రాజీనామా చేసిన ఒకనాటి జగన్ పార్టీ నేత!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పుడు ఆ పార్టీలో బాగా యాక్టివ్ గా ఉండిన వాళ్లలో ఒకరు జూపూడి ప్రభాకర్ రావు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున గట్టిగా వకాల్తా పుచ్చుకుని మాట్లాడారు జూపూడి. అప్పట్లో చంద్రబాబు నాయుడు మీద తీవ్రంగా ధ్వజమెత్తేవారాయన. ఆ తర్వాత చంద్రబాబుకు పూర్తిస్థాయి భజన పరుడిగా మారి, జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొండెపి నుంచి పోటీచేసి ఓడిన జూపూడి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. జగన్ పై తీవ్రంగా విమర్శలు చేసేవారు. వాటికి మెచ్చి జూపూడికి చంద్రబాబు నాయుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. దానికిగానూ జూపూడి బాగానే చంద్రబాబు భజన చేశారు. ఆఖరికి ఎస్సీ కార్పొరేషన్ రుణాల కింద దళిత యువకులకు కార్లు ఇస్తే వాటిపై చంద్రబాబు స్టిక్కర్ ను తప్పనిసరి చేశారు జూపూడి. అది వివాదాస్సదం అయ్యింది కూడా.

చంద్రబాబు బొమ్మను అతికిస్తే క్యాబ్ లలో జనాలు ఎక్కడం లేదని, తమకు ఇచ్చింది అప్పే కదా.. దానికి చంద్రబాబు బొమ్మ ఎందుకు పెట్టుకోవాలని దళిత యువకులు ప్రశ్నించినా జూపూడి వాళ్లను వదల్లేదు. చంద్రబాబు స్టిక్కర్ పీకేస్తే కార్లను వెనక్కు తీసుకున్నారు.

అంతలా చంద్రబాబు భక్తిని చూపించారు జూపూడి. ఇక ఇప్పుడు అధికారం చేతులు మారింది. దీంతో చాలామంది చంద్రబాబు భక్తుల్లానే జూపూడి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. కాస్త లేటుగానే అయినా ఆయన ఎస్సీ కార్పొరేషన్ పదవికి రాజీనామా చేశారు.

గతంలో జగన్ పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించి, తీరా జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాకా ఈయన రాజీనామా చేసి అధికారిక హోదాకు వీడ్కోలు పలికారు.

వెల్ డన్ జగన్ ..కీప్ ఇట్ అప్