జియోలో మొదలైన చార్జీలు

మొన్నటివరకు అన్నీ ఫ్రీ. చేతిలో జియో సిమ్ ఉంటే చాలు. మినిమం ప్యాకేజీ రీచార్జ్ చేసుకుంటే చాలు. ఇక విచ్చలవిడిగా వాడుకోవడమే. అన్ లిమిటెడ్ కాల్స్, యాప్స్, ఇంటర్నెట్.. ఇలా ఆలోచించాల్సిన పనే ఉండేది కాదు. కానీ ఇకపై జియో ఫోన్ నుంచి కాల్ చేసే ముందు కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును.. తొలిసారిగా కాల్ టారిఫ్ ప్రవేశపెట్టింది జియో. సంస్థను స్థాపించిన తర్వాత జియో ఇలా టారిఫ్ విధించడం ఇదే తొలిసారి.

ఇకపై జియో కాకుండా, ఇతర ఏ నెట్ వర్క్ కు ఫోన్ చేసినా నిమిషానికి 6 పైసలు చార్జి విధిస్తారు. ఇవాళ్టి నుంచి ఈ కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రెగ్యులర్ గా చేయించుకునే రీచార్జితో పాటు అదనంగా మరో టాపప్ చేయించుకోవాల్సి ఉంటుంది. రూ.10, రూ.20, రూ.50, రూ.100 టాప్-అప్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది జియో. అయితే ఈ చార్జీలు తాత్కాలికమే అంటోంది జియో. కాల్ టెర్మినేషన్ చార్జీలకు సంబంధించి  ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి తొలిగేంత వరకు మాత్రమే ఈ చార్జీలు ఉంటాయని చెబుతోంది.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఇతర నెట్ వర్క్ నుంచి తమ నెట్ వర్క్ కు కాల్స్ వస్తే, ఆ కాల్స్ పై నిర్ణీత చార్జీలు వసూలు చేస్తాయి టెలికం సంస్థలు. వీటిని దీన్ని ఐయూసీ అంటారు. లెక్కప్రకారం ఈ ఐయూసీని ట్రాయ్ రద్దుచేయాలి. కానీ అలా చేయడం లేదు. ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది. దీనివల్ల ఇతర నెట్ వర్క్స్ కు జియో వేల కోట్ల రూపాయల్లో డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. దీన్ని నిరసిస్తూ, టారిఫ్ చార్జీలు ప్రవేశపెట్టింది జియో. ట్రాయ్ ఎప్పుడైతే ఐయూసీ చార్జీలు ఎత్తేస్తుందో, అప్పుడు జియోలో కూడా ఈ అదనపు చార్జీలు నిలిచిపోతాయన్నమాట.

డిసెంబర్ 31తో ఈ చార్జీలు రద్దయ్యే అవకాశం ఉన్నట్టు స్వయంగా జియో ప్రకటించింది. అంటే.. జియో విధించిన కాల్ చార్జీలు డిసెంబర్ 31వరకు కొనసాగుతాయని అర్థం. అయితే ఇక్కడే మరో సౌలభ్యాన్ని అందించింది జియో. ఐయూసీపై నిరసనగా తమ వినియోగదారులపై కాల్ చార్జీల భారం మోపినప్పటికీ, ఆ మొత్తానికి సమానమైన ఇంటర్నెట్ డేటాను అందించబోతోంది.

ఉదాహరణకు కాల్ చార్జీల టాప్-అప్ కింద 10 రూపాయలతో రీచార్జ్ చేయించుకుంటే, 1జీబీ అదనపు డేటా లభిస్తుంది. ఇలా అన్ని టాప్-అప్స్ కు అదనపు డేటా ఆఫర్ ఇస్తోంది. ఈ డేటా సంగతి పక్కనపెడితే, ఇకపై రెగ్యులర్ గా చేసుకునే రీచార్జ్ తో పాటు అదనంగా రూ.10, రూ.20, రూ.50, 100 రూపాయలతో టాప్-అప్ కూడా చేయించుకోవాల్సిందే.

అఖిలప్రియ.. కేరాఫ్ గందరగోళ రాజకీయం!