమా. చూడండి.. చూసి నన్ను, ఓ కొత్త డైరక్టర్ ను ఆశీర్వదించండి.

-రాజా

మంత్రిగారికి ఓటమి తప్పదు.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments