జన సేనానిని సైనికులు తట్టుకోగలరా.?

పూటకోమాట చెప్పడంలో సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ దిట్ట. అధికారంలోకి వచ్చి తీరతామంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతారు.. అదే సమయంలో, 'టీడీపీ అయినా వైఎస్సార్సీపీ అయినా అధికారంలోకి రావొచ్చు, ఎన్నేళ్ళయినా పరిపాలించొచ్చు..' అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. అసలేంటి కథ.? జన సైనికులు, జనసేనానిని ఎలా అర్థం చేసుకోవాలి.? పార్టీ రథసారధి అయిన పవన్‌ కళ్యాణ్‌, తనను తాను జనసేనానిగా భావించినప్పుడు, సైనికులకు సరైన దిశానిర్దేశం చేయాల్సి వుంటుంది.

పోరాటం చేస్తానని చెప్పేవ్యక్తి.. ఎవరైనా అధికారంలోకి రావొచ్చునని చెబితే, ఇంకెవరి మీద జనసైనికులు పోరాడాల్సి వస్తుందట.! మొదటి నుంచీ పవన్‌ ఇంతే, రాజకీయాలపై ఖచ్చితమైన అభిప్రాయాలు ఆయనకు లేవు. తన రాజకీయ ప్రయాణంపై ఆయన తనకంటూ ఓ అవగాహన ఇప్పటిదాకా ఏర్పరచుకోకపోవడం ఆశ్చర్యకరమే.

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదేళ్ళు పూర్తయిపోతోంది జనసేన పార్టీ ఆవిర్భవించి. ఎప్పుడో చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి వుందనీ, రాజకీయాల్ని పరిశీలిస్తున్నాననీ చెప్పే పవన్‌కళ్యాణ్‌, ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారట.? అభిమానులకు అర్థంకాని ప్రశ్న ఇది. జనసైనికులుగా మారాలనుకుంటున్న, మారుతోన్న, మారిపోయిన అభిమానులు పాపం తమ 'సేనాని'కే స్పష్టత లేకపోతే, తామేం చేయగలమని గాఢంగా నిట్టూరాల్చి వస్తోంది.

గతంలో టీడీపీ - బీజేపీతో అంటకాగింది పవన్‌కళ్యాణే. ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ని వేనోళ్ళ పొడిగిందీ పవన్‌కళ్యాణే. పాత స్నేహాన్ని మర్చిపోలేదో, కొత్తగా అవసరాలొచ్చాయో చంద్రబాబు మళ్ళీ పవన్‌ని కాకా పట్టడం మొదలు పెట్టేశారు. మరోపక్క, టీఆర్‌ఎస్‌.. జనసేన విషయంలో అంత సీరియస్‌గా అయితే లేదు. అసలు జనసేనను టీఆర్‌ఎస్‌ పట్టించుకోవడమే లేదు. మొన్నామధ్య పవన్‌కి అవసరమై, కేసీఆర్‌ని కలిస్తే.. పవన్‌ తెలంగాణలో పర్యటించడానికి వీలుగా టీఆర్‌ఎస్‌ కొంత సానుకూల ధోరణి ప్రదర్శించింది.

కానీ, పవన్‌ - వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకీ టీఆర్‌ఎస్‌కీ లింకులు కడుతున్నారు. చంద్రబాబు, పవన్‌ ఒకటేనంటున్నారు. ఏంటో, ఈ వైఖరి, ఆయనకైనా అర్థమవుతుందా.? లేదా.? ఇప్పుడే ఇలావుంటే, ముందు ముందు జనసైనికులు, తమ అధినేత పవన్‌కళ్యాణ్‌ని తట్టుకోగలరా.? ఆయన రాజకీయాన్ని జీర్ణించుకోగలరా.?

ఎన్నికలు సమీపిస్తున్నాయి.. తమ పార్టీకి ఓటెయ్యాలా.? తమ పార్టీ సూచించిన ఇంకో పార్టీ అభ్యర్థికి ఓటెయ్యాలా.? ఎవర్ని ప్రశ్నించాలి.? ఎవరితో అంటకాగాలి.? పాపం, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దుస్థితి దాపురించిందంటే, పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ తీరు అలా తయారైంది మరి.

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!

Show comments